చంద్రబాబుకు ఫిటింగ్‌లు రాయపాటి సన్నాయినొక్కులు!

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ లాంటి సామెతలు ఊరకనే పుట్టలేదు. ఒకవేళ చంద్రబాబునాయుడుకు ఒకవేళ గ్రహాలన్నీ అనుకూలించి.. కట్టగట్టుకుని, 2024లో ఆయనకు చివరి చాన్స్ ఇచ్చి ముఖ్యమంత్రిని చేసేయాలని గ్రహాలన్నీ ఫిక్సయ్యాయనే అనుకుందాం.…

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ లాంటి సామెతలు ఊరకనే పుట్టలేదు. ఒకవేళ చంద్రబాబునాయుడుకు ఒకవేళ గ్రహాలన్నీ అనుకూలించి.. కట్టగట్టుకుని, 2024లో ఆయనకు చివరి చాన్స్ ఇచ్చి ముఖ్యమంత్రిని చేసేయాలని గ్రహాలన్నీ ఫిక్సయ్యాయనే అనుకుందాం. అయినాసరే.. అల్లుడి నోట్లో శని లాగా రాయపాటి వంటి నాయకులు ఉండనే ఉంటారు. 

కాంగ్రెసు పార్టీలో సుదీర్ఘకాలం రాజకీయం నడిపిన ఈ వీల్ చెయిర్ నాయకుడు, అక్కడ గతిలేక, ఆ పార్టీకి ఠికానా లేక, వైఎస్సార్ కాంగ్రెస్ లో తనను రానివ్వరు గనుక కులం కార్డు పట్టుకుని వచ్చి తెలుగుదేశంలో చేరారు. ఇప్పుడు చంద్రబాబుకు చుక్కలు చూపించేలా కనిపిస్తున్నారు. 

ఈ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు.. తెలుగుదేశం మీద ప్రేమతో ఆ పార్టీలోకి వచ్చాడనుకుంటే పొరబాటు. వేరే గతిలేదు గనుక వచ్చారు. వచ్చి ఆయన కోల్పోయినదేమీ లేదు. ఆయన సంస్థ ముసుగు కిందనే పోలవరం కాంట్రాక్టు నడిచింది. వందల వేల కోట్ల రూపాయలు దండుకున్నారనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టరు వైఫల్యాల వల్ల పనులు ఆలస్యం అవుతున్నా, కాంట్రాక్టరు రివైజ్డ్ ఎస్టిమేట్లు అడిగినా చంద్రబాబునాయుడు అడ్డగోలుగా వాటిని అనుమతించి రాయపాటికి మేలు చేశారనే ఆరోపణలున్నాయి. 

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు వార్ధక్యం కారణంగా కేవలం వీల్ చెయిర్ కు పరిమితం అయిన ఈ ఎనభయ్యేళ్ల వృద్ధనాయకుడు తన రాజకీయాభిలాషను, శత్రుత్వాలను ఇంకా చాటుకుంటున్నారు. మామూలుగా కాదు, తన శత్రుత్వమే ప్రధానం పార్టీ మునిగినా సరే అనే రేంజిలో మాట్లాడుతున్నారు. 

రాయపాటికీ- అదే జిల్లాకు చెందిన మరో (అప్పటి) కాంగ్రెస్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అందరికీ తెలుసు. వీరిద్దరి నడుమ సుదీర్ఘకాలం కోర్టు దావాలు నడిచి ఇటీవలే రాజీకొచ్చారు. ఆ కన్నా తెలుగుదేశంలోకి రావడాన్ని రాయపాటి ఇంకా సహించలేకపోతున్నారు. కన్నాతో తన శత్రుత్వం అలాగే ఉందని అంటున్నారు. కన్నాకు అనుకూలంగా పనిచేసే అవకాశమే లేదన్నట్టుగా సెలవిస్తున్నారు. 

అదలా ఉంచితే, టికెట్ల కోసం ఆయన పార్టీ ముందు పెడుతున్న డిమాండ్లే ఆశ్చర్యకరం. ఆయనకు నరసరావుపేట ఎంపీ టికెట్ కావాలట. ఆయనకు సంకేతాలు ఉన్నాయేమో గానీ.. కడపనుంచి వచ్చిన బీసీ అభ్యర్థికి నరసరావుపేట టికెట్ ఇస్తే గెలవరట. లోకల్ వాళ్లే ఉండాలంటున్నారు. 

అలాగే, ఆయన కొడుకు రంగబాబుకు సత్తెనపల్లి లేదా పెదకూరపాడు టికెట్ కావాలట. సత్తెనపల్లి మీద కన్నా కర్చీఫ్ వేసి పార్టీలోకి వస్తే.. రాయపాటి తన కొడుకును పోటీపెట్టడం ఖచ్చితంగా ఆ పార్టీకి చేటు చేసే పరిణామమే. అలాగే తన తమ్ముడు కూతురు శైలజకు కూడా ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారట. 

అంటే మొత్తంగా నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ నాయకుడి కుటుంబానికి ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలన్న మాట. మరి ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అదివరకు దశాబ్దాల నుంచి చేవచచ్చి ఉన్నదా? వీరు తప్ప ఆ పార్టీకి గతిలేరా? కుటుంబంలో మూడు టికెట్లు అడగడానికి కమ్మ కార్డు తప్ప ఇంకేమైనా అర్హతలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారా? ఇంకా టికెట్లు అడగడానికి ఆయన కుటుంబంలో ఇంకా ఎవ్వరూ లేరా? అని ప్రజలు నవ్వుకుంటున్నారు. 

రాయపాటి సాంబశివరావు పార్టీని గెలిపించేలా ఉపయోగపడకపోవచ్చు గానీ, ఈ డిమాండ్లతో గుంటూరు జిల్లాలో తెలుగుదేశానికి మరణ శాసనం రాస్తారేమోనని పార్టీ వర్గాలే అంటున్నాయి.