తనపై నాగబాబు చేసిన విమర్శల్ని ఇప్పటికే ట్విట్టర్ వేదికగా తిప్పికొట్టిన ప్రకాష్ రాజ్.. పవన్ గురించి తను చేసిన కామెంట్స్ పై మరోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సైద్ధాంతికంగా అభిప్రాయబేధాలు ఉంటాయి తప్ప.. తమ మధ్య వృత్తిగతంగా ఎలాంటి బేధాలు ఉండవని చెబుతున్నాడు ప్రకాష్ రాజ్.
“పవన్, మహేష్, ఎన్టీఆర్ తో అభిప్రాయబేధాలు ఉన్నాయని చాలామంది అంటుంటారు. కానీ వాళ్లతోనే తిరిగి పనిచేస్తున్నాను కదా. ఇప్పుడు పవన్ నే తీసుకుందాం. ఆయనతో నాకు గొడవ అంటున్నారంతా. కానీ ఆయనతో వకీల్ సాబ్ అనే పెద్ద సినిమా చేస్తున్నాను.
పవన్ సిద్ధాంతాలతో నేను ఏకీభవించను. పొలిటికల్ గా మా మధ్య అభిప్రాయబేధాలు ఉండొచ్చు. కానీ వృత్తిగత జీవితంలోకి వాటిని తీసుకురాకూడదు. ప్రేక్షకులకు మా సమస్యలతో ఏంటి పని. వాళ్లకు సినిమా కావాలి.”
సెట్స్ లో తనకు పవన్ కు మధ్య చాలా చర్చలు నడుస్తుంటాయని.. తమ ఎజెండాలపై ఇద్దరం గట్టిగా వాదించుకుంటామని చెబుతున్నాడు ప్రకాష్ రాజ్. అయితే అదంతా షార్ట్ రెడీ అన్నంత వరకే. ఆ తర్వాత ఎవరి పని వాళ్లు చేస్తామని చెబుతున్నాడు.
“సెట్స్ లో పవన్ తో చర్చలు జరుగుతుంటాయి. నా పాయింట్ మీద నేను ఉంటాను. ఆయన పాయింట్ మీద ఆయన ఉంటారు. షాట్ రెడీ అనగానే వెళ్లి మా పని మేం చేసుకుంటాం. నేను రాసిన దోసిట చినుకులు అనే పుస్తకం ఆయనకు నచ్చింది. డిఫరెంట్ గా ఆలోచిస్తారు మీరు అని మెచ్చుకున్నారు. పవన్ అంటే నాకిష్టం. కానీ రాజకీయంగా కొన్ని అభిప్రాయబేధాలున్నాయి. ఇదే విషయం ఆయనతో కూడా చెప్పాను.”
రాజకీయాల్లో పవన్ ను ఊసరవెల్లితో పోల్చారు ప్రకాష్ రాజ్. గడిచిన ఆరేళ్లలో పవన్ చాలాసార్లు మాట మార్చారని, రాజకీయంగా ఆయనకు సిద్ధాంతం లేదని ఘాటుగా విమర్శించారు. అప్పట్నుంచి నాగబాబు, పవన్ ఫ్యాన్స్ తో ప్రకాష్ రాజ్ కు మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా తన వాదనను మరోసారి సమర్థించుకున్నారు ప్రకాష్ రాజ్.