ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు.. ఏ చిన్న అవకాశం వచ్చినా గతంలోకి వెళ్లిపోతుంటారు, తన ఘన చరితను ఏకరువు పెడుతుంటారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా.. హైటెక్ సిటీ, సిలికాన్ వ్యాలీ అంటూ గతాన్ని గుర్తు చేసి అరిగిపోయిన క్యాసెట్ ను జనంపై రుద్దాలని చూశారు.
ఇప్పుడు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా మరోసారి తన ఘనతను గుర్తు చేస్తూ రెచ్చిపోతున్నారు బాబు.
ఇంతకీ చంద్రబాబు చేసిందేంటి?
టీడీపీ హయాంలో హైదరాబాద్ పరిధిలో జీనోమ్ వ్యాలీ నిర్మితమైందనేది చంద్రబాబు సెల్ఫ్ డబ్బా. ఆ జీనోమ్ వ్యాలీలోనే నేడు కొవిడ్ వ్యాక్సిన్ తయారవుతోందని, అదంతా తన ఘనతేనని చెప్పుకుంటున్నారు బాబు..
వాస్తవం ఏంటి?
అసలు జీనోమ్ వ్యాలీకి చంద్రబాబుకి ఏమైనా సంబంధం ఉందా? జీనోమ్ వ్యాలీ ఎవరి కోసం ఏర్పాటు చేశారు? వాస్తవాలు చూస్తే అప్పటికే ఆంధ్రాలో ఫార్మా కంపెనీల జోరు సాగుతోంది. ప్రైవేట్ సెక్టార్ లోనే తమ పరిశోధనల కోసం ఓ ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నాయి.
అదే సమయంలో దానిని తన ఖాతాలో వేసుకోడానికి.. 1999లో జీనోమ్ వ్యాలీని పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ లో ఏర్పాటు చేశారు చంద్రబాబు. పబ్లిక్ సెక్టార్ అనే పేరు కలిపి జీనోమ్ వ్యాలీ సృష్టికర్త చంద్రబాబు అనే రేంజ్ లో ప్రచారం చేసుకున్నారు.
ప్రస్తుతం భారత్ బయోటెక్ కొవిడ్ టీకా 'కొవాక్సిన్' తయారు చేస్తున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్రమోదీ పర్యటించడం జీనోమ్ వ్యాలీ పేరు మరోసారి ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి అది తన ఘనతేనంటూ డబ్బా కొట్టుకుంటున్నారు.
హైదరాబాద్ కి ఏ సాఫ్ట్ వేర్ కంపెనీ వచ్చినా, హైటెక్ సిటీ పేరు చెప్పి సెల్ఫ్ డబ్బా వాయించే బాబు.. ఇప్పుడు జీనోమ్ వ్యాలీని కూడా శృతిలో కలిపేశారు. ప్రధాని మోదీ జీనోమ్ వ్యాలీని సందర్శించడం ఆనందంగా ఉందని, టీడీపీ ప్రభుత్వం అంకితభావం వల్లే జీనోమ్ వ్యాలీ ఏర్పడిందని ట్విట్టర్లో ఊదరగొట్టారు. అసలు కొవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టడం కూడా టీడీపీ అద్భుత సృష్టేననే రేంజ్ లో రెచ్చిపోయారు.
అవకాశం వస్తే.. ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టని బాబు, ఇప్పుడిలా మోదీ పర్యటన సందర్భంగా.. జీనోమ్ వ్యాలీ పేరుతో హడావిడి చేస్తున్నారు.