ఒకటే మౌనం.. అచ్చెన్న పనైపోయినట్టేనా?

టీడీపీలో అచ్చెన్నాయుడు పనైపోయిందా. అట్టహాసంగా ఏపీ టీడీపీకి అధ్యక్షుడిగా ఎంపిక చేసి, ఆ తర్వాత ఆయన్ను పక్కనపెట్టారా. పార్టీ లేదు, బొక్క లేదు అనే వ్యాఖ్యలతోనే ఇది మొదలైందా..? అప్పటికప్పుడు వేటు వేయకుండా స్థానిక…

టీడీపీలో అచ్చెన్నాయుడు పనైపోయిందా. అట్టహాసంగా ఏపీ టీడీపీకి అధ్యక్షుడిగా ఎంపిక చేసి, ఆ తర్వాత ఆయన్ను పక్కనపెట్టారా. పార్టీ లేదు, బొక్క లేదు అనే వ్యాఖ్యలతోనే ఇది మొదలైందా..? అప్పటికప్పుడు వేటు వేయకుండా స్థానిక సమరంలో ఫెయిలయ్యాడనే నెపంతో ఇప్పుడు పార్టీపై పెత్తనం కట్ చేశారా..? ఇదే ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్. అచ్చెన్నాయుడు మౌనం దీనికి నిదర్శనం.

కొన్ని రోజులుగా అచ్చెన్నాయుడు సైలెంట్ గా ఉంటున్నారు. ఆయనకు టీడీపీలో ఎలాంటి ప్రాధాన్యం లేదు. క్యాసినో రచ్చ చేసినప్పుడు కూడా అచ్చెన్న స్వరం పెద్దగా వినిపించలేదు. అధ్యక్షుడిగా ఉండి కూడా ఇప్పటివరకు జిల్లాల పర్యటన చేయలేదు. పార్టీ లేదు, బొక్క లేదు అన్న అచ్చెన్న, దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నట్టున్నారు. చంద్రబాబు మార్క్ రాజకీయానికి అడ్డంగా బలైనట్టు కనిపిస్తోంది.

ఆయనను పార్టీ నుంచి తీసేయలేదు కానీ పూర్తిగా పక్కనపెట్టారు. సమావేశాలకు ఆహ్వానం అందుతోంది కానీ, అందులో ఆయనకు ప్రాధాన్యం ఉండడం లేదు. ఇతర నేతలు కూడా లోకేష్, బాబు కేంద్రంగానే తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు తప్ప, అచ్చెన్నకు కనీసం మాటమాత్రమైనా చెప్పడం లేదు. మాటవరసకు పలకరించడం లేదు. ప్రస్తుతం అన్ని వ్యవహారాలు లోకేష్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇలా అచ్చెన్నపై అప్రకటిత నిషేధం పార్టీలో అమలవుతోంది. దీంతో అచ్చెన్న ఉత్సవ విగ్రహంగా మారారు. జగన్ కు లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నారంతే.

చంద్రబాబు కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేస్తే ఎన్నికల్లో ఇద్దరే గెలిచారు. భావి వారసుడు అనుకుంటున్న లోకేష్ ఓడిపోయారు, టీడీపీకి పెట్టని కోటలా ఉన్న హిందూపురంలో బాలయ్య పరువు దక్కించుకున్నారు. అదే కింజరపు కుటుంబంలో మొత్తం ముగ్గురు పోటీ చేసి ముగ్గురూ గెలిచారు. అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు, కుమార్తె ఆదిరెడ్డి భవాని.. ఇలా ముగ్గురూ గెలిచారు. ఇక్కడే ఆ కుటుంబంపై బాబుకి కడుపుమంట మొదలైంది. ఆ తర్వాత కూడా రామ్మోహన్ నాయుడి వ్యవహారం లోకేష్ కి చేటు తెచ్చేలా ఉండటంతో మొగ్గలోనే దాన్ని తుంచేశారు. కానీ ఇప్పుడు అచ్చెన్నాయుడి కుటుంబాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు బాబు పన్నాగం పన్నాడు.

సొంత పార్టీ నేతల్ని కూడా చంద్రబాబు ఎంతలా వంచిస్తారో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఎన్నికల సమయానికి వైసీపీ నుంచి వలసలు ఉంటాయని ఆలోచిస్తున్న బాబు, ఉత్తరాంధ్రలో వ్యూహాత్మకంగా అచ్చెన్న హవా తగ్గించే పనిలో ఉన్నారు. అందులోనూ లోకేష్ ని ప్రమోట్ చేసుకునే ఆలోచనలో.. అచ్చెన్న సహా ఇతర నేతల ప్రాభవం తగ్గించేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ వికెట్ అచ్చెన్నాయుడిది అయింది.