ఆదమరిస్తే గోవిందా..గోవిందా..!

ఈ ఆన్ లైన్ యుగంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కళ్లముందే దోచేస్తారు. ప్రతి రోజూ ఎన్నో ఆన్ లైన్ మోసాలు చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా దేవదేవుడి దర్శనాన్నే ఫేక్ చేశారు కొంతమంది కేటుగాళ్లు.…

ఈ ఆన్ లైన్ యుగంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కళ్లముందే దోచేస్తారు. ప్రతి రోజూ ఎన్నో ఆన్ లైన్ మోసాలు చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా దేవదేవుడి దర్శనాన్నే ఫేక్ చేశారు కొంతమంది కేటుగాళ్లు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ కు ఫేక్ క్రియేట్ చేసి, సరికొత్త దోపిడీకి తెరదీశారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి దాదాపు అన్ని సేవలు ఇప్పుడు ఆన్ లైన్ అయ్యాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కూడా ప్రతి నెల ఆన్ లైన్ లో విడుదలవుతుంటాయి. ఈ సైట్ ను లక్షల మంది భక్తులు సందర్శిస్తుంటారు. దీంతో ఇదే సైట్ ను తలపించేలా నకిలీ సైట్లు పుట్టుకొస్తున్నాయి.

ఒరిజినల్ సైట్ కాకుండా, ఈ నకిలీ సైట్లలో ఎంటరైతే జేబులకు చిల్లు పడ్డట్టే. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 41 టీటీడీ ఫేస్ సైట్లు పుట్టుకొచ్చాయి. ఈ సైట్లను గుర్తించిన టీటీడీ, వాటికి సంబంధించిన వివరాల్ని పోలీసులకు అందించింది.

ఈ ఫేక్ సైట్లు అచ్చుగుద్దినట్టు టీటీడీ అధికారిక సైట్ ను పోలి ఉంటాయి. పైగా, శ్రీవారి దర్శనాన్ని త్వరగా ఇప్పిస్తామని, దర్శనంతో పాటు క్యాటేజీ ప్యాకేజీలంటూ కొన్ని ఆఫర్లు కూడా పెడుతున్నాయి. అంతేకాదు, హుండీ కానుకలు కూడా ఈ సైట్ ద్వారా స్వీకరిస్తున్నారు. కొంతమంది భక్తులు ఈ విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ మేటర్ బయటపడింది.

తప్పు టీటీడీది కూడా ఉంది..

టిటీడీ అధికారిక సైట్ చాన్నాళ్లుగా చలామణిలో ఉంది. ఇప్పటివరకు ఎప్పుడూ రాని ఈ ఫేక్ సైట్లు ఇప్పుడే ఎందుకు పుట్టుకొస్తున్నాయి? దీనికి కారణం టీటీడీ తన వెబ్ సైట్ ను మార్చడమే. ఒకప్పుడు ttdeseva అనే వెబ్ సైట్ ఉండేది. చాన్నాళ్లు అదే అధికారిక సైట్ గా కొనసాగింది. ఉన్నట్టుండి సడెన్ గా వెబ్ సైట్ పేరు మార్చారు. tirupatibalaji.ap.gov.in అనే కొత్త సైట్ క్రియేట్ చేశారు. దీనికి అనుబంధంగా మరో సైట్ కూడా పెట్టడంతో చాలామందిలో అయోమయం నెలకొంది. దీంతో టీటీడీ సైట్ కు నకిలీలు పుట్టుకొచ్చాయి.

ప్రస్తుతం తమ అధికారిక వెబ్ సైట్ కు ప్రచారం కల్పించడంలో కూడా టీటీడీ పెద్దగా ఆసక్తి చూపించలేదు. వెబ్ సైట్ పేరు మార్చిన కొత్తలో కొంత ప్రచారం చేసిన సంస్థ, ఆ తర్వాత ఆ అంశాన్ని వదిలేసింది. ఎప్పుడైతే టీటీడీ లైట్ తీసుకుందో, ఆ వెంటనే ఫేక్ సైట్లు పుట్టుకు రావడం మొదలయ్యాయి.