మ‌ళ్లీ షర్మిల ఇంటి వ‌ద్ద గొడ‌వ‌!

హైద‌రాబాద్ లోట‌స్‌పాండ్‌లోని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఇంటి వ‌ద్ద మ‌రోసారి గొడ‌వ‌కు దారి తీసింది. ష‌ర్మిల ఇంటి నుంచి కారులో బ‌య‌టికి వెళుతుండ‌గా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారులో ముందుకు వెళ్లేందుకు ష‌ర్మిల…

హైద‌రాబాద్ లోట‌స్‌పాండ్‌లోని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఇంటి వ‌ద్ద మ‌రోసారి గొడ‌వ‌కు దారి తీసింది. ష‌ర్మిల ఇంటి నుంచి కారులో బ‌య‌టికి వెళుతుండ‌గా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారులో ముందుకు వెళ్లేందుకు ష‌ర్మిల ప్ర‌య‌త్నించారు. పోలీసులు చుట్టుకున్నారు. డ్రైవ‌ర్‌ను కిందికి లాగి ప‌డేశారు. దీంతో షర్మిల తీవ్ర ఆగ్రహావేశానికి లోన‌య్యారు.

అస‌లు త‌న‌ను ఎందుకు అడ్డుకుంటున్నార‌ని పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. పోలీసుల‌ను నెట్టేస్తూ నిల‌దీశారు. మ‌హిళా పోలీసులు ష‌ర్మిల‌ను గ‌ట్టిగా ప‌ట్టుకుని క‌ద‌ల‌నివ్వ‌లేదు. పోలీసుల వైఖ‌రికి నిర‌స‌న‌గా రోడ్డుపై ష‌ర్మిల బైఠాయించారు. అనంత‌రం ఆమెని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు.  

త‌న‌ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నార‌న్న ష‌ర్మిల ప్ర‌శ్న‌కు పోలీసుల నుంచి స‌మాధానం రాలేదు. ఇప్ప‌టికే ష‌ర్మిల పాద‌యాత్ర‌ను పోలీసులు అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. పాదయాత్ర‌లో అధికార పార్టీ నేత‌ల్ని రెచ్చ‌గొట్టేలా మాట్లాడుతున్నార‌ని బీఆర్ఎస్ ఆరోప‌ణ‌. పాద‌యాత్ర చేసేందుకు అనుమ‌తించాల‌ని ష‌ర్మిల న్యాయ‌పోరాటం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే పోలీసుల నుంచి ఆమెకు త‌గిన అనుమ‌తులు మాత్రం ల‌భించ‌డం లేదు. 

గ‌త కొంత కాలంగా తెలంగాణ‌లో నిరుద్యోగ స‌మ‌స్య‌పై ష‌ర్మిల పోరాటం చేస్తున్నారు. తాజాగా ష‌ర్మిల అరెస్ట్‌కు కార‌ణాలేంటో తెలియాల్సి వుంది. గ‌తంలో కూడా ష‌ర్మిల‌ను ఇంటి వ‌ద్దే అరెస్ట్ చేయడం తెలిసిందే.