తెలంగాణలో వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులంతా సుప్తచేతనావస్తలో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఓ దఫా తమ దమ్ము చూపించినా.. అనంతరం జరిగిన పరిణామాలు, తెలంగాణపై జగన్ ఫోకస్ తగ్గడంతో వారంతా సైలెంట్ అయ్యారు.
ఎవరు ఏ పార్టీ తరపున పనిచేస్తున్నా.. లోపల వైఎస్ఆర్ అనే బంధం అందరినీ కలిపే ఉంచింది. ఆ బంధంతోటే వారు ఇంకా.. వైసీపీ అధిష్టానంతో టచ్ లోనే ఉన్నారు. ఇప్పటికీ వైఎస్ఆర్ అభిమానులందరిదీ ఒకే బాట, ఒకేమాట.
అయితే ఇప్పటివరకూ రాజకీయంగా స్లీపర్ సెల్స్ గా ఉన్న వీళ్లంతా జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
బీజేపీకి గండి..
ఏపీలో ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా ఎగిరెగిరి పడుతున్న బీజేపీకి గ్రేటర్ లో గండి కొట్టాలనేది తెలంగాణ వైసీపీ శ్రేణులు ఆలోచన. అవసరం లేకపోయినా వైఎస్ఆర్ మరణాన్ని అవమానించిన బీజేపీకి మరింత గట్టిగా బుద్ది చెప్పాలని కార్యకర్తలు ఆవేశంతో రగిలిపోతున్నారు.
గ్రేటర్ లో బీజేపీ బలం పుంజుకుంటే.. ఆ ప్రభావం కాస్తో కూస్తో ఏపీలో కనిపించక మానదు. అందులోనూ తిరుపతి బైపోల్ కి టైమ్ దగ్గర పడుతోంది. ఈ దశలో బీజేపీ బలపడటం వైసీపీకి ఏమాత్రం మంచిది కాదు. బీజేపీపై వైఎస్ఆర్ అభిమానులకు ఉన్న వ్యతిరేకత పరోక్షంగా టీఆర్ఎస్ కి మద్దతుగా మారబోతోంది.
కేసీఆర్ కు దన్ను
చిన్నచిన్న పొరపొచ్చాలు ఉన్నప్పటికీ జగన్-కేసీఆర్ మధ్య స్నేహబంధం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. దాన్ని మరింత కొనసాగించేలా గ్రేటర్ లో కేసీఆర్ కు అనుకూలంగా వైసీపీ కార్యకర్తలు పనిచేయబోతున్నారని తెలుస్తోంది.
చంద్రబాబుతో జగన్, కేసీఆర్ కి ఉన్న ఉమ్మడి శతృత్వం వారిని మిత్రులుగా కొనసాగిస్తోంది. బాబుని గట్టిగా దెబ్బకొట్టాలన్నా, తెలంగాణలో, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో టీడీపీని చావు దెబ్బ కొట్టాలన్నా.. దానికి కేసీఆరే సరైనోడు కాబట్టి వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ విజయాన్నే కోరుకుంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.
సామాజిక సమీకరణాలు..
ఇక ఏపీలో రెండు సామాజిక వర్గాల మధ్య ఉన్న బలమైన రాజకీయ వైరం గ్రేటర్ ఎన్నికల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపుపై ఆశ లేకపోయినా టీడీపీ నాయకులు గ్రేటర్ లో రెచ్చిపోతున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు సామాజిక వర్గం సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్న డివిజన్లలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. వాళ్లకు చెక్ పెట్టడం కోసం వైసీపీని అభిమానించే వర్గాలన్నీ రెడీ అయ్యాయి. టీడీపీకి చెక్ పెడుతూనే, అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.
మొత్తంగా గ్రేటర్ ఎన్నికల వేళ.. వైసీపీ శ్రేణులు, వైసీపీని సపోర్ట్ చేసే సామాజిక వర్గాలు పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యాయి. టీఆర్ఎస్ కి అనుకోని వరంలా మారాయి.