మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టిన పవన్ కల్యాణ్

కొన్నాళ్లుగా బాహ్య ప్రపంచానికి కనిపించలేదు పవన్. ఇంకా చెప్పాలంటే, రష్యాలో క్రిస్మస్ సంబరాలు ముగించుకొని, హైదరాబాద్ వచ్చిన తర్వాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కరోనా సాకు చెప్పి పార్టీ సమావేశాన్ని కూడా రద్దు చేసిన…

కొన్నాళ్లుగా బాహ్య ప్రపంచానికి కనిపించలేదు పవన్. ఇంకా చెప్పాలంటే, రష్యాలో క్రిస్మస్ సంబరాలు ముగించుకొని, హైదరాబాద్ వచ్చిన తర్వాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కరోనా సాకు చెప్పి పార్టీ సమావేశాన్ని కూడా రద్దు చేసిన పవన్ కల్యాణ్, ఇన్నాళ్లకు తెరపైకొచ్చాడు. ఉద్యోగుల సమ్మెకు మద్దతిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ లుక్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది.

పవన్ కాస్త ఎక్కువ జుట్టు పెంచారు. గడ్డం ట్రిమ్ చేశారు. మీసాలు పెంచే పనిలో కూడా ఉన్నారు. ఇవన్నీ ఆయన చేస్తోంది ఫ్యాషన్ కోసం మాత్రం కాదు. తన కొత్త సినిమా కోసం పవన్ ఈ మేకోవర్ ప్రారంభించాడు.

క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. భీమ్లానాయక్ షూటింగ్ తో పాటు ఇతర రాజకీయ వ్యవహారాల వల్ల ఈ సినిమా షూటింగ్ ను చాన్నాళ్లుగా పక్కనపెట్టాడు పవన్. అలా ఆగిపోయిన హరిహర వీరమల్లు షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టబోతున్నాడు పవన్. ఆ సినిమాలో గెటప్ కోసం మళ్లీ ఇలా కొత్తగా మేకోవర్ అన్నమాట.

ఈ ఏడాది మొత్తం సినిమాలు చేయాలని నిర్ణయించాడు పవన్. భీమ్లానాయక్ పూర్తిచేసిన ఈ హీరో, హరిహర వీరమల్లుతో పాటు హరీశ్ శంకర్ సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. ఇక పెండింగ్ లో ఉన్న సురేందర్ రెడ్డి సినిమాను కూడా సమ్మర్ లో సెట్స్ పైకి తీసుకురావాలనేది ప్లాన్.

కమిట్ అయిన ఈ సినిమాలతో పాటు కొత్తగా మరో మూవీని కూడా ప్రకటించే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. తమిళ్ లో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నాడు. దీనికి సంబంధించి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు పవన్ తో చర్చలు జరుపుతున్నారు.