మళ్లీ మొదలైన కోతలు.. మెటాపై ఉద్యోగుల ఆగ్రహం

మెటాలో మళ్లీ కోతలు మొదలయ్యాయి. నిన్న సాయంత్రం నుంచే చాలామందికి పింక్ స్లిప్పులు అందాయి. ఈ వారం ఏకంగా 4వేల మందిని తొలిగించాలని సంస్థ నిర్ణయించినట్టు కథనాలు వస్తున్నాయి. గతేడాది నవంబర్ లో 11వేల…

మెటాలో మళ్లీ కోతలు మొదలయ్యాయి. నిన్న సాయంత్రం నుంచే చాలామందికి పింక్ స్లిప్పులు అందాయి. ఈ వారం ఏకంగా 4వేల మందిని తొలిగించాలని సంస్థ నిర్ణయించినట్టు కథనాలు వస్తున్నాయి. గతేడాది నవంబర్ లో 11వేల మంది ఉద్యోగుల్ని (మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం) తొలిగించిన తర్వాత, ఇదే గరిష్టం.

నిజానికి ఈ ఉద్యోగాల కోతలు సడెన్ గా వచ్చినవి కావు. కంపెనీలో మరో 10వేల ఉద్యోగాల కుదింపు ఉంటుందని, మార్చి నెలలోనే ప్రకటన వచ్చింది. అయితే అత్యంత నైపుణ్యం, సామర్థ్యం కలిగిన ఇంజనీర్లను తొలిగిస్తారని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. అవును.. తాజా లే-ఆఫ్స్ లో ఎక్కువమంది ఇంజనీర్లు, వాళ్లకు అనుబంధంగా ఉన్న టెక్ నిపుణులు, గ్రాఫిక్ డిజైనర్లు ఉన్నారు.

ఉద్యోగాలు ఊడిపోతాయనే విషయాన్ని మెటా ఉద్యోగాలు ఊహించారు. అయితే ఈసారి మాత్రం వాళ్లు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల టౌన్ హాల్ కార్యక్రమానికి సంబంధించి ఇంటర్నెల్ ఫోరమ్ లో దీనికి సంబంధించి తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న నాయకత్వ శ్రేణి ఉద్యోగుల్ని కూడా తొలిగించి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? మేం ఎందుకు మెటాలో కొనసాగాలి? అంటూ పోస్టులు దర్శనమిస్తున్నాయి.

మరోవైపు కోతల సెగ లండన్ లోని ఇనస్టాగ్రామ్ ఆఫీస్ ను కూడా తాకాయి. తాజా రౌండ్ లో అక్కడ కొంతమంది ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. తాజా లే-ఆఫ్స్ ను మెటా ఉన్నతస్థాయి ప్రతినిధి ధృవీకరించారు.