ఉద్యోగుల సమ్మె పై బాబు, పవన్.. దొందూ దొందే

ఉద్యోగుల సమ్మె విషయంలో గోతికాడ నక్కలు రంగంలోకి దిగాయి. వాస్తవానికి ఛలో విజయవాడ ప్రశాంతంగా జరిగింది. ప్రభుత్వం ఉద్యోగులపై లాఠీ విరిగేందుకు ఛాన్స్ ఇవ్వలేదు. ఉద్యోగుల్ని అడ్డుకునే క్రమంలో బలవంతం చేయొద్దని పోలీసులకు ఆదేశాలు…

ఉద్యోగుల సమ్మె విషయంలో గోతికాడ నక్కలు రంగంలోకి దిగాయి. వాస్తవానికి ఛలో విజయవాడ ప్రశాంతంగా జరిగింది. ప్రభుత్వం ఉద్యోగులపై లాఠీ విరిగేందుకు ఛాన్స్ ఇవ్వలేదు. ఉద్యోగుల్ని అడ్డుకునే క్రమంలో బలవంతం చేయొద్దని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. అందుకే వేలాదిమంది విజయవాడ రాగలిగారు, బెజవాడ రోడ్లపై ప్రదర్శన చేపట్టగలిగారు. కానీ ఉద్యోగులకు ఏదో అన్యాయం జరిగిపోయిందని, అరెస్ట్ లు జరిగాయని, హౌస్ అరెస్ట్ లతో ఇబ్బంది పెట్టారని, ఉద్యోగులు ఎండలో మలమల మాడిపోయారంటూ చంద్రబాబు, పవన్ ఇద్దరూ కన్నీరు కార్చడం విశేషం.

బషీర్ బాగ్ ఘటన మరిచిపోయావా బాబూ!

ఇది చాలా పెద్ద పదప్రయోగం. అసలు ఉద్యోగుల్ని తీవ్రవాదుల్లా ట్రీట్ చేసి ఉంటే, వారిలో ఏ ఒక్కరైనా విజయవాడలో అడుగుపెట్టగలిగేవారా..? బ్యారికేడ్లను దాటుకుని రోడ్లపైకి రాగలిగేవారా..? నిన్న జరిగిన ఛలో విజయవాడలో ఉద్యోగుల పంతం నెగ్గలేదు, ప్రభుత్వం సంయమనం నెగ్గింది. అయితే ఇక్కడ కూడా చంద్రబాబు రాజకీయాలు తీసుకొచ్చారు.

తమ ప్రభుత్వం అడిగినంత ఫిట్ మెంట్ ఇచ్చిందని, వైసీపీ ఇవ్వలేకపోయిందని, అందుకే రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు చంద్రబాబు. ఉద్యోగుల్ని అరెస్ట్ చేయించారంటూ మండిపడ్డారు. బషీర్ బాగ్ కాల్పుల్ని అంత త్వరగా మరచిపోతే ఎలా బాబూ..? నిరసనకారులపై తూటాలు పేల్చడం, గుర్రాలతో తొక్కించడం బాబు నైజం, కానీ నిరసనకారుల్ని ప్రశాంతంగా ప్రదర్శనలు చేసుకోనివ్వడం వైసీపీ ఇచ్చిన స్వేచ్ఛ. లేకపోతే ఇన్నిరోజులపాటు కలెక్టరేట్ల ముందు ఉద్యోగులు కలెక్టర్లని ఆడిపోసుకుంటూ, సీఎం ని తిడుతూ పాటలు పాడుతూ ప్రదర్శనలు చేపట్టేవారా..?

బాబులాగే జగన్ కూడా ఉంటే.. ఉద్యోగుల ఛలో విజయవాడ సాఫీగా సాగేదా..? సమయం కోసం వేచి చూసిన బాబు.. సరిగ్గా ఛలో విజయవాడ రోజు రంగంలోకి దిగారు, ఉద్యోగుల తరపున మొసలి కన్నీరు కార్చారు.

పవన్ ది మరో స్టైల్..

ఉద్యోగులు వద్దన్నారు కాబట్టే, తాము కలుగజేసుకోలేదని, లేకపోయి ఉంటే జనసేన సత్తా చూపించేవారమని అంటున్నారు పవన్. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల్ని వంచించిందని చెబుతున్న పవన్ కి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హెచ్ఆర్ఏ ఫార్ములాని రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అవ్వాలనుకుంటున్న విషయం తెలియదా, దాని వల్లే అసలు సమస్య వచ్చిందని అర్థం కాలేదా..? ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతల ఆస్తులు మూడు రెట్లు పెరిగితే, ఉద్యోగుల జీతం 30శాతం తగ్గిందని జోక్ చేశారు పవన్.

మరి పవన్ రెమ్యునిరేషన్ గత మూడేళ్లలో ఎంత పెరిగిందో కూడా చెబితే బాగుండేది. ఎవరూ తక్కువ జీతాలకు ఎక్కువ పని చేయాలనుకోరు. జీతం తగ్గినందుకు కాదు ఇప్పుడు ఆందోళన, అనుకున్నంత పెరగలేదనేదే ఉద్యోగుల బాధ. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఒక్కటే పవన్ పని, పీఆర్సీ గొడవ విషయంలో ఇన్నాళ్లూ ఉగ్గబట్టుకుని ఉన్న పవన్, ఇక తన అసలు రంగు బయట పెట్టుకున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు మరోసారి కూడబలుక్కొని దొందూదొందే అనిపించుకున్నారు.