ఎమ్బీయస్‍: సంతాన గో‘పాలు’డు

సంతానం కావాలంటే సంతానగోపాల మంత్రం అని ఒకటి పఠించే సంప్రదాయం వుంది మన దేశంలో. పాశ్చాత్యదేశాల్లో గో‘పాలు’ణ్ని ప్రత్యక్షంగా ఆశ్రయించే పద్ధతి ఉందా? అనిపించింది ఓ రెండు వారాల క్రితం ఓ తెలుగు టీవీలో…

సంతానం కావాలంటే సంతానగోపాల మంత్రం అని ఒకటి పఠించే సంప్రదాయం వుంది మన దేశంలో. పాశ్చాత్యదేశాల్లో గో‘పాలు’ణ్ని ప్రత్యక్షంగా ఆశ్రయించే పద్ధతి ఉందా? అనిపించింది ఓ రెండు వారాల క్రితం ఓ తెలుగు టీవీలో కథనం వింటే. దాని ప్రకారం దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలోని పౌరులపై ఎఫ్‌బిఐ వారు డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా వారిలో 800 మందికి ఒకేలాటి లక్షణాలు కనబడ్డాయట. ఎందుకు వచ్చిందీ పోలిక అని లోతుగా తరచి చూస్తే వాళ్ల అమ్మమ్మలకు, నానమ్మలకు 1950, 60లలో ‘వీర్యదానం’ చేసినది ఒకే వ్యక్తిట. 

అది వేరెవరో కాదు, వాళ్లందకీ పాలు పోసిన రాండాల్ జెఫ్రీస్! అతను యిప్పటికీ జీవించే ఉన్నాడు. వయసు 90 పైనే. అతనికి వెళ్లి యీ వార్త చెపితే ఆశ్చర్యపడ్డాడు. ‘నాకు అనేక మంది స్త్రీలతో సంబంధం వున్నమాట నిజమే కానీ, నా కారణంగా అనేక మంది పిల్లలు పుట్టారని, వాళ్ల పిల్లలు, మనుమలు అందరూ కలిసి 800 మంది ఉన్నారన్న సంగతి నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నా భార్యతో నాకు పిల్లలు లేరు.’ అన్నాడట. అతని ఫోటో కూడా టీవీలో చూపించారు. ఈ కథనానికి మూలం ‘డైలీ న్యూస్ రిపోర్టెడ్’ అనే ఒక వెబ్‌సైట్‌లో పడిన వార్త.

ఇది చూడగానే నాకు ఎప్పుడో ఖుశ్వంత్ సింగ్ రాసిన ‘మిల్క్‌మాన్స్ ఎఫెక్ట్’ గుర్తుకు వచ్చింది. 1970లలో ఇలస్ట్రేటెడ్ వీక్లీని ఎడిట్ చేసే రోజుల్లో ఆయన అనేక చిన్నాచితకా సరదా విషయాలు రాసేవాడు. దీనిలో కొంటెతనం వుంది కాబట్టి గుర్తుండిపోయింది. కవలలు సాధారణంగా ఒకే పోలికలతో వుంటారు. ఒక్కోప్పుడు వేర్వేరు పోలికలతో వుంటారు. వాళ్లని డిజీగోటిక్ (రెండు సెల్స్) కవలలు అంటారు. రెండు అండాలు రెండు వేర్వేరు స్పెర్మ్‌స్‌తో ఫలదీకరణ జరిగినప్పుడు యిలా జరుగుతుంది. అండాలు రెండూ ఒకే తల్లివి అయినా, స్పెర్మ్‌స్ రెండూ ఒకరివే కావచ్చు, వేర్వేరు వ్యక్తులవి కావచ్చు. ఒకవేళ వేర్వేరు అయితే యిద్దరు వ్యక్తులు ఒకరి తర్వాత మరొకరు ఆ స్త్రీతో రతిలో పాల్గొన్నారని అనుకోవాల్సి వస్తుంది. దీన్ని మిల్క్‌మాన్ ఎఫెక్ట్ అంటారని ఖుశ్వంత్ రాశారు.

మధ్యలో పాలవాడు ఎక్కణ్నంచి వచ్చాడు అంటే పాశ్చాత్యదేశాల అలవాటును చెప్పుకుని వచ్చాడు. కార్మికుడైన భర్త తెల్లవారుఝామున లేచి ఫ్యాక్టరీకి వెళితే, ఆ తర్వాత కొద్ది సేపటికే పాలు సప్లయి చేసే కుర్రవాడు వస్తాడని, అరకొర దుస్తుల్లో ఉన్న గృహిణి అతన్ని ఆకర్షిస్తుందని, ఆకలి యింకా తీరని గృహిణి అతన్ని ఆకర్షిస్తుందని వాళ్లిద్దరూ రతిలో పాల్గొనడం వలన రెండు బీజాలు పడడం వలన పోలిక లేని కవలలు పుట్టి వుంటారని అనుకుంటారని ఖుశ్వంత్ రాశారు. వినడానికి తమాషాగా వుండటంతో గుర్తుండి పోయింది. తర్వాత ఆ టెర్మ్‌ను వైద్యులు కానీ పరిశోధకులు కానీ వాడినట్లు నాకు తారసపడలేదు. ఇప్పుడు కూడా నెట్‌లో వెతికాను, తగల్లేదు. ఖుశ్వంత్ చెప్పినది బహుశా జోక్ అయివుంటుంది. సైంటిఫిక్ బేస్ ఏదీ వున్నట్లు లేదు.

జోక్ ఎందుకంటున్నానంటే తర్వాతి రోజుల్లో చాలా మిల్క్‌మేన్ జోకులు చదివాను. తెల్లవారకుండానే, గృహిణి రాత్రి దుస్తుల్లో వుండగానే పలకరించే అవకాశం పాలబ్బాయికే వుండడంతో, అతను రసికుడైతే ఏం జరుగుతుందనే ఊహతో కాబోలు చాలా ఛలోక్తులు పుట్టుకుని వచ్చాయి. మన సాహిత్యంలో కూడా పాలతో వ్యవహరించే గోపాలకృష్ణుడు, అతని ఊరించే గొల్లభామలు శృంగారానికి ప్రసిద్ధి కదా. చెప్పాలంటే పాలకు, మురిపాలకు, పాపాలకు (పరకీయ శృంగారం కాబట్టి), సరసాలకు ఏదో సంబంధం వుంది. పాలముంతలకు, వెన్నముద్దలకు గోపస్త్రీ పొంగులకు లింకు పెడుతూ ఎన్నో పద్యాలు, పాటలు ఉన్నాయి. మన ప్రబంధాలలోని పురవర్ణనలలో పుష్పలావికలను (బజారులో పూలు అమ్మే స్త్రీలు) ఆధారం చేసుకుని శృంగారపరమైన చమత్కారాలుంటాయి. అలా పాశ్చాత్యదేశాల్లో పాలుపోసేవాణ్ని కేంద్రంగా చేసుకుని శృంగారసాహిత్యం పుట్టి వుంటుంది.

ఈ టీవీ కథనం చూడగానే, అయితే యీ మిల్క్‌మాన్ జోక్స్ వెనుక వాస్తవాలు కూడా ఉన్నాయన్నమాట అని నాకనిపించింది. 800 మంది పుట్టుకకు కారకుడయ్యాడంటే, ఆ రాండాల్ గ్రంథసాంగుడు ఎంతమందితో దక్షిణనాయకత్వం వెలగబెట్టాడో అని ఆశ్చర్యపడ్డాను. కానీ తర్వాత తెలియవచ్చింది, యిదంతా ఫేక్ న్యూస్ అని. డిసెంబరు 24న యీ వార్త ప్రచురించిన ‘డైలీ న్యూస్ రిపోర్టెడ్’ వెబ్‌సైట్ కాల్పనిక, వ్యంగ్య కథనాలను మాత్రమే ప్రచురిస్తుందట. రాండాల్ అంటూ వాళ్లు వేసిన ఫోటో నెట్‌లో దొరికే స్టాక్ ఫోటోల్లో ఒకటిట. మరే యితర వెబ్‌సైట్ కానీ, వార్తా సంస్థ కానీ యీ న్యూస్ వేయలేదట! నిజమే అయితే యింత సెన్సేషనల్ న్యూస్‌ను వదిలిపెడతారా? ఈ వెబ్‌సైట్ కూడా ‘ఎబౌట్ అజ్’ అనే సెక్షన్‌లో ‘మేము కట్టుకథలనే వేస్తాము. పేర్లు సృష్టిస్తాము. ఆ పేరుతో ఆ స్థలంలో ఎవరైనా నిజమైన వ్యక్తులుంటే అది యాదృచ్ఛికమే తప్ప మరొకటి కాదు’ అని స్పష్టంగా రాశారట. అవన్నీ చూసేవారెవరు? ఒకడు 800 మంది పుట్టుకకు కారకుడయ్యాడు అనగానే ప్రపంచమంతా చకచకా పాకిపోయింది. అనేకమంది ఆ కథనాన్ని రిపోర్టు చేశాయి.

