షూటింగ్ కోసం ప‌ర్మిష‌న్ అడిగితే, హీరోయిన్ని ర‌మ్మ‌న్నాడ‌ట‌!

మ‌ధ్య‌ప్ర‌దేశ్ అట‌వీ శాఖా మంత్రి విజ‌య్ షా సంచ‌ల‌న వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆ రాష్ట్రంలో షూటింగ్ కోసం ఒక సినిమా యూనిట్ ప‌ర్మిష‌న్ కోర‌గా.. అందుకు గానూ ఆ సినిమా హీరోయిన్ ని విందుకు…

మ‌ధ్య‌ప్ర‌దేశ్ అట‌వీ శాఖా మంత్రి విజ‌య్ షా సంచ‌ల‌న వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆ రాష్ట్రంలో షూటింగ్ కోసం ఒక సినిమా యూనిట్ ప‌ర్మిష‌న్ కోర‌గా.. అందుకు గానూ ఆ సినిమా హీరోయిన్ ని విందుకు ర‌మ్మ‌న్నాడ‌ట స‌ద‌రు మంత్రిగారు. ఆ ప్ర‌తిపాద‌న‌కు ఆ హీరోయిన్ నో చెప్ప‌గా, షూటింగ్ లేదూ ఏమీ లేదూ.. వెళ్లిపొండ‌ని, అనుమ‌తిని నిరాక‌రించార‌ట ఈ బీజేపీ నేత‌. ఈ వివాదం ముంబై నుంచి ఢిల్లీ వ‌ర‌కూ సంచ‌ల‌నం రేపుతోందిప్పుడు!

మంత్రిగారు ర‌మ్మ‌ని పిలుచుకున్న హీరోయిన్ మ‌రెవ‌రో కాదు విద్యాబాల‌న్. ఇలా ఒక స్టార్ హీరోయిన్ ను మంత్రిగారు విందుకు పిలిచి, ఆమె రాక‌పోయే స‌రికి సినిమా షూటింగుకు ప‌ర్మిష‌న్ ను నిరాక‌రించార‌నే వార్త‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. 

విద్యాబాల‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో షేర్నీ అనే ఒక సినిమా రూపొందోంది. గ‌త కొన్నాళ్లుగా ఆ సినిమా మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో షూటింగ్ జ‌రుపుకుంటూ ఉంది. ఈ సినిమాలో కొంత భాగాన్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని అడ‌వుల్లో నిర్వ‌హించాల‌ని యూనిట్ భావించింద‌ట‌.

అందు కోసం ప‌ర్మిష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు పెట్టుకోగా.. అది మంత్రిగారి వ‌ద్ద వ‌ర‌కూ వెళ్లింద‌ట‌. ఈ నేప‌థ్యంలో విద్యాబాల‌న్  త‌న‌తో డిన్న‌ర్ కు రావాల‌ని కోరార‌ట మంత్రిగారు. దానికి ఆమె నిరాక‌రించే స‌రికి, ఆ సినిమా షూటింగ్ కు ప‌ర్మిష‌న్ ద‌రఖాస్తును మంత్రి ప‌క్క‌న ప‌డేసిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ అంశంపై విజ‌య్ షా కూడా స్పందించేశారు. త‌ను ఎవ‌రినీ విందుకు పిల‌వ‌లేదని ఆ మంత్రిగారు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. త‌ననే ఆ సినిమా యూనిట్ విందుకు పిలిచింద‌ని, అందుకు త‌ను నిరాక‌రించే స‌రికి వారు విందును క్యాన్సిల్ చేసుకున్నార‌ని మంత్రిగారు వివ‌ర‌ణ ఇస్తున్నారు. 

మీ టూ కాలంలో ఇలా మంత్రిగారు.. షూటింగ్ ప‌ర్మిష‌న్ కోసం హీరోయిన్ త‌న వ‌ద్ద‌కు రావాల‌నే ష‌ర‌తు విధించాడ‌నే అంశం సంచ‌ల‌నం రేపుతూ ఉంది. మంత్రిగారు మాత్రం త‌న‌కేం తెలియ‌ద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకుంటున్నారు!

పవన్ కు ఒక నీతి.. ప్రకాష్ రాజ్ కు మరో నీతి