ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు తేదీ ఖరారైంది. సోమవారం (30వ తేదీ) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ మేరకు గవర్నర్ పేరిట నోటిఫికేషన్ వెలువడింది. ఎన్ని రోజులు జరపాలనే అంశాన్ని సోమవారం జరగనున్న బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 5 వరకు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
శీతాకాల సమావేశాల్లో భాగంగా 11 చట్టాల్లో సవరణలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో పాటు 3 కీలక బిల్లులపై చర్చ ప్రారంభించాలని అనుకుంటోంది. అయితే వీటికంటే ముందుగా 3 రాజధానుల అంశం, స్థానిక సంస్థల ఎన్నికలు, అంతర్వేది ఘటన లాంటి అంశాలపై అసెంబ్లీలో వాడివేడిగా వాగ్వాదం జరిగే అవకాశాలున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నప్పటికీ, మిగతా అన్ని పార్టీలు సంసిద్ధత వ్యక్తంచేసినప్పటికీ.. ఎన్నికల కమిషనర్ అనుచిత వ్యవహార శైలి కారణంగా జగన్ సర్కార్ ఇప్పట్లో ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేయడం లేదు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు సభలో చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది.
అటు ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కూడా ఈ అంశంపై చర్చకు మానసికంగా సిద్ధంగా ఉన్నారు. టీడీపీని పూర్తిస్థాయిలో కార్నర్ చేసేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. మంత్రి అనీల్ కుమార్, ఎమ్మెల్యేలు రోజా, అంబటి రాంబాబు లాంటి నేతలు ఇప్పటికే అసెంబ్లీలో టీడీపీ వాదనల్ని సమర్థంగా తిప్పికొట్టిన అనుభవం కలిగి ఉన్నారు. వాళ్లే ఈసారి కూడా తెరపైకొచ్చే ఛాన్స్ ఉంది.
మరోవైపు కీలకమైన 3 రాజధానుల అంశం, ఇసుక పాలసీపై కూడా అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే అంశాన్ని టీడీపీ కొత్తగా భుజానికెత్తుకుంది. ఆ అంశాన్ని కూడా ఆ పార్టీ సభలో ప్రస్తావించి, చర్చకు పట్టుబట్టే అవకాశాలున్నాయి.
మరోవైపు కరోనా నేపథ్యంలో.. అసెంబ్లీ పనిదినాల్ని కుదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సిట్టింగ్ లో మార్పులతో పాటు.. అందరికీ స్క్రీనింగ్ చేయడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు అసెంబ్లీ అధికారులు.