ఆ పాట పాడితే.. కేసీఆర్‌కు సపోర్టు దక్కేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తనను తాను జాతీయ స్థాయి నాయకుడిగా ఆవిష్కృతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దేశ రాజకీయాలపై దృష్టి సారిస్తాను అంటున్నారు. ఢిల్లీ వెళ్తాను అంటున్నారు. ఇప్పటికే దేశంలోనే అనేక భాజపాయేతర,…

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తనను తాను జాతీయ స్థాయి నాయకుడిగా ఆవిష్కృతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దేశ రాజకీయాలపై దృష్టి సారిస్తాను అంటున్నారు. ఢిల్లీ వెళ్తాను అంటున్నారు. ఇప్పటికే దేశంలోనే అనేక భాజపాయేతర, కాంగ్రెసేతర పార్టీలతో కేసీఆర్ చర్చలు జరుపుతూ ఉన్నారు. వారి మద్దతును కూడగట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. 

ఇదంతా కూడా కేంద్రంలో తృతీయ ప్రత్యామ్నయా శక్తి ఏర్పాటుకే అనే భావన అందరిలోనూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ తాజాగా కొత్త రాజ్యాంగం గురించి చర్చ పెట్టారు. ఈ దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉన్నదని ఆయన అంటున్నారు. తన డిమాండ్లకు, వాదనలకు బలం కూడగట్టుకోవడం ఆయన ముందును తక్షణ కర్తవ్యం. అయితే.. ‘దక్షిణాది’ అనే పాట పాడడం ద్వారా.. ఆ టార్గెట్ ను కేసీఆర్ అందుకోగలరా లేదా అనేది అనుమానం!

కేసీఆర్ పార్టీలో కీలక ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు రాజ్యసభలో చేసిన  ప్రసంగం చాలా కీలకమైనది. మోడీ సర్కారు దేశాన్ని ముక్కలు చేసే దిశగా పాలన సాగిస్తున్నదని ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. లౌకిక భావనకు తూట్లు పొడుస్తున్నదని అన్నారు. ఐడియా ఆఫ్ ఇండియా అనేదే ప్రస్తుతం ప్రమాదంలో పడిందంటూ కేకే చేసిన వ్యాఖ్య చాలా తీవ్రమైనది. భాజపా వైఖరి ఇలాగే కొనసాగితే.. మన మెదళ్లను కలుషితం చేసేస్తుంది. మనం రెండు దేశాలను చూడాల్సి వస్తుంది- అంటూ కేకే అనడం చాలా సీరియస్ కామెంట్.

వీటన్నింటి మధ్యలో దక్షిణాది రాష్ట్రాలు విస్మరణకు గురవుతున్నాయని ప్రస్తావించడం గమనించాలి. ‘హిందీలో తప్ప మరొక భాషలో మాట్లాడం’ అని ఒక కేంద్రమంత్రి చెప్పడాన్ని అభ్యంతర పెట్టిన వైనం గమనినంచాలి. దక్షిణాది రాష్ట్రాల్లో చాలా మందికి హిందీ రానే రాదు.. అని ప్రస్తావించడాన్నీ గమనించాలి. కేకే తన ప్రసంగంలో దక్షిణాది ప్రస్తావనను ప్రముఖంగా వినిపించడం ద్వారా.. కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానానికి దక్షిణాది మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారా? అనే అభిప్రాయం కలుగుతోంది. 

కేసీఆర్ కూడా  ఈ దక్షిణాది పాటను చాలా సందర్భాల్లో పాడుతూనే ఉన్నారు. అయితే దీనిద్వారా.. ఆయన దక్షిణాది రాజకీయ పార్టీలన్నింటినీ.. తను సంకల్పిస్తున్న మూడో రాజకీయ శక్తికి అనుకూలంగా మార్చుకోగలరా? అనేది అనుమానమే. ఎందుకంటే.. దక్షిణాది రాష్ట్రాలను పరిశీలిస్తే.. ఏపీలో ఉన్న వైసీపీ, టీడీపీ రెండూ కూడా బీజేపీకి వ్యతిరేకగళం వినిపించే స్థితిలో లేవు. 

తమిళనాడు స్టాలిన్, కేసీఆర్ నాయకత్వం కింద ఒదిగి ఉంటారనుకోవడం భ్రమ. కర్ణాటక బీజేపీ చేతుల్లోనే ఉంది. ఇక కేరళ కమ్యూనిస్టులు వారి జాతీయ విధానాల ప్రకారం నడుస్తారే తప్ప.. కేసీఆర్ మాటకు తల ఊపడం తక్కువగానే ఉంటుంది. ఇలాంటి స్థితిలో కేవలం దక్షిణాది అనే మాట ద్వారా.. దేశస్థాయిలో మూడో రాజకీయసమీకరణను సృష్టించడం అసాధ్యం. 

పైగా, ఈ కూటమిలో ‘దక్షిణాది’ అనే మాట బలంగా వినిపించే కొద్దీ.. ఉత్తరాది రాష్ట్రాల్లోని పార్టీలు అనుమానంగా చూసే పరిస్థితీ తప్పదు. కాబట్టి.. దక్షిణాది అనే పాట పాడితే.. కేసీఆర్ కు ఆయన కోరుకున్నంతగా ఎక్కువ పార్టీల మద్దతు సాధ్యమేనా? ఆయన బీజేపీని వణికించగల ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని నిర్మాణం చేయగలరా అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలవుతున్నది.