కరోనా భయాల నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వయసున్న వారు కరోనా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కూడా.
60 యేళ్ల వయసు పైనున్న వారు బయట తిరగడం మీద కూడా ప్రస్తుతం ఒకరకంగా ఆంక్షలు ఉన్నట్టే. ప్రభుత్వం కూడా ఆ వయసు పై బడిన వారు జనం మధ్యకు రావొద్దని సూచిస్తూ ఉంది.
60 దాటి ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్లు కరోనా బారిన పడితే ఆరోగ్య పరంగా చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. కొందరికి కరోనా సోకి నయం అయినా.. పోస్ట్ కోవిడ్ పరిణామాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కోవిడ్ సోకి కోలుకున్నా ఆ తర్వాత వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న వారు చాలా మందే వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో 60 దాటిన వారు కోవిడ్ ను సోకించుకోకుండా ఉండగలిగితే అంత కన్నా ఉత్తమం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు అరవై గాక 70 దాటిన వ్యక్తి. ఈ క్రమంలో.. ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా ఉన్నారని స్పష్టం అవుతూనే ఉంది. మార్చి నుంచి హైదరాబాద్ లోని తన ఇంటికి పరిమితం అయ్యారు. ఏపీకి చుట్టపు చూపుగా వెళ్లారు. ఆ తర్వాత ఏపీకి వెళ్లినా అక్కడ కూడా కార్యకర్తలతో కానీ, నేతలతో కానీ సమావేశం అయ్యింది. తన వయసు రీత్యా కరోనా సోకించుకోకుండా ఉండాల్సిన అవసరాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించారు. ఆ మేరకు నడుచుకుంటూ ఉన్నారు.
ఇలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. మరి వాటికి చంద్రబాబు అస్సలు హాజరవుతారా? అనేది ప్రశ్నార్థకమేనేమో! మాస్కులు, ఫేస్ షీల్డ్ లు ధరించి అంత సేపు సమావేశాల్లో కూర్చోవడం కూడా ఒకింత కష్టమైన అంశమే. వాటిని తీసి తిరిగే పరిస్థితి చంద్రబాబుకు ఉండకపోవచ్చు.
కేవలం చంద్రబాబే కాదు.. 60, 70 దాటిన ఏపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలకు హాజరు కావడం అనుమానమే అని చెప్పవచ్చు. వారు వచ్చినా రాకపోయినా.. చంద్రబాబు రాకపోతే మాత్రం అది వార్తే అవుతుంది. ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి హాజరు కాలేకపోతే.. టీడీపీ పరిస్థితి వీల్ చైర్ ఎక్కినట్టుగా అవుతుంది కూడా. కాబట్టి పట్టుదలగా తీసుకుని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారేమో!