పవన్ కళ్యాణ్‌ను ‘పవర్ స్టార్’అని అభిమానులు పిలుచుకుంటారు. ఈయన అన్నయ్య చిరంజీవి ‘మెగా స్టార్’. బిరుదులు చాల గొప్పగా ఉన్నాయి. ఈ బిరుదులు చివరకు సినిమా రంగానికే పరిమితమయ్యాయి. బిరుదులు బ్రహ్మాండంగా ఉన్నాయి కదా అని అన్నయ్య, తమ్ముడు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అట్టర్ ఫ్లాప్ అయ్యారు.
రాజకీయాల్లో అన్నయ్య చిరంజీవి విఫలమయ్యాక అన్నయ్య చేయలేని పని తాను చేస్తానని పవర్‌స్టార్ బయలుదేరాడు. కాని అన్నయ్యకంటే ఘోరంగా విఫలమయ్యాడు. ముఖ్యమంత్రి అయిపోవాలనే ఆశతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి తప్పో ఒప్పో తన పార్టీ ప్రజారాజ్యంను కాంగ్రెసులో కలిపేశాడు. కేంద్ర మంత్రి పదవి సంపాదించుకొని కొన్నాళ్లు అనుభవించి, బతుకు జీవుడా అనుకొని రాజకీయాలను వదలించుకొని బయటపడ్డాడు. ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. మరి తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినందుకు చట్టసభ (అసెంబ్లీ లేదా పార్లమెంటు) మెట్లు ఎక్కుతాడో లేదో అనుమానమే. తాజా పరిణామాలతో ఈ అనుమానం కలుగుతోంది.
ఒంటరి పోరాటం చేసి విఫలమయ్యాక ఇక లాభం లేదనుకొని బీజేపీతో స్నేహం చేశాడు. ఒకప్పుడు బండ బూతులు తిట్టిన పార్టీతో జత కలిశాడు. అయినా ఆయనకు కలిసి రాలేదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు అంతంత మాత్రంగా ఉన్న పవన్ పరిస్థితి సోము వీర్రాజు అధ్యక్షుడయ్యాక మరీ దిగజారింది.
పవన్ జనసేన పెట్టాక ఎన్నడూ తెలంగాణ మీద దృష్టి పెటలేదు. రాష్ర్ట విభజన తరువాత తెలంగాణలో అనేక ఎన్నికలు జరిగాయి. కాని ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని ఏనాడూ పవన్ అనుకోలేదు. కాని ఎందుకో హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక కలిగింది. వాస్తవానికైతే బీజేపీ, జనసేన మిత్రులు కాబట్టి ముందే ఒక అవగాహనకు వచ్చి ఒక కూటమిగా పోటీ చేయాలి. కాని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలని బీజేపీ అనుకోలేదు. దుబ్బాక విజయం జోష్‌లో ఉన్న బీజేపీలో ఉన్నట్లుండి ఆత్మవిశ్వాసం పెరిగింది.
గ్రేటర్లో ఒంటరిగానే పోటీ చేసి టీఆర్ఎస్ను మట్టి కరిపించాలనుకుంది. జనసేనతో పొత్తు ఉండదని బీజేపీ తెలంగాణ నాయకులు ప్రకటించారు. దీంతో జనసేన పోటీకి సిద్ధమైంది. కార్యకర్తల కోరిక మేరకు గ్రేటర్లో పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. దీంతో జనసేన అభ్యర్థులు కొన్ని డివిజన్లలో నామినేషన్లు కూడా వేశారు. పవన్ ఈవిధమైన స్టెప్ తీసుకోవడంతో బీజేపీ నాయకులకు దిమ్మతిరిగిపోయింది.
జనసేన రంగంలో ఉంటే టీఆర్ఎస్కే లాభం జరుగుతుంది. టీఆర్ఎస్ను ఓడించాలని తాము కట్టుకున్న కంకణం వదులైపోతుంది. పవన్‌ను బతిమాలరో, బామాలారో, బుజ్జగించారో, ఢిల్లీ పెద్దలతో చెప్పించారో… ఏం చేశారోగాని బీజేపీకి మద్దతుగా జనసేన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పవన్ ప్రకటించాడు. నామినేషన్లు వేసిన జన సైనికులు వాటిని ఉపసంహరించుకొని బీజేపీ తరపున ప్రచారం చేయాలని అప్పీల్ చేశాడు. గ్రేటర్లో అంతో ఇంతో ఉనికిని చాటుకోవాలనుకున్న పవన్ ఆశలపై బీజేపీ నీళ్లు చల్లింది. జన సైనికులను బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పాడుగాని బీజేపీ తరపున తాను ప్రచారం చేస్తానని చెప్పలేదు. ఆ పార్టీకి మద్దతుగా ఏమీ మాట్లాడలేదు.
