మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిది ఇవాళ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రత్యర్థి, వైసీపీ కీలక నాయకుడు విజయసాయిరెడ్డి కూడా ట్విటర్ వేదికగా వరుసకు అన్న అయిన చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకంటే గతంలో ఇదే చంద్రబాబుకు వెటకారంతో కూడిన శుభాకాంక్షలు చెప్పడం విమర్శలకు దారి తీసింది.
తాజాగా విజయసాయిరెడ్డిలో ఎంతో మార్పు వచ్చింది. వివాదాలకు దూరంగా వుంటున్నారు. గత కొన్ని నెలలుగా విజయ సాయిరెడ్డి ట్విటర్ ఖాతాలో దూషణలకు స్థానం లేదు. తన పని వరకే ఆయన పరిమితం కావడం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబుకు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు చెప్పిన తీరు టీడీపీ శ్రేణుల్ని ఆనందానికి గురి చేస్తోంది.
“టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా” అని విజయసాయిరెడ్డి తనదైన ప్రేమతో శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు. ఇదే విజయసాయిరెడ్డి 2021లో చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు ఏ విధంగా చెప్పారో చూద్దాం.
“ఏపీలో ఆఫీసులు మూసేయడంతో, పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి శుభాకాంక్షలు” అంటూ విజయసాయిరెడ్డి తెలిపారు. అప్పట్లో బాబును విమర్శిండానికి చివరికి ఆయన పుట్టిన రోజు కూడా వదిలి పెట్టలేదనే ఆగ్రహాన్ని విజయసాయిరెడ్డి ఎదుర్కొన్నారు. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఎంత అక్కసుతో ఉన్నారో నాటి ట్వీట్లే నిదర్శనం. అలాంటి విజయసాయిరెడ్డిలో కాలం ఎంతో మార్పు తీసుకొచ్చింది.
విజయసాయిరెడ్డితో వచ్చిన మార్పును నెటిజన్లు గుర్తించారు. అందుకే ‘మీరు మారిపోయారు విజయసాయిరెడ్డి గారు’ అంటూ టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అభిమానాన్ని చాటుకున్నారు. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబును బండబూతులు తిడుతూ ట్వీట్లు చేసిన విజయసాయిరెడ్డి… ఆయన్ను శ్రీ అని గౌరవిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారంటే నమ్మలేకపోతున్నామనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.