ల‌క్కీ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఇన్ చార్జే లేరా!

అనంత‌పురం జిల్లా శింగ‌న‌మల నియోజ‌క‌వ‌ర్గానికి ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌త్యేక‌త  ఉంది. అదేమిటంటే.. ఇక్క‌డ ఏ పార్టీ అయితే గెలుస్తోందో, ఆ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేప‌డుతుంది. ఈ లెక్క ఇప్ప‌టిది కాదు. చాలా యేళ్లుగా…

అనంత‌పురం జిల్లా శింగ‌న‌మల నియోజ‌క‌వ‌ర్గానికి ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌త్యేక‌త  ఉంది. అదేమిటంటే.. ఇక్క‌డ ఏ పార్టీ అయితే గెలుస్తోందో, ఆ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేప‌డుతుంది. ఈ లెక్క ఇప్ప‌టిది కాదు. చాలా యేళ్లుగా ఇదే వ‌ర‌స‌. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆమె భారీ మెజారిటీతో నెగ్గారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేప‌ట్టింది.

2014లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నెగ్గింది. అప్పుడు టీడీపీ అధికారాన్ని సాధించింది. 2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున సాకే శైల‌జానాథ్ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నెగ్గారు. అప్పుడు వైఎస్ నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. 2004లో కూడా శైల‌జానాథ్ ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా తొలి సారి నెగ్గారు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. 1994- 1999ల‌లో ఇక్క‌డ నుంచి టీడీపీ అభ్య‌ర్థి కొత్త‌ప‌ల్లి జ‌య‌రాం విజ‌యం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో అధికారం టీడీపీకి అందింది. ఇక 1989లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున శ‌మంత‌క‌మ‌ణి ఎమ్మెల్యేగా నెగ్గారు. అప్పుడు కాంగ్రెస్ అధికారాన్ని చేప‌ట్టింది. అంత‌కన్నా ముందు.. 1983, 1985ల‌లో తెలుగుదేశం పార్టీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నెగ్గింది. స‌రిగ్గా 1983 నుంచి ఈ సెంటిమెంట్ కొన‌సాగుతూ ఉంది.

అప్ప‌టి నుంచి రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీ అధికారంలో ఉంటే శింగ‌న‌మ‌ల‌లో అదే పార్టీ నెగ్గ‌డం, శింగ‌న‌మల‌లో నెగ్గిన పార్టీ రాష్ట్ర‌మంతా నెగ్గ‌డం ఆన‌వాయ‌తీగా కొన‌సాగుతూ వ‌స్తోంది. ఒక‌ర‌కంగా ఈ నియోజ‌క‌వ‌ర్గం ల‌క్కీ సెంటిమెంట్. శింగ‌న‌మ‌ల విజ‌యం ఏ పార్టీకి అయినా అమితానందాన్ని ఇచ్చే అంశం.

మ‌రి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుత రాజ‌కీయానికి వ‌స్తే.. ఇక్క‌డ టీడీపీకి క‌నీసం ఇన్ చార్జి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం! ఒక‌ప్పుడు శింగ‌న‌మ‌ల టీడీపీకి బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గ‌మే. పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత ఈ నియోక‌వ‌ర్గం రూపు రేఖ‌లు మారినా టీడీపీకి లోటేం లేదు. గ‌తంలో జ‌య‌రాం, ఆ త‌ర్వాత శ‌మంత‌క‌మ‌ణి – యామినిబాల టీడీపీ త‌ర‌ఫున క్రియాశీల‌కంగా ప‌ని చేశారు. ఈ రిజ‌ర్వ్డ్ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌ర‌ఫున నెగ్గారు వాళ్లు. 2014లో యామిని బాల ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించారు. జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తిపై యామిని బాల విజ‌యం సాధించారు.

అయితే గ‌త ఎన్నిక‌ల స‌మ‌యానికి ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా జేసీ కుటుంబం చేతిలోకి వెళ్లింది. తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గానికి ఆనుకుని మొద‌లవుతుంది శింగ‌న‌మ‌ల‌. తాడిప‌త్రి-అనంత‌పురం- ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ల మ‌ధ్య‌న ఇది ఉంటుంది. దీంతో మొద‌టి నుంచి ఈ ప్రాంతాల నేత‌ల ప్ర‌భావం శింగ‌న‌మ‌ల‌పై ఎక్కువ‌. తెలుగుదేశం పార్టీలో తాము యాక్టివేట్ అయ్యాకా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అంతా త‌మ క‌నుస‌న్న‌ల్లో జ‌రిగేలా చూసుకుంటున్నారు జేసీ కుటుంబీకులు. 2014లో ఈ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ముందుగా శైల‌జానాథ్ కు ఖ‌రారు అయ్యింది. శైల‌జానాథ్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరి బీఫారం కూడా పొందారు. నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు ఆయ‌న ఆఫీసుకు వెళ్లాకా, అక్క‌డ జేసీ ప‌వ‌న్ బ‌ల‌వంతంగా శైల‌జానాథ్ చేతుల్లోంచి టీడీపీ బీఫారాన్ని లాక్కొన్నారు!

తామంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడు శైల‌జానాథ్ అంటే జేసీల‌కు ప‌డ‌లేదు. కాంగ్రెస్ పార్టీలో కిర‌ణ్ సీఎం అయ్యాకా శైల‌జానాథ్ మంత్రి కూడా అయ్యాడు. అలా అప్ప‌టి క‌క్ష‌తో తెలుగుదేశం పార్టీ బీఫారాన్ని సైతం శైల‌జానాథ్ చేతుల్లోంచి జేసీ ప‌వ‌న్ లాక్కొన్నారు. ఎవ‌రు పోటీ చేసినా ఫ‌ర్వాలేదు శైల‌జానాథ్ వ‌ద్ద‌న్న‌ట్టుగా జేసీ ఫ్యామిలీ వ్య‌వ‌హ‌రించింది. చివ‌ర‌కు అప్పుడు యామినిబాల‌కు టికెట్ ద‌క్కింది. అయితే 2019లో పూర్తిగా త‌మ మ‌నిషిని బ‌రిలోకి దించారు జేసీ కుటుంబీకులు. టీడీపీ త‌ర‌ఫున బండారు శ్రావ‌ణిని బ‌రిలోకి దించారు. జేసీ ప‌వ‌న్ కు ఆమె చాలా ద‌గ్గ‌రి మ‌నిషి అనే ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆమె ఎన్నిక‌ల్లో నెగ్గ‌లేక‌పోయారు.

బండారు శ్రావ‌ణిపై జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి దాదాపు 46 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. మ‌రి ఇదంతా గ‌తం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ల‌క్కీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు నెగ్గుతార‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున త‌మ‌కే మ‌రోసారి టికెట్ అనే ధీమాతో ఉన్నారు ప‌ద్మావ‌తి. నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె చాలా యాక్టివ్ గా ప‌ని చేసుకుంటూ ఉన్నారు. అయితే టీడీపీ త‌ర‌ఫున మాత్రం అభ్య‌ర్థిపైనే కాదు, ఇన్ చార్జి ఎవ‌ర‌నే క్లారిటీ కూడా లేదు.

గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున యాక్టివ్ గా ప‌ని చేసిన శ‌మంత‌క‌మ‌ణి, యామినిబాల ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరిని ద‌గ్గ‌రుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి దంప‌తులు. బ‌హుశా బండారు శ్రావ‌ణినే మ‌ళ్లీ పోటీ చేయిస్తారా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం.

అయితే ఈ ఎస్సీ రిజ‌ర్వ్డ్ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీలో క‌మ్మ‌ల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. నార్ప‌ల మండ‌లంలో క‌మ్మ వాళ్ల జ‌నాభా కొంత వ‌ర‌కూ ఉంది. దీంతో ఆది నుంచి శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో వారిదే హ‌వా. టీడీపీ త‌ర‌ఫున ఇన్ చార్జి, ఎమ్మెల్యేగా ఎవ‌రున్నా.. కొంద‌రు క‌మ్మ‌వాళ్లు  తామే ఎమ్మెల్యేలుగా చ‌లామ‌ణిలో ఉంటారు. మ‌రి ఇప్పుడు వారు ఎవ‌రికి మ‌ద్ద‌తుగా నిలుస్తార‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. బండారు శ్రావ‌ణి అభ్య‌ర్థిత్వాన్ని వారు ఆమోదించాల్సి ఉంటుంది! కేవ‌లం జేసీ ఫ్యామిలీ అండ‌దండ‌లు స‌రిపోక‌పోవ‌చ్చు. ఈ రాజ‌కీయంతోనే ఇక్క‌డ టీడీపీ ఇన్ చార్జిని కూడా ఇంకా ప్ర‌క‌టించుకోలేని ప‌రిస్థితుల్లో ఉండ‌వ‌చ్చు!