హోల్ సేల్ పద్దతి వల్ల బ్యాడ్ నేమ్

ఇటీవల తెలుగు నిర్మాతలు కొత్త పద్దతి అవలంబిస్తున్నారు. సినిమాను హోల్ సేల్ గా అమ్మేయడం. నిజంగా అమ్మేస్తున్నారో, లేదా అదో మార్కెటింగ్ టెక్నిక్ నో అన్న అనుమానాలు వుండనే వున్నాయి. తాము అనుకున్న రేట్…

ఇటీవల తెలుగు నిర్మాతలు కొత్త పద్దతి అవలంబిస్తున్నారు. సినిమాను హోల్ సేల్ గా అమ్మేయడం. నిజంగా అమ్మేస్తున్నారో, లేదా అదో మార్కెటింగ్ టెక్నిక్ నో అన్న అనుమానాలు వుండనే వున్నాయి. తాము అనుకున్న రేట్ కోసం, మధ్యలో ఒకరిని హోల్ సేల్ బయ్యర్ గా చూపిస్తున్నారనే అనుమానాలు వున్నాయి. లేదా నిజంగానే కొంటున్నారో మరి. కానీ ఈ పద్దతి వల్ల సినిమాలకే బ్యాడ్ నేమ్ వస్తోంది.

నిజానికి ఇప్పుడు టాలీవుడ్ లో కొన్ని స్థిరమైన బ్యానర్లు వున్నాయి. వాటికి స్థిరమైన డిస్ట్రిబ్యూటర్లు వున్నారు. వీళ్ల మధ్య సరైన సంబంధాలు వున్నపుడు ఓవర్ ఫ్లోస్ ఓ పద్దతిగా వస్తాయి. అందువల్ల కాస్త తక్కువ రేట్లకు ఇచ్చి ఓవర్ ఫ్లోస్ సక్రమంగా వసూలు చేసుకోవడం అన్నది మంచి పద్దతి. కానీ అలా జరగడం లేదు. వీలయినంత ఎక్కువకు సినిమాను ఇస్తున్నారు. ఓవర్ ఫ్లోస్ ఎలాగూ రావు అనే అపనమ్మకంతో ఇలా చేస్తున్నారేమో తెలియదు.

కానీ దీని వల్ల ఏమవుతోంది సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు అనే ముద్ర పడుతోంది. హీరోకు బ్యాడ్ నేమ్ వస్తుంది. దసరా సినిమాను 24 కోట్లకు హోల్ సేల్ గా అమ్మేసారు. వాళ్లు మారుబేరాలు చేసి ఆఖరికి అది రెండు తెలుగు రాష్ట్రాలకు 30 కోట్ల మేరకు చేరుకుంది. ఇప్పుడేమయింది? నైజాం, వైజాగ్, ఈస్ట్ మినహా మిగిలిన బయ్యర్లకు నష్టాలే మిగిలాయి. నాని సినిమా వల్ల బయ్యర్లు నష్టపోయారు అనే మాట మిగిలింది. అదే 24 కోట్ల రేంజ్ లోనే బయ్యర్లకు అంది వుంటే అంతా లాభాలు కళ్ల చూసేవారు.

విరూపాక్ష సినిమా 22 కోట్ల మేరకు హోల్ సేల్ గా ఇచ్చేసారు. ఇప్పుడు ఏమయింది..ఆంధ్రలో 11 కోట్ల మేరకు మార్కెట్ చేసారు. సాయి ధరమ్ తేజ్ సినిమా ఆంధ్రలో 11 కోట్లు ప్లస్ ఖర్చులు రాబట్టాలంటే సినిమా చాలా అంటే చాలా పెద్ద హిట్ కావాల్సి వుంటుంది. లేదూ అంటే హీరోకు బ్యాడ్ రిమార్క్.

అఖిల్ ఏజెంట్ సినిమా కూడా ఇదే తంతు. 30-32 కోట్ల మధ్య హోల్ సేల్ గా అమ్మేసారు. ఆంధ్ర 15 కోట్ల రేంజ్ లో మార్కెట్ చేసారు. నాని లాంటి హీరో దసరా సినిమా ఆంధ్ర 13 కోట్ల రేంజ్ లో మార్కెట్ చేస్తే ఏజెంట్ 15 కోట్లు లాగాలంటే ఎంత భారీ ఓపెనింగ్ రావాలి. ఎంత భారీ కలెక్షన్లు రావాలి. ఇదే సినిమా నైజాం 12 కోట్లు రేంజ్ లో అమ్ముదాం అనుకుంటే ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎందుకని? సినిమా విడుదల తరువాత ఎలా వుంటుందో ఎవరికీ తెలియదు. అంతకు అంతా రావచ్చు..ముందుగా చెప్పలేం. ముందుగా లెక్క కట్టేది మాత్రం గత సినిమా అంకెలతోనే.

అమిగోస్, మీటర్ సినిమాలు హోల్ సేల్ గా అమ్మేసారు. దాంతో కొన్న బయ్యర్ నష్టపోయారు. మైత్రీ సంస్థకు బ్యాడ్ నేమ్ మిగిలింది.

అందుకే నిర్మాతలు తమ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లనే నమ్ముకుని, రీజనబుల్ రేట్లకు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ ల మీద ఇచ్చి ఓవర్ ఫ్లోస్ తీసుకుంటే ఎవ్వరికీ కష్టం వుండదు. హీరోలు మాట పడరు. అలా కాకుండా ఇలా చేయడం వల్ల హీరోలు బ్యాడ్ అవుతున్నారు. బయ్యర్లు నష్టపోతున్నారు. అందుకే ఈ హోల్ సేల్ అమ్మకాలు సరైన విధానం కాదని అనుభవం వున్న నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.