ఏపీలో కరెంట్ పోయింది.. టీడీపీకి మైండ్ పోయింది

ఛలో విజయవాడ కార్యక్రమం నిన్న సాయంత్రానికి ప్రశాంతంగా ముగిసింది, ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు ఉన్నట్టుండి ఏపీలో చాలా చోట్ల కరెంటు సమస్య తలెత్తింది. ప్రసారంలో అంతరాయం ఏర్పడింది. కరెంట్ పోయింది, గంటల…

ఛలో విజయవాడ కార్యక్రమం నిన్న సాయంత్రానికి ప్రశాంతంగా ముగిసింది, ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు ఉన్నట్టుండి ఏపీలో చాలా చోట్ల కరెంటు సమస్య తలెత్తింది. ప్రసారంలో అంతరాయం ఏర్పడింది. కరెంట్ పోయింది, గంటల తరబడి పవర్ కట్ అలాగే ఉంది. దీన్ని ఉద్యోగుల ఆందోళనకు లింకు పెడుతూ టీడీపీ బరితెగించి మాట్లాడుతోంది. 

ఏపీలో పవర్ కట్ కి సాంకేతిక అంశాలు కారణం అని తెలిసినా కూడా.. ఉద్యోగుల ఉద్యమానికి సంబంధించిన వార్తా ప్రసారాలను ప్రజలు చూడకుండా నిలువరించేందుకే ప్రభుత్వం కరెంటు తీసేసిందని వితండవాదాన్ని మొదలు పెట్టింది టీడీపీ. ఉద్యోగుల నిరసన పూర్తయిన తర్వాత కరెంటుపోతే అది వార్తా ప్రసారాలను అడ్డుకోవడం ఎలా అవుతుంది, అదే నిజమైతే ఉదయం నుంచే కరెంటు తీసేయాలి కదా.

అసలు కారణం ఇదీ..

రాష్ట్రవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలతో ఉత్పత్తి తగ్గిపోయింది. ఉన్నట్టుండి ఉత్పత్తి తగ్గిపోవడంతో ఆటేమేటిక్ గా పవర్ సప్లైలో అంతరాయాలు ఏర్పడ్డాయి. వీటీపీఎస్, ఆర్టీపీపీ, కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాల్లో మొత్తం 1700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో రాష్ట్రంలోని 3 డిస్కమ్ ల పరిధిలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా కరెంటు కోతలు పడ్డాయి.

దీన్ని టీడీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. ఉద్యోగుల ఉద్యమాన్ని తక్కువచేసి చూపేందుకు రాష్ట్రవ్యాప్తంగా కరెంటు తీసేశారని విమర్శిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ ఇది సాంకేతిక సమస్య అని తెలుసు. అంతెందుకు టీడీపీ అనుకూల మీడియా ఈనాడులో కూడా అదే కారణాన్ని చెప్పారు. కానీ బరితెగించిన టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం దాన్ని పీఆర్సీ ఉద్యమానికి ముడిపెట్టడం విశేషం.

ఏపీలో పవర్ కట్ అయితే సహజంగా పక్క రాష్ట్రాల నుంచి కరెంటుని కొంటుంటారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న ఐదు రాష్ట్రాలు ఈపాటికే అధిక ధరకు విద్యుత్ ని కొంటున్నాయి, తమ రాష్ట్రాల్లో పవర్ కట్ లేకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నాయి. దీంతో ఏపీకి విద్యుత్ దొరకలేదు. అందుకనే పవర్ కట్ అనివార్యం అయింది. కానీ టీడీపీ రాజకీయ విమర్శలు మాత్రం అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి.