సజ్జల టార్గెట్ అయ్యారా..? టార్గెట్ చేశారా..?

పీఆర్సీ పోరులో సీఎం జగన్ కంటే, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పైనే ఎక్కువ కామెంట్లు పడ్డాయి. “హూ ఈజ్ సజ్జల” అనే టాపిక్ హైలెట్ అయింది. టీడీపీ అనుకూల మీడియా సజ్జలకు వ్యతిరేకంగా…

పీఆర్సీ పోరులో సీఎం జగన్ కంటే, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పైనే ఎక్కువ కామెంట్లు పడ్డాయి. “హూ ఈజ్ సజ్జల” అనే టాపిక్ హైలెట్ అయింది. టీడీపీ అనుకూల మీడియా సజ్జలకు వ్యతిరేకంగా కొంతమందిని రెచ్చగొట్టి మరీ మాట్లాడించింది. “సకల జనుల శాఖ మంత్రి” అనే హ్యాష్ ట్యాగ్ తో సజ్జలను టార్గెట్ చేశారు. ఎందుకిదంతా..?

సజ్జలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?

వైసీపీలో జగన్ తర్వాత మాట్లాడే గొంతుకలు కొన్ని మాత్రమే ఉన్నాయి. మంత్రుల దగ్గరకు వస్తే టాపిక్ ఏదయినా అనిల్, కొడాలి, పేర్ని నాని.. ఇలా చాకిరేవు పెట్టేవాళ్లు లిమిటెడ్ గానే ఉన్నారు. వీళ్లతో పెట్టుకోవడం ప్రతిపక్షాలకు కాస్త కష్టమైన పనే. అదే సమయంలో కాస్త సబ్జెక్ట్ చెప్పి.. ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే వ్యక్తుల్లో విజయసాయిరెడ్డి, సజ్జల ఉన్నారు. విజయసాయి హస్తిన వ్యవహారాలతో బిజీ అయిపోవడంతో.. సజ్జల ఏపీ వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు చేసే కుట్రల్ని ఓ పద్ధతి ప్రకారం భగ్నం చేస్తూ వచ్చేవారు. డిటెయిల్డ్ కౌంటర్లు ఇచ్చేవారు.

ఇక్కడే ప్రతిపక్షాలకు సజ్జల మింగుడు పడటం లేదు. దీంతో ఆయన్ని ఓ వ్యూహం ప్రకారం టార్గెట్ చేశారు. పీఆర్సీ గొడవలో చర్చలకు ఎవరు వెళ్లినా ప్రభుత్వం కష్టాల్లో ఉంది కాబట్టి చేసేదేమీ లేదు. కానీ అనూహ్యంగా మంత్రుల బృందానికి సజ్జల నేతృత్వం వహించడం, కొత్త పీఆర్సీని వెనక్కి తీసుకోడానికి ఆయన ససేమిరా అనడంతో ఉద్యోగ సంఘాల ఫోకస్ మొత్తం ఆయనపై మళ్లించారు.

ఇక ప్రతిపక్షాలకు కూడా ఎప్పటినుంచో సజ్జల టార్గెట్ గా ఉన్నారు కాబట్టి, తమ అనుకూల మీడియాతో ఆ వ్యవహారాన్ని హైలెట్ చేయించారు. ఉద్యోగులకు సజ్జల వ్యతిరేకి అనే ముద్రవేశారు. ఈ విషయంలో కుప్పం ఓటమి కసి కూడా సజ్జలపై పడింది. బాబు పరాభవాన్ని పరిపూర్ణం చేసిన వ్యక్తి సజ్జల. ఆ కసి,కోపాన్ని ఇప్పుడిలా ప్రదర్శిస్తోంది టీడీపీ, దాని అనుకూల మీడియా.

ఈ ఎపిసోడ్ లో జగన్ పై పెద్దగా వ్యతిరేకత రాలేదు, తమని మోసం చేశారని, చర్చలకు పిలిపించి అవమానించారంటూ సజ్జలను ట్రోల్ చేస్తున్నారు. చర్చలతో పరిష్కారమయ్యే సమస్యను ప్రతిపక్షాల ఉచ్చులో పడిన ఉద్యోగులు సమ్మె వరకు తీసుకొచ్చారు. ఆఖరికి చీఫ్ సెక్రటరీ ప్రెస్ మీట్ పెట్టి జీతాలు ఎంతెంత పెరిగాయనేదానిపై వివరణ ఇచ్చినా కూడా ఉద్యోగుల్లో నమ్మకం కలగలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తమ్మీద చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డు పెట్టుకుని సజ్జలను విజయవంతంగా టార్గెట్ చేశాయి ప్రతిపక్షాలు.