జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ కు తన ఆస్తి మొత్తం రాసిస్తానంటున్నారు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ లో తను పెట్టుబడులు పెట్టినట్టు నిరూపిస్తే, తన ఆస్తి రాసివ్వడమే కాకుండా, రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులు, నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో, ఆ సంస్థలో బాలినేని పెట్టుబడులు పెట్టారంటూ జనసేనకు చెందిన ఓ కార్పొరేటర్ ఆరోపణలు చేశారు. దానికి ప్రతిస్పందిస్తూ, బాలినేని, పవన్ కు సవాల్ విసిరారు.
“జనసేన కార్పొరేటర్ ఆరోపణలు చేశాడు కాబట్టి, నేను నేరుగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నే అడుగుతున్నాను. మైత్రీ మూవీ మేకర్స్ లో నేను, నా వియ్యంకుడు పెట్టుబడులు పెట్టామని నిరూపించండి. అలా చేస్తే మా ఆస్తులన్నీ మీకు రాసిస్తాం. అంతేకాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను. పవన్ సినిమా ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మైత్రీ నిర్మాతలు తెలిసే ఉంటారు, ఇక నా ఫ్రెండ్స్ దిల్ రాజు, చినబాబు కూడా తెలిసే ఉంటుంది. వాళ్లను అడగండి, నేను పెట్టుబడులు పెట్టానని నిరూపించండి.”
మైత్రీ మూవీ మేకర్స్ లో పెట్టుబడులు ఉన్నాయి కాబట్టే, ఒంగోలులో వీరసింహారెడ్డి సినిమాకు బాలినేని స్పెషల్ పర్మిషన్ ఇప్పించారంటూ చేసిన ఆరోపణల్ని కూడా ఎమ్మెల్యే ఖండించారు. తను ఏ సినిమాకైనా ఒకేలా సపోర్ట్ చేస్తానని, ప్రజలకు వినోదం అందుతుంది కాబట్టి తనవంతు సహకారం అందిస్తానన్నారు.
వీరసింహారెడ్డి పర్మిషన్ల విషయంలో కూడా తనను నిర్మాతలు సంప్రదించలేదని, తన నియోజకవర్గానికి చెందిన దర్శకుడు గోపీచంద్ మలినేని కలిసి విజ్ఞప్తి చేయడంతో సపోర్ట్ చేశానని అన్నారు. తనపై కూడా ఐటీ అధికారులు దాడులు చేసేలా ఉసిగొల్పడం కోసం జనసేన పార్టీ ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు బాలినేని.