కేసీఆర్ భయపడటంలేదు ….జగన్ కు ఎందుకు అంత భయం?

ప్రధాని మోడీ మీద చాలా కాలంగా ఒక ప్రచారం జరుగుతోంది. మోడీని ఎదిరించిన వాళ్ళెవరూ బతికి బట్ట కట్టరనేది ఆ ప్రచారం. మోడీ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారని లేదా మేనేజ్ చేస్తారని చివరకు కోర్టులను…

ప్రధాని మోడీ మీద చాలా కాలంగా ఒక ప్రచారం జరుగుతోంది. మోడీని ఎదిరించిన వాళ్ళెవరూ బతికి బట్ట కట్టరనేది ఆ ప్రచారం. మోడీ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారని లేదా మేనేజ్ చేస్తారని చివరకు కోర్టులను కూడా ఆయన ప్రభావితం చేయగలరని ఓ ప్రచారం మీడియాలోనే సాగుతోంది. రాజకీయ ప్రత్యర్థుల మీద ఈడీని, సీబీఐని, ఆదాయపు పన్ను శాఖను ఎప్పుడంటే అప్పుడు ఉసిగొల్పుతారని చాలా మంది చెబుతుంటారు.

ప్రత్యర్థుల అవినీతి చిట్టాలను దగ్గర పెట్టుకొని సమయం దొరికినప్పుడు వారిని బొక్కలోకి తోస్తారని చెబుతుంటారు. ఈ దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నవారు వ్యవస్థలను మేనేజ్ చేయడం కష్టం కాకపోవొచ్చు. కానీ న్యాయవ్యవస్థను కూడా మోడీ తాను అనుకున్నట్లు నడిపిస్తారని చేస్తున్న ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. ఏపీ సీఎం జగన్ మీద కేసులు ఉన్నాయి కాబట్టే ఆయన మోడీకి భయపడుతున్నారని చెబుతుంటారు.

ఆయన అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయకుండా తనను కేసుల నుంచి బయట పడేయాలని ప్రాధేయపడుతుంటారని ప్రత్యర్థులు ప్రచారం చేస్తుంటారు. సరే … ఈడీ, సీబీఐ, ఐటీ మొదలైనవి ప్రధాని చెప్పినట్లు వినొచ్చేమో. కానీ స్వతంత్రంగా వ్యవహరించే న్యాయ వ్యవస్థ మోడీ చెప్పుచేతుల్లో ఎందుకుంటుంది? కేసుల్లో శిక్షలు పడకుండా మోడీ ఆపగలరా? ఎవరినిపడితే వారిని జైలుకు పంపగలరా? కానీ మోడీ తలచుకుంటే ఏమైనా చేయగలరనే ప్రచారం మాత్రం సాగుతోంది.

మొన్నటి కేంద్రబడ్జెట్ మీద జగన్ గమ్మున ఉన్నారు. ఎందుకంటే ఆయన మీద కేసులున్నాయి కాబట్టి భయపడి ఏమీ మాట్లాడకుండా ఉన్నారని అంటున్నారు. ఈ సంవత్సరం జూన్లో దేశవ్యాప్తంగా కొన్ని రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో భాగంగా ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ  సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ స్థానాల భర్తీ కోసం వచ్చే నెల చివర్లో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఏపీలో అధికార వైసీపీకి పూర్తి బలం ఉంది. 

అందువల్ల ఈ నాలుగు స్థానాలు ఆ పార్టీకే దక్కుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో జగన్ ఎవరిని రాజ్యసభకు పంపుతారోనన్న ఆసక్తి కలుగుతోంది. సాధారణంగా అయితే ఈ స్థానాలకు అభ్యర్థులను జగన్  నిర్ణయించాలి. కానీ  కొంతమంది నేతలు ఢిల్లీలో బీజేపీ దగ్గర లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. తమకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇప్పించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారని తెలుస్తోంది. గతంలో కూడా ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ నత్వానీని ఏపీ నుంచి రాజ్య సభకు పంపారు.

ఇక ఢిల్లీలోని బీజేపీ పెద్దలను కలుస్తున్న వీళ్లు జగన్ కు చెప్పి రాజ్యసభ సీటు దక్కేలా చేయాలని కోరుతున్నారట. ఇక దాంతో వైసీపీని నడిపిస్తోంది బీజేపీనా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే ఏపీకి కేంద్రం ఎన్ని రకాలుగా అన్యాయం చేసినా కానీ సీఎం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రస్తావనే లేకపోయినా జగన్ అసలు స్పందించనే లేదని ప్రధాని మోడీకి ఆయన భయపడుతున్నారని విపక్షాలు కూడా మండిపడుతున్నాయి.

కేసులకు భయపడే జగన్ నోరు మెదపడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే తెలంగాణలో సీఎం కేసీఆర్ కథ ఇందుకు భిన్నంగా ఉంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే ఆయన ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని, మోడీని నానా తిట్లు తిట్టారు. చెలరేగిపోయారు. కథలో ఉప కథ మాదిరిగా దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని వ్యాఖ్యలు చేసి వివాదం లేవదీశారు. ఇదే కేసీఆర్ మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆయన అవినీతి చిట్టా కేంద్రం దగ్గర ఉందని, ఆయన జైలుకు పోవడం ఖాయమని తెలంగాణా బీజేపీ నాయకులు, ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తరచుగా ఇదే మంత్రం చదువుతుంటారు.

కానీ కేసీఆర్ భయపడకుండా మోడీని, బీజేపీని తిడుతూనే ఉంటారు. మరి మోడీ తలచుకంటే కేసీఆర్ అవినీతిని బయటకు తీయలేరా? ఆయన్ని జైలుకు పంపలేరా? మోడీకి జగన్ ఎందుకు భయపడుతున్నారు? కేసీఆర్ ఎందుకు భయపడటంలేదు?