ఇదేమి సెల్ఫీ ఛాలెంజ్ రా బాబూ…?

తెలుగుదేశం తమ్ముళ్లు ఇపుడు సెల్ఫీ చాలెంజిలతో పోటీ పడుతున్నారు. మా హయాంలో ఎన్నో చేశామని చెప్పుకోవడానికి సెల్ఫీలతో  అభివృద్ధి చేసిన ప్రదేశాల వద్ద ఫోటోలు తీసుకుని వైసీపీకి చాలెంజి చేస్తున్నారు. దీన్ని నారా లోకేష్…

తెలుగుదేశం తమ్ముళ్లు ఇపుడు సెల్ఫీ చాలెంజిలతో పోటీ పడుతున్నారు. మా హయాంలో ఎన్నో చేశామని చెప్పుకోవడానికి సెల్ఫీలతో  అభివృద్ధి చేసిన ప్రదేశాల వద్ద ఫోటోలు తీసుకుని వైసీపీకి చాలెంజి చేస్తున్నారు. దీన్ని నారా లోకేష్ పాదయాత్రలో మొదలెట్టారు. చంద్రబాబు వెళ్లి నెల్లూరు లోని టిడ్కో కట్టడాల వద్ద సెల్ఫీ చాలెంజి చేస్తే ఆ ఇళ్ళు అధికభాగం తాము కట్టి పూర్తిచేశామని వైసీపీ కౌంటర్ ఇచ్చింది.

ఈ సెల్ఫీల చాలెంజి వ్యవహారం ఇపుడు ఎంత దాకా వచ్చిందంటే ఈ రోడ్డు మేము వేశాం, ఈ ఇటుక మేము తెచ్చి పెట్టామని చెబుతూ తమ్ముళ్ళు సెల్ఫీలు దిగేస్తున్నారు. ఆఖరుకు కాదేదీ అనర్హం అన్నట్లుగా అన్న క్యాంటీన్లు కూడా సెల్ఫీలకు బలి అవుతున్నాయి.

ఎన్నికలకు ఆరు నెలల ముందు అన్న క్యాంటీన్లు పెట్టారు, దాన్ని కూడా సెల్ఫీలకు వాడేసుకోవడమే వింతగా ఉంది. టీడీపీలో నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉన్న ఒక నాయకుడు రోడ్డు మేము ముప్పావు వంతు పూర్తి చేశామని చెప్పుకుని సెల్ఫీ దిగడం విడ్డూరంగా ఉంది.

ఒక మాజీ మంత్రి అయితే విశాఖలో కట్టిన ఏయూ భవనాలను చిన్నపాటి కట్టడాలని కూడా సెల్ఫీ చాలెంజిలో పెట్టేశారు. దీన్ని చూసిన వైసీపీ నేతలు ఇదేనా పద్నాలుగేళ్ల మీ చంద్రబాబు చేసిన అభివృద్ధి అని ఎద్దేవా చేస్తున్నారు. శాశ్వతమైన పనులు ఒక్కటీ చంద్రబాబు చేయలేదని మీ సెల్ఫీ చాలెంజిల ద్వారా మీరే చెప్పేసుకుంటున్నారు అని సెటైర్లు వేస్తున్నారు.

శ్రీకాకుళంలో దశాబ్దాల కిడ్నీ సమస్యను తీర్చేలా సూపర్ స్పెషల్ ఆసుపత్రితో పాటు రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేసిన జగన్ కంటే దార్శనికుడు ఉంటారా అని వారు అంటున్నారు. ఈ సెల్ఫీల చాలెంజి ఎలా ఉంది అంటే హై టెక్ సిటీ సృష్టికర్త చంద్రబాబు అని ఒకనాడు చెప్పుకునే తమ్ముళ్ళు ఇపుడు అద్దే భవనాలలో అన్నా క్యాంటీన్లు మూన్నాళ్ళ ముచ్చటగా నడిపి అది కూడా బాబు గారి క్రెడిట్ ఖాతాలో వేస్తున్నారు. 

అలా బాబుని కీర్తిని తామే దించేస్తున్నామన్న ఆలోచనలో తమ్ముళ్లలో లోపించడంతోనే వైసీపీ నేతలకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇంతకీ చంద్రబాబు ఏపీకి చేసిన శాశ్వత అభివృద్ధి ఏదీ సెల్ఫీలకు దొరకడంలేదా లేక నిజంగానే టీడీపీ అలాంటి పనులు ఏవీ చేయలేదా అని వైసీపీ నేతలు అడుగుతున్నారు.