ఈ సంకుచిత బుద్ధులతో జాతీయ పార్టీగా ఎలా సార్?

కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటేనే తొలినుంచి ఆంధ్రాద్వేషి అనే ముద్ర ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరుగుతున్న సమయంలో ఆయన ‘ఆంద్రోళ్లు’ అనే ట్యాగ్ లైన్ కు చెందిన ప్రతి వారినీ ఎంతెంత ఘోరంగా…

కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటేనే తొలినుంచి ఆంధ్రాద్వేషి అనే ముద్ర ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరుగుతున్న సమయంలో ఆయన ‘ఆంద్రోళ్లు’ అనే ట్యాగ్ లైన్ కు చెందిన ప్రతి వారినీ ఎంతెంత ఘోరంగా తూలనాడారో అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణలో మళ్లీ మళ్లీ నెగ్గుతూ ఉండాలంటే.. ఈ రాష్ట్రంలో స్థిరపడిన ఆంధ్రోళ్ల ఓట్లు కూడా అవసరం కనుక ఆయన ఆంధ్రోళ్ల మీద తన మాట మార్చారు. కొత్త పాట ఎత్తుకున్నారు. 

ఏదో ఉద్యమ సమయంలో ఆవేశంకొద్దీ బూతులు తిట్టాను తప్ప వారి మీద తనకు ద్వేషం లేదన్నారు. తెలంగాణలో స్థిరపడిన వారందరూ కూడా తమ బిడ్డలే అని అన్నారు. వారికి కాల్లో ముల్లు దిగితే కంటితో తీస్తానన్నారు.. ఇలా చాలా కబుర్లు చెప్పారు. ఆచరణలో ఆ నమ్మకాన్ని వారికి కలిగిస్తున్నారా? లేదా? అనేది వేరే సంగతి. 

అదే సమయంలో తెలంగాణ కోసం పోరాటం సాగుతున్న రోజుల్లో.. ట్యాంక్ బండ్ మీద ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగు ప్రముఖుల విగ్రహాలను పగులగొట్టి దారుణానికి పాల్పడ్డారు. అలాంటి విద్వేషాలు అప్పట్లో చెలరేగాయి. నిజానికి తెలుగు ప్రముఖులు ప్రాంతీయ భేదాలతో నిమిత్తం లేకుండా.. ఈ జాతికి చెందిన ప్రముఖులు అనే విశాల దృక్పథం అప్పట్లో కొరవడింది. తర్వాత వాటిని పునరుద్ధరించారు. ఇదొక అంశం.

తాజాగా తెలంగాణకు కొత్త సెక్రటేరియేట్ నిర్మించిన కేసీఆర్ దాని ఎదురుగా రోడ్డు మీద ఉన్న తెలుగు తల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలను అక్కడినుంచి తొలగించి పూర్తిగా రోడ్డు వేసేశారు. ఈ చర్య సర్వత్రా విమర్శలకు గురవుతోంది. 

తెలుగుతల్లి అంటే.. ఆంధ్రప్రాంతానికి పరిమితమైన వ్యవహారం కాదు. పొట్టి శ్రీరాములు అంటే కేవలం ఆంధ్రోడిగా గుర్తించడం అనేది అవమానకరం అవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే అది పొట్టి శ్రీరాములు త్యాగఫలితమే. ఆయనను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం సంకుచితత్వమే. 

ఆ రకంగా ఆంధ్రరాష్ట్రం, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి చిహ్నంగానే ఆయన విగ్రహం ఉంది. అలాగే తెలుగుతల్లి కూడా.. తెలుగుజాతికి ప్రతీక అవుతుంది. ఈ విగ్రహాలను ఎంతో కీలకమైన ఈ ప్రాంతం నుంచి తొలగించడం అనేది అందరికీ బాధాకరం. తెలుగుతల్లికి తెలంగాణ వారందరూ కూడా సొంత బిడ్డలే. తెలుగు భాషా ఔన్నత్య చిహ్నంగా తెలుగుతల్లి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనే చారిత్రక ఘట్టానికి ప్రతీకగా పొట్టి శ్రీరాములు విగ్రహాలు నిలుస్తాయి. వీటిని అక్కడినుంచి తొలగించారు. 

కనీసం ఈ విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠిస్తామని గానీ, అంతకంటె మిన్న అయిన ప్రాంతంలో పెడతామని గానీ ఒక్క ప్రకటన కూడా లేదు. ఇలా ఆంధ్రప్రాంత మహనీయుల అస్తిత్వాన్ని హైదరాబాదు నగరం మీద నుంచి చెరిపేసే సంకుచిత కుట్రలకు పాల్పడుతూ.. తాము జాతీయ పార్టీగా అవతరిస్తున్నాం.. ఆంధ్రప్రదేశ్ లో కూడా తమ పార్టీకి పట్టం కట్టాలి, ఓట్లు వేయాలి.. అని కేసీఆర్ ఎలా అనగలుగుతారో తెలియదు. 

తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠిస్తే తప్ప, కేసీఆర్ లో విశాలదృక్పథం ఏర్పడినట్టు ప్రజలునమ్మలేరు. ఆయన ఇలాంటి సంకుచిత పోకడలను పక్కన పెట్టకపోతే.. దేశవ్యాప్తంగా కూడా ప్రజలు కేసీఆర్ పట్ల నమ్మకాన్ని పెంచుకోలేరు.