జగన్ తో జర్నీ చాలా కష్టం బాసూ!

మహాకవి శ్రీశ్రీ అంటాడు ఇలా. వస్తే రానీ కోపాల్..తాపాల్..కష్టాల్..నష్టాల్..పోతే పోనీ సతుల్..సుతుల్ అంటూ. సరే ఆయన ఎందుకు ఏ కాంటెస్ట్ లో అన్నాడు అన్నది పక్కన పెడితే ఆంధ్ర సిఎమ్ జగన్ మాత్రం ఇలాగే…

మహాకవి శ్రీశ్రీ అంటాడు ఇలా. వస్తే రానీ కోపాల్..తాపాల్..కష్టాల్..నష్టాల్..పోతే పోనీ సతుల్..సుతుల్ అంటూ. సరే ఆయన ఎందుకు ఏ కాంటెస్ట్ లో అన్నాడు అన్నది పక్కన పెడితే ఆంధ్ర సిఎమ్ జగన్ మాత్రం ఇలాగే అనుకుంటూ వుంటారేమో సదా? ఆయనకు నచ్చితే ఎవరేం అనుకున్నా నెత్తిన పెట్టుకుంటారు. ఆయనకు నచ్చకపోతే ఏమై పోయినా సరే వదిలేసుకుంటారు. ఇలాంటి వ్యవహారాల వల్ల తనకు ఎంత నష్టం అన్నది చూసుకోరు.

కానీ నిజానికి ఇది రాజకీయ నాయకులకు నప్పే లక్షణం ఎంత మాత్రం కాదు. రాజకీయాల్లో పట్టు విడుపులు చాలా అవసరం. అవతలి వాడి అవసరం మనకి వున్నపుడు తగ్గాలి. మన అవసరం వాడికి వచ్చినపుడు మనమేంటో చూపాలి. పార్టీలు, తగాయిదాలు, వ్యవహారాలు ఇవన్నీ బయటకే, కానీ లోకల్ గా చూసుకుంటే రాజకీయ నాయకులు ఒకరితో ఒకరు కాస్త ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే వుంటారు. కానీ జగన్ మాత్రం అలా కాదు.

చెల్లెలు పదవి అడిగారు. అది సరికాదు అన్నారు జగన్. పట్టుదలలు పెరిగాయి. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీనివల్ల పోయేదేమీ లేదు. కానీ పబ్లిక్ లో ఇమేజ్ కు డ్యామేజ్. ప్రస్తుతం జగన్ కు దూరంగా జరిగిన చాలా మందితో జగన్ కు మరీ దీర్ఘకాల, దారుణ వైరాలు ఏమీ లేవు. చిన్న చిన్న ఇగో సమస్యలే. లౌక్యం అన్నది పక్కన పెట్టి జగన్ వ్యవహరించడమే.

అయ్యా..ఇలా కాదు అని ఎవరైనా చెప్పబోయినా జగన్ వినరు. తిరిగి తన వాదన వినిపించి, అవతలి వారిని కట్టడి చేస్తారు. ఇంకా వినకపోతే తనకు వదిలేయండి చూసుకుంటా అంటారు. గత మూడు నాలుగేళ్లుగా జరుగుతున్నది ఇదే. ఓ పెద్ద వ్యవహారంలో కూడా తెగే వరకు వెళ్లిపోయారు. అదృష్టం కొద్దీ మధ్యలో కాస్త సర్దుబాటు చేయగలిగారు దగ్గరవాళ్లు. దాంతో సర్దుకుంది.

పంతాలకు పోవడం అన్నది జగన్ వీక్ నెస్ అనుకోవాలో, బలం అనుకోవాలో అర్థం కాదు. ఒక్కోసారి ఆ పంతాలతోనే నెగ్గుకు వస్తారు. ఎక్కువసార్లు ఆ పంతాలతోనే తన మీదకు తెచ్చుకుంటారు. నిజానికి ఇలా చేయడం వల్ల జగన్ కు పోయేదేమీ లేదు. ఎందుకంటే ఆయన స్వంత పార్టీ. ఆయన అధికారం..ఆయన ఇష్టం. నిలబెట్టుకోవడం, నిలబెట్టుకోకపోవడం. కానీ ఇక్కడ వేరే సమస్య వుంది. ఆయనను, ఆయన పార్టీని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నవాళ్లు ఎందరో వున్నారు. వాళ్లలో కొందరికి ఇక్కడ అక్కడ సర్దుబాటు అవకాశం వుండొచ్చు. కొంతమందికి లేకపోవచ్చు.

జగన్ విషయంలో తేడా జరిగితే ఇలాంటి వాళ్లందరి పరిస్థితి ఏమిటి? ఇది జగన్ కు అస్సలు పట్టదు. ఏ పనికి ఎవరు సెట్ అవుతారన్నది జగన్ చూడరు. తనకు నచ్చడం ముఖ్యం. నచ్చకపోతే కష్టం. ఈ షఫ్ లింగ్ లు అలా తరచు జరుగుతూనే వుంటాయి. సజ్జలను మార్చి విజయసాయిని తెస్తారు. విజయసాయిని మార్చి సుబ్బారెడ్డిని తెస్తారు. ఈ ముగ్గురితో గుడు గుడు గుంచం అంటూ ఆట ఆడుతూనే వుంటారు.

తొలిసారి ఎన్నికల్లో ఐప్యాక్ ను సమర్థవంతంగా వాడారు. ఈసారి అది కనిపించడం లేదు. ఐప్యాక్ కు పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారో లేదో తెలియదు. ఎందుకంటే జగన్ తో ఎప్పుడూ ఒకే తీరుగా వుండవు వ్యవహారాలు.

ఏమన్నా ఎవరన్నా సన్నిహితులు అడిగితే జగన్ చెప్పేది ఒక్కటే తాను అన్నింటికీ సిద్దం..ఏదైనా కానీ, ఏమైనా కానీ అనే. కానీ రాజకీయాలు చేసే వాళ్లు అలా వుండలేరు కదా..అందుకే జగన్ తో జర్నీ కాస్త కష్టమే.