‘ది బాయ్ నెక్ట్స్ డోర్’ పై వివేక హ‌త్య కేసా..న‌మ్మ‌లేం!

పేరున్న రాజ‌కీయ కుటుంబం ఇంటి పేరు ఉందంటే చాలు చాలా మంది చెల‌రేగిపోతూ ఉంటారు. త‌మ ఇంటి పేరుతో ఎవ‌రైనా ప్ర‌ముఖుడుగా ఎదిగి ఉన్నా చాలు కొంద‌రు రెచ్చిపోతూ ఉంటారు. స‌ద‌రు ప్ర‌ముఖుడితో త‌మ‌కు…

పేరున్న రాజ‌కీయ కుటుంబం ఇంటి పేరు ఉందంటే చాలు చాలా మంది చెల‌రేగిపోతూ ఉంటారు. త‌మ ఇంటి పేరుతో ఎవ‌రైనా ప్ర‌ముఖుడుగా ఎదిగి ఉన్నా చాలు కొంద‌రు రెచ్చిపోతూ ఉంటారు. స‌ద‌రు ప్ర‌ముఖుడితో త‌మ‌కు బీర‌కాయ పీచు సంబంధం ఉందంటూ తెగ ఊగిపోతూ ఉంటారు. అంత‌టితో ఆగ‌రు మ‌రి కొంద‌రు. ఆ ఇంటి పేరును మార్కెటింగ్ చేసుకుంటారు. త‌మ ద‌ర్పానికి ప్ర‌తీక‌గా ఉప‌యోగిస్తారు. దందాలు చేయ‌డానికి అయినా వెనుకాడ‌రు! అదేమంటే.. ఇంటి పేరును వాడేస్తూ ఉంటారు. 

ఇలా చెట్టుపేరు చెప్పి కాయ‌ల‌మ్ముకునే ర‌కాలకు ఏ మాత్రం కొద‌వ లేదు తెలుగునాట‌. రాజ‌కీయంగా అయితే ఇలాంటి ఇంటి పేర్ల‌కు మ‌రింత డిమాండ్ కూడా! త‌మ ఇంటి పేరు చెప్పేసి దందాలు చేసిన వారు కోకొల్ల‌లు.

ఇలా ఇంటి పేరుతోనే ముందుగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఒక‌రు వైఎస్ అవినాష్ రెడ్డి. ఇత‌డి పేరు క‌డ‌ప అవ‌త‌ల కాస్త వినిపించింది వైఎస్ ష‌ర్మిల పాద‌యాత్ర స‌మ‌యంలో. ష‌ర్మిల పాద‌యాత్ర‌లో అవినాష్ పాల్గొన్నాడు. బ‌హుశా చాలా త‌క్కువ మందికే తెలిసిన అంశం కూడా ఇది. ష‌ర్మిల‌తో పాటు అవినాష్ కూడా సుదూరం న‌డిచాడు. అయినా ఎవ‌రికీ పెద్ద‌గా తెలీదంటే ఇత‌డు ఎంత కామ్ గా న‌డిచాడో అర్థం చేసుకోవ‌చ్చు. 

ష‌ర్మిల పాద‌యాత్ర‌లో అవినాష్ క‌నిపించిన తీరు చాలా మందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ కు స‌మీప బంధువు, అది కూడా ష‌ర్మిల పాద‌యాత్ర‌లో యాక్టివ్ గా న‌డుస్తున్నాడంటే.. అత‌డి హ‌డావుడి మామూలుగా ఉండ‌కూడ‌దు!

మందీమార్బ‌లం, జేజేలు కొట్టించుకోవ‌డం, పేప‌ర్లో వార్త‌లు రాయించుకోవ‌డం, అది కూడా త‌నంటూ ఒక‌డున్నాడంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న స‌మ‌యం కాబ‌ట్టి.. చాలా హ‌డావుడి రొటీనే. అయితే అవినాష్ వ‌ద్ద ఇలాంటి హ‌డావుడి లేదు. త‌న‌ను అంతా గుర్తించాల‌నే పాకులాట లేదు. అలాగ‌ని త‌నేదో వైఎస్ కుటుంబీకుడు కాబ‌ట్టి ద‌ర్పం చూపించ‌డ‌మూ లేదు. అంద‌రిలో ఒక‌డిగా అవినాష్ ఆ రోజు క‌నిపించాడు. ఇత‌డే అవినాష్ రెడ్డి, జ‌గ‌న్ వాళ్ల త‌మ్ముడి వ‌ర‌స అంటూ అప్పుడు పాద‌యాత్ర‌లో పాల్గొన్న వారు ప‌క్క‌న అనుకునేవారు. పేప‌ర్ల‌లో అప్ప‌టికే అవినాష్ రెడ్డి పేరు ప్ర‌చురితం అయిన వైనాన్ని చూసిన వారు కూడా.. ఇత‌డేంటి ఇంత సింపుల్ గా ఉన్నాడ‌నుకునే కామెంట్లు చేశారు!

మందీమార్బ‌లం వెంట లేదు, హ‌డావుడి లేదు, ద‌ర్పం లేదు.. సామాన్యుడిలా అంద‌రిలో ఒక‌డిగా న‌డుస్తున్న అవినాష్ రెడ్డి కి దక్కిన మొద‌టి గుర్తింపు అది. ఇక అవినాష్ క‌డ‌ప ఎంపీగా నెగ్గిన త‌ర్వాత అత‌డిని ర‌క‌ర‌కాల ప‌నుల మీద క‌లిసిన వారు కూడా అత‌డి నేచ‌ర్ ను అభినందిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారే. అవినాష్ చాలా సింపుల్ అని, చ‌క్క‌గా ప‌ల‌క‌రిస్తార‌ని, బాయ్ నెక్ట్స్ డోర్.. అంటూ అవినాష్ గురించి అభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. రాజ‌కీయంగా కూడా ప్ర‌త్య‌ర్థుల‌పై అవినాష్ రెడ్డి రెచ్చిపోయిన దాఖ‌లాలు కానీ, క‌నీసం గ‌ట్టి విమ‌ర్శ‌లు చేయ‌డం కానీ, ప్ర‌త్య‌ర్థుల‌ను అణ‌గ‌దొక్కే వైనం గురించి కానీ చిన్న వార్త కూడా లేదు!

