జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల విమర్శలు హద్దులు దాటాయి. ప్రజల మధ్య మత విద్వేషాలు రగిల్చి, ఆ మంటల్లో అధికార వెలుగులు నింపుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు బరి తెగించి మాట్లాడుతున్నాయి. అలాంటి అవాంఛనీయ ఘటనలను అరికట్టాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) చేష్టలుడిగి చూస్తుండడంపై పౌర సమాజం నుంచి పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ నేతల ఆరోపణలు, వ్యక్తిగత దూషణలపై దృష్టి సారించింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కొంత మంది నేతల ప్రసంగాలు ఉన్నట్టు ఎస్ఈసీ గుర్తించింది.
ఈ నేపథ్యంలో మత పరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన నేతలకు ఎస్ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలు, ర్యాలీల్లో కరోనా నిబంధనలు పాటించకపోవడంపై కూడా ఎస్ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
“మీడియా ద్వారా రాజకీయ నేతల ప్రసంగాలను గమనిస్తున్నాం. కొందరు నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తాం. మోడల్ కోడ్‌ను ఉల్లంఘిస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదు. అలాంటివి మా దృష్టికి వస్తే తీవ్రంగా పరిగణిస్తాం” అని ఎస్‌ఈసీ హెచ్చరించింది.
ఒక వైపు ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని, అలాగే మీడియాలో అందరి ప్రసంగాలను గమనిస్తున్నామని అంటూనే… మళ్లీ తమ దృష్టికి వస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరికలతో సరిపెట్టడం ఏంటో అర్థం కావడం లేదు.
మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఇన్ని తప్పులైతేనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల నియమావళిలో ఏమైనా ఉందా? తప్పు అని తెలిసినప్పుడు వెంటనే చర్యలు తీసుకుంటే , మరొకరు అలాంటి తప్పు చేయడానికి వెనుకాడతారు.
రాజకీయ నేతలు విచ్చలవిడిగా నోరు పారేసుకోడానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం ఉదాసీనంగా వ్యవహరించడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకుని మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతుంటే, ఎస్ఈసీ ప్రేక్షక పాత్ర పోషించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసుకునేట్టైతే, ఇక ఎన్నికల సంఘం ఎందుకున్నట్టు? అనే ప్రశ్నలు వస్తున్నాయి.