రాజధాని అంశం.. జగన్ మౌనం వెనక కారణం ఇదేనా?

పార్లమెంట్ లో అమరావతే ఏపీకి రాజధాని అని కేంద్ర మంత్రి చెప్పారు. అందులో వింత, విశేషం ఏమీ లేదు. కానీ టీడీపీ అనుకూల మీడియా రెచ్చిపోయింది. జగన్ ఓడిపోయారని, అమరావతే ఏపీకి ఏకైక రాజధానిగా…

పార్లమెంట్ లో అమరావతే ఏపీకి రాజధాని అని కేంద్ర మంత్రి చెప్పారు. అందులో వింత, విశేషం ఏమీ లేదు. కానీ టీడీపీ అనుకూల మీడియా రెచ్చిపోయింది. జగన్ ఓడిపోయారని, అమరావతే ఏపీకి ఏకైక రాజధానిగా కేంద్రం కూడా గుర్తించిందంటూ హంగామా చేసింది. జగన్ ని మరోసారి రెచ్చగొట్టేలా ప్రవర్తించింది. టీడీపీ, బీజేపీ నేతలు కూడా రెచ్చిపోయారు. ఇంతకీ జగన్ ఏం చేస్తున్నారు. మూడు రాజధానుల బిల్లు కసరత్తులు ఎప్పుడు పూర్తవుతాయి..?

సరిగ్గా అమరావతి పాదయాత్ర జరుగుతున్న రోజుల్లోనే మూడు రాజధానుల బిల్లుని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో అంతా జగన్ వెనక్కి తగ్గారని అనుకున్నారు. కానీ న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండటం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నామని, త్వరలో సమగ్రమైన బిల్లు ప్రవేశపెడతామని, మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని మంత్రులు చెప్పారు. 

అప్పటికప్పుడు వైరి వర్గాలు జగన్ పట్టుదల చూసి భయపడినా, ఇప్పుడు లైట్ తీసుకున్నాయి. మూడు రాజధానుల ప్రస్తావన ఇటీవల పూర్తిగా వెనక్కి వెళ్లిపోవడంతో పండగ చేసుకుంటున్నాయి. అదే సమయంలో జిల్లాల విభజన హంగామా మొదలైంది. దీంతో ఈ వ్యవహారం పూర్తిగా పక్కనపడిపోయింది.

2024 అజెండా అవుతుందా..?

ఇప్పటికిప్పుడు మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తుందని అనుకోలేం. అంతకు మించి అన్నట్టు ఉద్యోగ సంఘాల ఆందోళనలు, జిల్లాల పేర్ల కోసం జరుగుతున్న నిరసనలు ఉన్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికల వరకు ఈ వ్యవహారాన్ని ఇలాగే కొనసాగించి 2024 ఎన్నికల్లో వైసీపీ మూడు రాజధానుల్నే ప్రధాన అజెండాగా మార్చుకుంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అందుకే పార్లమెంట్ లో ప్రశ్నల రూపంలో బీజేపీ రెచ్చగొడుతున్నా, టీడీపీ వెనకనుంచి ఈ డ్రామా నడిపిస్తున్నా వైసీపీ స్పందించడంలేదు. ఇప్పుడు సైలెంట్ గా ఉండి, ఎన్నికల సమయంలో దెబ్బ కొట్టాలని జగన్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. 

వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మూడు రాజధానులు అనేదే ప్రధాన అజెండా అయితే మాత్రం.. ప్రతిపక్షాలు కచ్చితంగా డైలమాలో పడతాయి. మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తాం అనే సాహసం చేయలేవు, అదే సమయంలో అమరావతిని వదిలిపెట్టలేవు. బహుశా జగన్ సైలెన్స్ కి కారణం అదేనేమో.