హీరోయిన్ పుట్టుమచ్చల వివాదంపై హీరో స్పందన

డీజే టిల్లూ ట్రయిలర్ లాంఛ్ ప్రెస్ మీట్ లో అడగకూడని ప్రశ్న అడిగాడు సినీ రిపోర్టర్ ముసుగు వేసుకున్న సురేష్ కొండేటి. దీనిపై చాలా రాద్దాంతం జరిగింది. స్వయంగా హీరోయిన్ నేహాశర్మ, కొండేటిని కడిగిపారేసింది.…

డీజే టిల్లూ ట్రయిలర్ లాంఛ్ ప్రెస్ మీట్ లో అడగకూడని ప్రశ్న అడిగాడు సినీ రిపోర్టర్ ముసుగు వేసుకున్న సురేష్ కొండేటి. దీనిపై చాలా రాద్దాంతం జరిగింది. స్వయంగా హీరోయిన్ నేహాశర్మ, కొండేటిని కడిగిపారేసింది. దానికి సురేష్ కొండేటి కూడా సమాధానం ఇచ్చాడు. మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరతాను అన్నాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పటివరకు స్పందించని వ్యక్తి హీరో సిద్ధు జొన్నలగడ్డ.

నిజానికి సురేష్ కొండేటి ప్రశ్న అడిగింది ఇతడ్నే. దానికి అతడు సభముఖంగానే తన అసమ్మతిని తెలియజేశాడు. నేను ఈ ప్రశ్నను ఆన్సర్ చేయనంటూ హుందాగా ప్రవర్తించాడు. అయినప్పటికీ ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సిద్ధూ కూడా స్పందిస్తే బాగుండేంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ రోజు తనవైపు నుంచి స్పందన తెలియజేశాడు సిద్ధూ.

“అది నన్ను తీవ్రంగా బాధించింది, అందుకే నేను స్పందించాలనుకుంటున్నాను” అంటూ స్టార్ట్ చేసిన సిద్ధూ జరిగిన ఘటనపై సుదీర్ఘంగా స్పందించాడు. “చాలా హీనమైన ప్రశ్న వేశారని, ఆ టైమ్ లో తన స్పందన సరిగ్గా లేదని కొంతమంది అన్నారు. నేను చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఆ ప్రశ్నకు సమాధానాన్ని తిరస్కరించాను. కోపం ప్రదర్శించకుండా, నిగ్రహంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నేను ఎప్పటికీ అనుకోను.”

“హీరోయిన్ తో క్లోజ్ గా ఉండే సన్నివేశాలు తీసినప్పుడు ప్రతి నటుడు ఇబ్బంది పడతాడు. సదరు హీరోయిన్ అయితే మరింత ఇబ్బంది పడుతుంది. చుట్టూ వంద మంది ఉంటారు. ముఖంపై ఒకడు లైట్ కొడుతుంటాడు. ఇంటిమేట్ సీన్లలో నటించాలంటే చాలా ధైర్యం కావాలి. మేం కథలు చెబుతాం, వినోదాన్ని అందిస్తాం. తెరపై మేం చేసే పని చూసి నిజజీవితంలో మమ్మల్ని జడ్జ్ చేయడానికి ప్రయత్నించకండి.”

ఇకనైనా ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని కోరాడు సిద్ధూ. తన సినిమా ప్రచారం కంటెంట్ తో జరగాలి తప్ప, ఇలాంటి వివాదాలతో జరగకూడదని కోరుతున్నాడు.

డీజే టిల్లూ ట్రయిలర్ రిలీజ్ సందర్భంగా.. సిద్ధూను సురేష్ కొండేటి ఒక ప్రశ్న అడిగాడు. సినిమాలో హీరోయిన్ తో 16 పుట్టుమచ్చలున్నాయని చెప్పించారు కదా, నిజజీవితంలో ఆమె ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయో అడిగారా అని సిగ్గులేకుండా అడిగేశాడు. దీనిపై చాలా వివాదం నడిచింది. ఇప్పుడీ వివాదానికి తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు సిద్ధు.