ఏజెంట్ కోతి లాంటి క్యారెక్టర్-అఖిల్

ఏజెంట్ సినిమాలో నాది కోతి లాంటి క్యారెక్టర్ అని, యాక్షన్ సీన్స్, థ్రిల్స్ అన్ని చోట్లా ఎనర్జీతో అటు ఇటూ మూవ్ అవుతుంటూనే వుంటుందని, అందులోంచే ఎంటర్ టైన్ మెంట్ కూడా పుడుతుందని హీరో…

ఏజెంట్ సినిమాలో నాది కోతి లాంటి క్యారెక్టర్ అని, యాక్షన్ సీన్స్, థ్రిల్స్ అన్ని చోట్లా ఎనర్జీతో అటు ఇటూ మూవ్ అవుతుంటూనే వుంటుందని, అందులోంచే ఎంటర్ టైన్ మెంట్ కూడా పుడుతుందని హీరో అఖిల్ అన్నారు. జాకీచాన్ పాత్రల ప్రభావం వుందా అంటే తానేమీ చెప్పలేనని, ఆ పాత్రలు కూడా ఇలా ఫన్ పండిస్తూనే వుంటాయని బదులిచ్చారు. 

ఏజెంట్ విడుదల సందర్భంగా అఖిల్ మీడియాతో మాట్లాడారు. తనకు ఎందుకో మొదటి నుంచీ యాక్షన్ సినిమాలు అంటే ఇష్టమని వెల్లడించారు. నాకు లార్జర్ దేన్ లైఫ్, యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న వెలితి. ఆ సినిమా చాలా మంచి విజయం సాధించింది. 

నాకు యాక్సెప్టెన్స్ చాలా వరకు పెరిగింది. అయితే పర్సనల్ గా నాకు ఇష్టమైన జోనర్ యాక్షన్. లాక్ డౌన్ సమయంలో ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు.. దర్శకుడు సురేందర్ రెడ్డి ని కలిసాను. అప్పటికి కథ ఇంకా తెలీదు. కానీ ఏదైనా కొత్తగా ఫ్రెష్ గా చేయాలని మాత్రం నిశ్చయించుకున్నాను. ఒక కొత్త తరహా యాక్షన్ సినిమా చేసి ఫ్రెష్ కంటెంట్ ని ఇవ్వాలనే ప్రయత్నంతో స్పై జోనర్ ని ఎంపిక చేసుకొని ఏజెంట్ జర్నీ మొదలైయింది అంటూ వివరించారు.

ఏజెంట్ సినిమా చేయడం అన్నది ప్రతి రోజూ టాస్క్ లా వుండేదని, ఓ దశలో అంత ఎనర్జీతో చేయగలనా అనిపించిందని వెల్లడించారు. సినిమా ఆలస్యం కాలేదని 100 రోజులకు పైగా షూటింగ్ డేస్ వుండే సినిమాకు కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని వివరించారు. పైగా కొన్ని నెలల పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి విదేశంలోని ఆసుపత్రిలో కోవిడ్ తో వుండిపోయారని, రోగులు, మృతదేహాల నడుమ ఆయన ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారని, ఆ పరిస్థితులు అన్నీ అధిగమించి సినిమా చేసామని, అందువల్ల ఆలస్యం అనివార్యం తప్ప వేరు కాదని వివరించారు

తెలుగు సినిమా రెగ్యులర్ ఫార్మాట్ లా వుండకూడదు, కానీ ఎంటర్ టైన్ మెంట్ మిస్ కాకూడదు, ఇలాంటి స్ట్రగుల్ తో స్క్రిప్ట్ దశలోనే చాలా కిందా మీదా పడి, టైమ్ తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసామని అఖిల్ వివరించారు. ఏజెంట్ చాలా ప్రత్యేకమైన సినిమా. మమ్ముట్టి గారు లాంటి పెద్ద స్టార్ ని ఎందుకు ఇందులో తీసుకున్నామో విడుదల తర్వాత మీరే చెప్తారు. ఇది కేవలం ఒక్క హీరో వైపు నుంచే నడిచే సినిమా కాదు. మూడు పాత్రలు మధ్య ఇంటెన్స్ డ్రామా జరిగే సినిమా ఇది. మమ్ముట్టి గారి పాత్రతో నేను ప్రేమలో పడిపోయాను. అంత అద్భుతంగా వచ్చింది. కథ ఓ కొత్త ప్రపంచంలో జరుగుంటుంది. కంప్లీట్ గా న్యూ సెటప్. ఖచ్చితంగా ఏజెంట్ ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది అన్నారు.

పోకిరి, బాహుబలి 2 నా ఆల్ టైం ఫేవరేట్ మూవీస్. వ్యక్తిగతంగా నాకు పెద్దగా సెంటిమెంట్లు వుండవు. కానీ వాటి విడుదల తేదీకే ఏజెంట్ విడుదలవుతోంది అని చెప్పినపుడు చాలా ఆనందంగా ఫీలయ్యాను. పోకిరి 50 సార్లు చూసి ఉంటాను. బాహుబలి కూడా అంతే. ఇంకా చూస్తూనే వున్నాను. ఇదొక బ్లెస్సింగ్ లానే భావిస్తున్నాను.

నిజం చెప్పాలంటే ఏజెంట్ స్క్రిప్ట్ నాన్న తో షేర్ చేయలేదు. నా జపయజయాలకు నేను తీసుకునే నిర్ణయాలే కారణం కావాలని భావిస్తాను. నాన్న సలహాలు తీసుకుంటాను. ఆయనకి అన్ని విషయాలపై చాలా అవగాహన వుంటుంది. ఆయనకి చాలా ప్రశ్నలు అడుగుతాను. కానీ ఈ కథ చేయాలా వద్దా అనేది మాత్రం నా నిర్ణయం అన్నారు అఖిల్ అక్కినేని.