ఎవరికైనా తమ ప్రాణం కంటే ఏదీ విలువైంది కాదు. ప్రాణం తర్వాతే ఏదైనా, ఏమైనా. తన ప్రాణాన్ని ఎంతగా ప్రేమిస్తారో, ఇతరుల ప్రాణాలు కూడా అంతే అని భావిస్తే సమస్యే లేదు. కానీ ఇతరుల ప్రాణాలను సునాయాసంగా తీసినోడు, తన ప్రాణాలకు రక్షణ లేదని మాట్లాడుతుంటే అసహ్యం కలుగుతోంది. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి మాటలు వింటూ…ఇదే ఖర్మరా బాబు అని పౌర సమాజం ఈసడించుకుంటోంది.
వివేకాను చంపడం హీరోయిజంగా చెప్పుకుంటున్నాడీ దస్తగిరి. ఓ హంతకుడు దర్జాగా మీడియా ముందుకొచ్చి, ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే అని సంతోషంగా కథ చెప్పినట్టు వివరిస్తున్నాడు. తాజాగా కొత్త పల్లవి ఎత్తుకున్నాడు.
“ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉంది. సిబ్బందిని పెంచి భద్రత కల్పించాలి” అని దస్తగిరి కోరాడు. ఆయన విన్నపం మేరకు ప్రభుత్వం భద్రతను కూడా పెంచింది. ఇప్పటి వరకు 1+1 ఉన్న భద్రతను 1+5కి పెంచుతూ పోలీసులు చర్యలు తీసుకున్నారు. వివేకాను చంపేటప్పుడు విలువైన ప్రాణాల్ని తీస్తున్నానన్న స్పృహ లేకపోవడం గమనార్హం. వివేకాను చంపిన హంతకుడు ఇప్పుడు తన ప్రాణాలకు ఏదైనా జరుగుతోందని గగ్గోలు పెట్టడం వెనుక వ్యూహం ఏంటో అందరికీ తెలుసు.
తద్వారా జగన్ సర్కార్ మనకెందుకొచ్చిన గొడవలే అని అతను కోరుకున్నట్టు భద్రత పెంచుతుందనే ఎత్తుగడ అతనితో ఈ మాటలు మాట్లాడిస్తోంది. పైగా సీఎం జగన్‌పై ఆరోపణలు కావడంతో ప్రభుత్వం కూడా రిస్క్ చేయదలుచుకోలేదు.
దస్తగిరి సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డిల నుంచి తనకు ప్రాణహాని వుందని బహిరంగంగా చెబుతున్న నేపథ్యంలో, మరెవరైనా అతన్ని అంతమొందించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఆ నిందను జగన్, అవినాష్‌రెడ్డిపై వేసేందుకు కూడా వెనుకాడని రాజకీయ కక్షలు ఏపీలో నెలకున్నాయి. దీంతో ప్రభుత్వం తక్షణమే అతనికి భద్రతా ఏర్పాట్లు చేసింది. కానీ తన ప్రాణాలపై తీపి పెంచుకున్న దస్తగిరి, సౌమ్యుడైన వివేకాను హత్య చేసే సందర్భంలో ఒక్క నిమిషం కూడా ఆలోచించకపోవడం దుర్మార్గమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.