క‌డ‌ప జిల్లాలో తెలుగుదేశం మద్ద‌తుదార్ల‌కూ కొద‌వ‌లేదు. అలాంటి వారు కూడా త‌మ‌కు అవ‌స‌రం అయిన సంద‌ర్భంలో అవినాష్ సాయం కోర‌గా త‌మ ప‌ట్ల సానుకూలంగా స్పందించార‌ని కూడా వారు చెబుతారు. ఒక ప‌ల్లెలో ప‌క్కా తెలుగుదేశం ఆ కుటుంబం. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని ఆ ప‌ల్లెలో టీడీపీ త‌ర‌ఫున స‌ర్పంచ్ ప‌ద‌వికి నామినేష‌న్ వేసేది కూడా ఆ కుటుంబీకులే. సాధార‌ణ వ్య‌వ‌సాయ‌ధార కుటుంబ‌మే. 

తెలుగుదేశం అంటే అభిమానం. ఆ కుటుంబం అడ‌వి పందుల కోసం తోట ద‌గ్గ‌ర క‌రెంటు వ‌ద‌ల‌గా, ఆ ఇంటి మ‌హిళే ఒక‌రు ఆ క‌రెంటుకు బ‌ల‌య్యారు. మామూలుగా అయితే ఇది కేసు. అలా క‌రెంటు పెట్ట‌డ‌మే నేరం. అయితే ఆ కుటుంబం ఆమెను మ‌హిళా రైతుగా చూపించి, విద్యుత్ శాఖ నుంచి ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ డ‌బ్బులు అందేలా చూడ‌మంటూ నివేదించింది. పందుల కోసం విద్యుత్ వ‌ద‌లిన వైనాన్ని దాచేసి, ఆమె మోటర్ పెట్ట‌డానికి వెళ్లి విద్యుత్ బారిన ప‌డిన‌ట్టుగా పేర్కొంది. దీనిపై ఆ కుటుంబం అవినాష్ సాయం కోర‌గా.. మాన‌వ‌తా ధోర‌ణితో వారికి సాయం అందేలానే చూశారు, అది కూడా ఎంపీ ఆఫీసే ఈ విష‌యంలో ఫాలో అప్ చేసి వారికి సాయం అందేలా చూసింది.

క‌డ‌ప జిల్లాలో అవినాష్ రాజ‌కీయం ఎలా సాగిందో చెప్ప‌డానికి ఇదో చిన్న ఉదాహ‌ర‌ణ‌. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే తార‌త‌మ్యాలు పెద్ద‌గా లేకుండా, వివాద ర‌హితంగా, క‌క్ష‌లుకార్ప‌ణ్యాలు లేకుండా చాలా సింపుల్ గా సాగింది అవినాష్ రాజ‌కీయం. మ‌రి ఈ బాయ్ నెక్ట్స్ డోర్ మీద కొన్నాళ్లుగా తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అది కూడా త‌మ కుటుంబీకుడు అయిన వైఎస్ వివేకానంద‌రెడ్డిని అవినాష్ రెడ్డి హ‌త్య చేయించార‌నే ఆరోప‌ణ‌లు ప‌చ్చ‌మీడియాలో విప‌రీతంగా వ‌స్తున్నాయి. సీబీఐ కూడా ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయ‌ని కోర్టులో వాదిస్తోంది.

మ‌రి చ‌ట్టం, న్యాయం, మీడియా ట్ర‌య‌ల్స్… ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే, అవినాష్ రెడ్డి శైలిని దాదాపు ప‌దేళ్ల నుంచి ప‌రిశీలిస్తున్న వారు మాత్రం 'అబ్బే..' అంటారు! వివేక‌ను ఎవ‌రు హ‌త్య చేయించారు, ఎందుకు చేయించారు అనే వాదోప‌వాదాల‌న్నీ ప‌క్క‌న పెడితే, వ్య‌క్తిగతంగా అవినాష్ ను మాత్రం హ‌త్య‌లు చేయించేవాడ‌ని మాత్రం ఎవ్వ‌రూ గ‌ట్టిగా అన‌లేని ప‌రిస్థితే క‌డ‌ప జిల్లా వ‌ర‌కూ ఉంది. 

ఈ కేసులో చాలా పేర్లు వినిపిస్తూ వ‌స్తున్నాయి. వారి ఇమేజ్ లో పోలిస్తే అవినాష్ ప‌ర్స‌న‌ల్ ఇమేజ్ మాత్రం చాలా క్లీన్ గా ఉంది ప్ర‌జ‌ల్లో! ఇది ప్ర‌జ‌ల గురించి చ‌ర్చ‌. సీబీఐ, సీబీఐ క‌న్నా ఎక్కువ‌గా ఇంట‌రాగేట్ చేస్తున్న మీడియా .. ఇవ‌న్నీ ఎలా ఉన్నా, ప్ర‌జ‌ల వ‌ర‌కూ వ‌స్తే మాత్రం  అవినాష్ ఇంకా బాయ్ నెక్ట్స్ డోరే!