ముమ్మాటికీ అది బ‌ల ప్ర‌ద‌ర్శ‌నే

ఉద్యోగుల ఉద్య‌మంపై ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉద్యోగుల ఉద్య‌మ పంథాపై ప్ర‌భుత్వ వైఖ‌రిని స‌జ్జ‌ల మాట‌లు ప్ర‌తిబింబిస్తున్నాయి. ఉద్యోగుల ఆందోళ‌న‌ను ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు స‌జ్జ‌ల మాట‌ల‌ను…

ఉద్యోగుల ఉద్య‌మంపై ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉద్యోగుల ఉద్య‌మ పంథాపై ప్ర‌భుత్వ వైఖ‌రిని స‌జ్జ‌ల మాట‌లు ప్ర‌తిబింబిస్తున్నాయి. ఉద్యోగుల ఆందోళ‌న‌ను ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు స‌జ్జ‌ల మాట‌ల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. నూత‌న పీఆర్సీని వ్య‌తిరేకిస్తూ పీఆర్సీ సాధ‌న స‌మితి పిలుపు మేర‌కు గురువారం చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

ఉద్యోగులు ఉద్య‌మాన్ని ఉధృతం చేస్తున్న క్ర‌మంలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఉద్యోగులు రేపు చేసేది ఒక ర‌కంగా బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌నే అని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రి మీద బ‌ల‌ప్రద‌ర్శ‌న చేయాల‌ని ఉద్యోగులు అనుకుంటున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ప్ర‌భుత్వం మెడ‌లు వంచొచ్చ‌నేది ఉద్యోగుల అభిప్రాయ‌మన్నారు. సమస్యలుంటే పాయింట్ల వారీగా చెప్పాలని.. మీరు చెప్పే వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. సమ్మె అవసరం లేకుండా సమస్య పరిష్కారం చేద్దామని చెప్పామ‌న్నారు. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయ‌న్నారు. సమస్యలను జఠిలం చేసుకోవద్దని చెప్పామ‌న్నారు. కరోనా నేపథ్యంలో ఆందోళన వద్దని సజ్జల విజ్ఞప్తి చేశారు.

కొత్త పీఆర్సీతో ఎవ్వరి జీతాలు తగ్గలేదని మ‌రోసారి ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఉద్యమాలతో ఉద్యోగులకు నష్టం చేయవద్దని ఆయ‌న కోరారు. సమ్మెకు దిగి ఉద్యోగులు ఏం సాధిస్తార‌ని ఆయ‌న నిల‌దీయ‌డం విశేషం. ఇప్ప‌టికైనా ఉద్యోగుల త‌మ కార్యాచరణను పక్కన పెట్టి చ‌ర్చ‌ల‌కు రావాల‌ని ఆయ‌న మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేశారు. సమ్మెకు వెళ్లకముందే రోడ్డు ఎక్కడం సరికాదని ఆయ‌న హితవు పలికారు.