ఈ ఎపిసోడ్ అయిపోయాక పవన్ దృష్టి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం మీద పడింది. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో అక్కడ ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే కదా. ఆల్రెడీ టీడీపీ, వైసీపీ అభ్యర్థులను ప్రకటించాయి. మిగిలింది బీజేపీజనసేన కూటమే. తిరుపతి సీటును జనసేనకు వదిలిపెట్టాలని పవన్ తన ఫ్రెండ్ బీజేపీని కోరాడు. హైదరాబాద్‌లో జనసేన త్యాగం చేసింది కాబట్టి అందుకు ప్రతిఫలంగా తిరుపతి జనసేనకు ఇవ్వాలని అడుగుతున్నాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఇది న్యాయంగానే ఉంది. కాని బీజేపీ పవన్‌కు తిరుపతిలోనూ అవకాశం ఇవ్వాలనుకోవడంలేదు.
తిరుపతి సీటు కోసం ఢిల్లీ పెద్దలతో మాట్లాడటానికి పవన్, పార్టీలో నెంబర్ టూ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఢిల్లీ వెళ్లి అపాయింట్మెంట్ కోసం మూడు రోజులు పడిగాపులు పడ్డారు. పవన్‌లాంటి వ్యక్తిని మూడు రోజులు వెయిట్ చేయించడమంటే పరాభవం చేసినట్లే కదా. విలువ ఇవ్వనట్లే కదా. ఏమాత్రం కేర్ చెయ్యనట్లే కదా.
చివరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గంటసేపు పవన్‌తో మాట్లాడాడు. తిరుపతి సీటు జనసేనకు ఇస్తాననిగాని, ఇవ్వననిగాని చెప్పలేదు. రెండు పార్టీలవారితో కలిపి ఓ కమిటీ వేస్తామన్నాడు. ఎవరు పోటీ చేయాలనేది ఆ కమిటీ డిసైడ్ చేస్తుందన్నాడు. నడ్డాతో మాటా ముచ్చట అయ్యాక తిరుపతి సీటు గురించి మాట్లాడటానికే ఢిల్లీ వచ్చామని పవన్ చెప్పాడు. కాని నాదెండ్ల మనోహర్ మాత్రం అందుకోసం రాలేదని, పోలవరం, రాజధాని విషయాలు మాట్లాడటానికి వచ్చామన్నాడు. ఇద్దరూ చెరోవిధంగా ఎందుకు చెప్పారో తెలియదు. కాని తిరుపతిని జనసేనకు బీజేపీ ఇస్తుందనే నమ్మకం లేదు.
ఏపీలోనూ సొంతంగా ఉనికిని చాటుకోవాలని బీజేపీ అనుకుంటోంది. జనసేనకు గెలిచే సత్తా లేదని భావిస్తోంది. పవన్ ఇమేజ్ ఓట్లు రాల్చలేదని నిర్ణయానికి వచ్చినట్లు కనబడుతోంది. ఇదిలా ఉంటే, తాజా సమాచారం ప్రకారం… బీజేపీతో తాడో పేడో తేల్చుకోవాలని పవన్ భావిస్తున్నాడట. బీజేపీ తనకు విలువ ఇవ్వడంలేదని కోపంగా ఉన్నాడట. అసలు తిరుపతి నుంచి తానే డైరెక్టుగా బరిలోకి దిగితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడట. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సామాజికవర్గం ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన పోటీ చేస్తే గెలుపుకు ఢోకా ఉండదని జనసేన నాయకులు కొందరు చెబుతున్నారు.
బీజేపీతో పవన్ స్నేహం ‘అనుకున్నదొకటి…అయినది ఒక్కటి..బోల్తా పడ్డావులే బుల్బుల్ పిట్టా’ అన్నట్లుగా తయారైంది. పొలిటికల్‌గా ఏ విషయంలోనైనా సొంతంగా మాట్లాడలేకపోతున్నాడు. సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. ఇందుకు జీహెచ్ఎంసీ ఎన్నికలే ఉదాహరణ. గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని బీజేపీ నేతలు ముందుగానే ఖరాఖండీగా చెప్పేశారు.
ఎన్నికల్లో కలిసి పోటీ చేయలేని స్నేహం వల్ల ఉపయోగమేముంది? పవన్‌పై బీజేపీకి నమ్మకం లేదని అర్థమవుతోంది. ఒకరిపై ఒకరు నమ్మకం లేకుండా ఎంతకాలం స్నేహం చేస్తారు? పవన్ బీజేపీతో కొనసాగితే ఏపీలో 2024లో జరిగే ఎన్నికల్లోనూ పవన్ చెవులకు పిడకలు కట్టడం ఖాయంగా కనబడుతోంది.
పవన్ రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో ముందుకు పోవాల్సిందే. ఇప్పటికైనా పవన్ ఒక రాజకీయ నాయకుడిలా వ్యవహరించాల్సివుంది. గట్టి అభిప్రాయాలతో నిలకడగా మాట్లాడాల్సిన అవసరముంది.వచ్చే ఎన్నికల్లోనూ పవన్ పనితీరు పేలవంగా ఉంటే ఇంటిదారి పట్టడమే మంచిది.
నాగే మేడేపల్లి