పాఠకులతో ఇదెక్కడి మోటుసరసం అనిపిస్తోంది కదా! మిల్క్‌మన్ లాగే పోస్ట్‌మన్ కూడా రసికుడే అనే భావం పాశ్చాత్యదేశాల్లో వుందట. దాన్ని ఆధారం చేసుకుని 2016 ఫిబ్రవరి లోనే ‘‘వ(ర)ల్డ్ న్యూస్ డైలీ రిపోర్ట్’’ అనే వెబ్‌సైట్ ఒక పోస్టుమన్ 1300 మంది జన్మించడానికి కారకుడయ్యాడని, టెన్నిసీలో నివసించే ఒక కుటుంబం ఒక డిటెక్టివ్‌ను పెట్టి పరిశోధించగా యీ విషయం బయట పడిందని, ఆనాటి అక్రమ సంబంధాలను యీ 87 ఏళ్ల వయసులో అతను ఒప్పుకున్నాడని రాసింది. ‘ఆనాటి పాప్యులర్ అమెరికన్ గాయకుడు జానీ కాష్‌కు నాకూ పోలికలుండేవి. దాంతో చాలామంది నేనంటే పడి చచ్చేవారు. వాళ్ల కోర్కెలు తీర్చి బతికించేవాణ్ని. అప్పట్లో గర్భనిరోధక సాధనాలుండేవి కావు. ఏం చెయ్యమంటారు?’ అన్నాడని తెలిపింది. తీరా చూస్తే యీ వెబ్‌సైట్ కూడా పైన చెప్పిన వెబ్‌సైట్ లాటిదే. కట్టుకథలు తప్ప యథార్థవార్తలు వేయం అని కంకణం కట్టుకున్నదే! ఫోటో ఎవరిదో ఒకరిది వేయాలి కాబట్టి 97 ఏళ్ల యుద్ధవీరుడిది జోడించింది.

ఇంకొన్నాళ్లకి యింటింటికి వెళ్లే వృత్తిలో ఉన్న మరొకరి చుట్టూ యిలాటి కథ అల్లవచ్చు. ఇలాటి రసవత్తరమైన వార్తలు చదివే అలవాటు మరో 50, 60 ఏళ్లకు కూడా మనుషుల్లో చావదు కాబట్టి ‘2020 ప్రాంతాల్లో నేను స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాణ్ని. వర్క్ ఫ్రం హోం అంటూ అనేక మంది యువతులు వంటరిగా యింట్లోనే కాజువల్ డ్రస్‌లో కనబడేవారు. పొద్దుపోక పోర్నో సినిమాలు తెగ చూసేవారు. కరోనా భయంతో బయటకు వెళ్లడం లేదు కాబట్టి, అందుబాటులోకి వచ్చినవాడే అందగాడు అనుకునేవారు. ఏం జరగాలో అదే జరిగేది. దాని ఫలితమే కాబోలు నా అంశతో వందమంది పుట్టడం!’ అని 70 ఏళ్ల వృద్ధుడు చెప్పినట్లు 2070లో ఓ కథనం వచ్చినా రావచ్చు. (ఫోటో – రాండాల్ అంటూ వెబ్‌సైట్ వాళ్లు వేసిన ఫోటో)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2022)

[email protected]