జ‌న‌సేనాని విడ్డూరం!

వ‌కీల్‌సాబ్ హీరో, జ‌నసేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కేంద్ర బ‌డ్జెట్‌పై విడ్డూర‌పు వాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు. కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు చేయ‌ని మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీని విడిచిపెట్టి, వైసీపీని త‌ప్పు ప‌ట్ట‌డం ఆయ‌న‌కే చెల్లింది. కేంద్రంలో వైసీపీ…

వ‌కీల్‌సాబ్ హీరో, జ‌నసేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కేంద్ర బ‌డ్జెట్‌పై విడ్డూర‌పు వాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు. కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు చేయ‌ని మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీని విడిచిపెట్టి, వైసీపీని త‌ప్పు ప‌ట్ట‌డం ఆయ‌న‌కే చెల్లింది. కేంద్రంలో వైసీపీ ఆర్థిక మంత్రి బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టార‌నే భ్ర‌మ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉన్నారా? అనే అనుమానాలు నెటిజ‌న్ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీ స‌ర్కార్‌ను నిల‌దీయ‌క‌పోగా, త‌గ‌దున‌మ్మా అని ఏపీ స‌ర్కార్‌ను, వైసీపీ ఎంపీల‌ను విమ‌ర్శించ‌డం ఆయ‌న‌కే చెల్లిందని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

త‌న రాజ‌కీయ గురువైన చంద్ర‌బాబు బాట‌లోనే ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా న‌డ‌వ‌డం విశేషం. బాబు సంధించిన ప్ర‌శ్న‌ల‌నే ప‌వ‌న్ కూడా వేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రోసారి తాను చంద్ర‌బాబు కోస‌మే ఉన్నాన‌నే సంకేతాల్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాజా విమ‌ర్శ‌ల‌తో పంపిన‌ట్టైంది. జాతీయ ప్రాజెక్ట్ అయిన‌ పోలవరానికి 2022-23 బడ్జెట్లో కేటాయింపులు కనిపించలేదని ఆయ‌న అన్నారు. 22మంది వైసీపీ లోక్‎సభ సభ్యులు, ఆరుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో ఏం సాధించినట్లని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిలదీశారు.  

ఈ పరిస్థితి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద  పోలవరం ప్రాజెక్ట్ గురించి కనీసం ప్రస్తావిస్తున్నారా లేదా అనే సందేహం వస్తోందని పవన్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ప్రకటనల్లో మాత్రం పోలవరం గురించి అడిగాం అంటార‌న్నారు. కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేద‌న్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్ట్ కోసం అందుకున్న నిధులు కేవలం రూ.5163.2 కోట్లు మాత్రమే అని ప‌వ‌న్ తెలిపారు. ఇలాగైతే  పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఇదే యమునకు ఉప నదులైన కెన్-బెత్వా ప్రాజెక్ట్ కోసం రూ.44వేల కోట్లు ప్రతిపాదనలు ఈ బడ్జెట్లో ఉన్నాయని ఆయ‌న గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ ఎంపీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆయ‌న విమ‌ర్శించారు. నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని చూస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో కూడా అంచనాలకు అందటం లేద‌ని ప‌వ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఒక ప్ర‌తిప‌క్ష పార్టీగా, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి మిత్ర‌ప‌క్షంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేయాల్సిన బాధ్య‌త త‌న‌పై కూడా ఉంద‌ని ప‌వ‌న్ ఎందుకు విస్మ‌రించార‌ని ప్ర‌త్య‌ర్థులు ప్ర‌శ్నిస్తున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న‌దే త‌న మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ అనే విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తించుకోవాల‌ని నెటిజ‌న్లు హిత‌వు చెబుతున్నారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన‌, చేస్తున్న ద్రోహంలో త‌న‌కు కూడా భాగ‌స్వామ్యం ఉంద‌ని ప‌వ‌న్ ఇప్ప‌టికైనా గుర్తించి, రాజ‌కీయాల‌కు అతీతంగా మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌ల‌క‌డం కాద‌ని, ఆచ‌ర‌ణ‌లో తానేంటో జ‌నానికి తెలియ‌జేసేందుకు ఇంత‌కంటే మంచి త‌రుణం రాద‌ని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు. కావున ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాష్ట్ర విశాల ప్ర‌యోజ‌నాల దృష్ట్యా పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధుల సాధ‌న‌లో త‌న వంతు క‌ర్త‌వ్యాన్ని నెర‌వేర్చాల‌ని పౌర స‌మాజం కోరుతోంది.