ఐఐటీలో ఏం జరుగుతోంది.. వరుసగా నాలుగో మృతి

ఐఐటీ చెన్నైలో మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మినిమం గ్యాప్ లో మరో మరణం సంభవించింది. ఐఐటీ మద్రాసులో సెకెండియర్ చదువుతున్న మహారాష్ట్ర కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది ఐఐటీ మద్రాసులో ఆత్మహత్యల…

ఐఐటీ చెన్నైలో మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మినిమం గ్యాప్ లో మరో మరణం సంభవించింది. ఐఐటీ మద్రాసులో సెకెండియర్ చదువుతున్న మహారాష్ట్ర కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది ఐఐటీ మద్రాసులో ఆత్మహత్యల సంఖ్య 4కు చేరింది.

అంతకంటే ముందు ఇదే క్యాంపస్ కు చెందిన  ఓ విద్యార్థి, తన అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. “నాకు ఏమంత మంచిగా అనిపించడం లేదు” అంటూ సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు. తాజా విద్యార్థి మాత్రం తన రూమ్ మేట్స్ అంతా మంచోళ్లు అనే అర్థం వచ్చేలా ఒక వాక్యం రాసి చనిపోయాడు.

చనిపోయిన కుర్రాడు ఎప్పుడూ చదువులో ముందుండేవాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. అయితే బాగా ఒంటరితనం ఫీల్ అయ్యేవాడని, “నాతో మాట్లాడ్డానికి ఎవ్వరికీ టైమ్ లేదని, అంతా బిజీగా ఉన్నారు” అంటూ తరచుగా తన సహవిద్యార్థులతో చెప్పేవాడట. అలా నలుగురితో కలవలేకపోవడం వల్లనే ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

కొన్ని రోజుల కిందటే విద్యార్థుల్లో పాజిటివ్ దృక్పథాన్ని పెంచేందుకు అన్ని ఐఐటీల్లో కొంత పోర్టల్ ను లాంచ్ చేశారు. దీనికంటే ముందు కుశల్ ఫ్యాకల్టీ ప్రొగ్రామ్ ను కూడా తీసుకొచ్చారు. ఓవైపు ఇలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ విద్యార్థులు ఒత్తిడిని అధిగమించలేకపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఒత్తిడితో కూడిన కరిక్యులమ్ తో పాటు, ప్రాంగణంలో కుల-ప్రాంత వివక్షల వల్ల విద్యార్థులు ఇలా ఒత్తిడికి గురవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అటు ఐఐటీ మేనేజ్ మెంట్ మాత్రం ఈ విషయాల్ని ఖండిస్తోంది. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, కరోనా తర్వాత చాలామంది విద్యార్థుల మానసిక స్థితిలో మార్పు వచ్చిందని వాళ్లు చెబుతున్నారు.

వాదనలు ఎన్నున్నా, కారణాలు ఏమైనా తెలివైన విద్యార్థులు ఇలా ఒత్తిడిని జయించలేక ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమైన విషయం. ఐఐటీ మిస్ అయితే మరో సీట్ వస్తుంది, జీవితమే మిస్సయితే ఏమొస్తుంది? ఈ విషయాన్ని తల్లిదండ్రులే తమ పిల్లలకు దగ్గరుండి అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్లపై అనవసర ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడాలి.