ప్రధాని మోడీ మాటలు టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజకీయంగా ప్రాణం పోసినట్టైంది. దేశంలో జమిలి అంటే ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది కేవలం చర్చకే పరిమితం కాకుండా అమలుకు నోచుకోవడంపై సీరియస్‌గా చర్చించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా గుజరాత్‌లో శుక్రవారం జరిగిన శాసన వ్యవహారాల ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో ప్రధాని కీలక ఉపన్యాసం ఇచ్చారు.
జమిలి ఎన్నికలు భారత్‌కు ఎంతో అవసరమన్నారు. ఇది చర్చకు మాత్రమే పరిమితం చేసే అంశం ఎంత మాత్రం కాదన్నారు. వేర్వేరు చోట్ల కొన్ని నెలలకు ఒకసారి ఎన్నికలు జరుగుతుండడం వల్ల అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే అని చెప్పుకొచ్చారు. వీటి కోసం డబ్బు, సమయం ఎందుకు వృథా చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు.
ప్రస్తుత కాలంలో వేర్వేరు ఓటరు జాబితాలు అవసరం లేదని ప్రధాని అన్నారు. అందుకే లోక్‌సభ, అసెంబ్లీతో పాటు పంచాయతీ ఎన్నికల వరకు అన్నింటికీ ఓకే ఓటరు జాబితా ఉండాలని ప్రిసైడింగ్ అధికారులకు ప్రధాని సూచించారు. రాజకీయ లక్ష్యాల కంటే దేశాభివృద్ధి, ప్రజాశ్రేయస్సే ప్రాధాన్యతగా ఉండాలని ప్రిసైడింగ్ అధికారులకు ప్రధాని సూచించారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చేతిలో టీడీపీ ఘోర పరాభవాన్ని చవి చూసింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోంది.
జగన్ ఏడాదిన్నర పాలనలో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర , మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వేర్వేరు కారణాలతో జైలుపాలు కావాల్సి వచ్చింది. అలాగే పలువురు టీడీపీ నాయకుల అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం కూలగొట్టి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో దూకుడుగా వెళుతోంది. దీంతో టీడీపీ నేతలు బెంబేలెత్తుతున్నారు.
మరోవైపు కరోనా కారణంగా చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక లోకేశ్ జనంలోకి రాకపోవడమే మంచిదనే అభిప్రాయం టీడీపీలో బలంగా ఉంది. దీంతో పార్టీని కాపాడుకోవాలంటే త్వరలో ఎన్నికలు వస్తాయనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లడం ఒక్కటే చంద్రబాబు ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం.
మరో ఏడాది, ఏడాదిన్నరలో జమిలి ఎన్నికలు వస్తాయనే ప్రచారాన్ని టీడీపీ తెరపైకి తేవడం, దాన్ని ఎల్లో మీడియా నెత్తికెత్తికోవడం చూశాం. 2024లో కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని ఇటీవల జనసేనాని పవన్‌కల్యాణ్ అమరావతి పర్యటన సందర్భంగా అన్నారు. పవన్ మాటలకు ఎల్లో మీడియా ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చూడాలి.
ఇప్పుడు ఏకంగా ప్రధాని నోట జమిలి ఎన్నికల ప్రస్తావన రావడంతో చంద్రబాబుకు రాజకీయంగా ఆక్సిజన్ ఇచ్చినట్టైంది. అసలే జగన్ దెబ్బకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీ నేతలు, శ్రేణులకు ప్రధాని మాటలు ఎంతోకొంత బలాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. ఇక రేపటి నుంచి ఏపీ ప్రతిపక్షాలతో పాటు పచ్చ మీడియా జమిలి ఎన్నికల తోక పట్టుకుని ఈ మూడున్నరేళ్లు ఎలాగోలా కాలం వెల్లదీసేందుకు ప్రయత్నిస్తాయి.
త్వరలో ఎన్నికలు జరిగి, జగన్‌ను ఓడిస్తామనే నినాదంతో శ్రేణుల్లో మనోస్థైర్యం నింపేందుకు టీడీపీతో బీజేపీ-జనసేన కూటమి కూడా జనంలోకి వెళ్లడం ఖాయం. దారి తెన్నూ తెలియక పార్టీని నడిపిస్తున్న చంద్రబాబుకు ప్రధాని మోడీ పరోక్షంగా జమిలి ప్రస్తావనతో ఓ మార్గం చూపినట్టైంది.
ప్రధాని జమిలి ఎన్నికల గురించి మాట్లాడం, దానిపై ఇప్పటి నుంచి పచ్చ బ్యాచ్ హడావుడి చేయడం చూస్తే …ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెత గుర్తు రాక తప్పదు.