పుష్పరాజ్.. హరిశ్చంద్రుడా, శ్రీరాముడా..?

తగ్గేదే లే.. ఈ డైలాగ్ ఏదైనా మంచికోసం వాడితే బాగుండేది. శ్రీరాముడు వంటి మంచి మనిషి తగ్గేదే లే అంటే దానికో అర్థముంది. సత్యం పలకడంలో హరిశ్చంద్రుడు తగ్గేదే లే అంటే దానికో అర్థమంది.…

తగ్గేదే లే.. ఈ డైలాగ్ ఏదైనా మంచికోసం వాడితే బాగుండేది. శ్రీరాముడు వంటి మంచి మనిషి తగ్గేదే లే అంటే దానికో అర్థముంది. సత్యం పలకడంలో హరిశ్చంద్రుడు తగ్గేదే లే అంటే దానికో అర్థమంది. కానీ పుష్ప లాంటి స్మగ్లర్ తగ్గేదే లే అంటే సమాజం చెడిపోదా, దాని వల్ల అరాచకం పెరిగిపోదా అని సూటిగా ప్రశ్నించారు ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు. 

ఇటీవలే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన గరికపాటి.. తాను సత్కారాల కోసం ప్రవచనాలు చెప్పడంలేదని, తన ప్రసంగాలు కేవలం సమాజంలో మార్పుకోసమేనని అన్నారు. సినిమాలపై తనదైన శైలిలో మరోసారి సెటైర్లు పేల్చారు గరికపాటి. రౌడీ, ఇడియట్ పేరుతో సినిమాలు తీసి సమాజానికి ఏం మెసేజ్ లు ఇచ్చారని అన్నారు. 

ఇప్పుడు పుష్పలో హీరోని స్మగ్లర్ గా చూపించారని మండిపడ్డారు. సినిమా చివర్లో 5 నిముషాలు హీరోని మంచివాడిగా చూపిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఫస్ట్ పార్ట్ అంతా హీరోతో పనికిమాలిన పనులు చేయించి, సెకండ్ పార్ట్ లో మంచివాడిగా చూపిస్తామంటే ఎలా కుదురుతుందని, నెక్స్ట్ పార్ట్ తీసే లోపు సమాజం చెడిపోదా అని ప్రశ్నించారు.

తగ్గేదేలే డైలాగు ఉపనిషత్తా..

స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదే లే అనే డైలాగ్ చెబితే అది ఈరోజు పెద్ద ఉపనిషత్తు అయిపోయిందని, పిల్లలంతా దాన్నే ఫాలో అవుతున్నారని, ఇది సమాజానికి చెడుచేయడం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి డైలాగుల వల్ల సమాజంలో నేరాలు పెరుగుతున్నాయని, అసలలాంటి డైలాగుల్ని సినిమాలో ఎందుకు పెట్టారని అన్నారు. 

హీరో, డైరెక్టర్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. వారెవరైనా వస్తే కడిగేస్తానంటూ కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు గరికపాటి. సూటిగా, సుత్తి లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటంలో గరికపాటి దిట్ట. అప్పుడప్పుడు ఆయన మాటలు కొంతమందికి చురుకు పుట్టించినా వాటిలో వాస్తవం ఉందని అందరూ ఒప్పుకుంటారు. 

అలాంటి గరికపాటి ఇప్పుడు పుష్పపై సెటైర్లు వేశారు, అభిమానుల నుంచి గట్టి సమాధానం ఉంటుంది కానీ, పుష్ప సినిమా టీమ్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. పద్మశ్రీ గరికపాటి కౌంటర్ కి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.