నివాసం అంటున్నారే తప్ప, సెక్రటేరియేట్ ను విశాఖకు మారుస్తాం, సెప్టెంబరు నుంచి రాష్ట్ర సెక్రటేరియేట్ కార్యకలాపాలు విశాఖనుంచే జరుగుతాయి అనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్పడం లేదు. అలాంటి మాట అనడం వల్ల.. అనవసరంగా న్యాయపరమైన చిక్కులు కొని తెచ్చుకున్నట్టు అవుతుందని జగన్ భయపడుతున్నట్టున్నారు.
అందుకే తాజాగా విశాఖ రాజధాని అనే అంశం ప్రజలకు స్ఫురణకు వచ్చేలా తన ప్రసంగంలో.. ‘వచ్చే సెప్టెంబరు నుంచి మీ బిడ్డ నివాసం కూడా విశాఖలోనే ఉండబోతున్నాడు’ అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం గమనార్హం.
ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖకు తరలించాలని, అధికార వికేంద్రీకరణ పరంగా తాము ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ కు బలమైన సంకల్పమే ఉంది. కానీ వారికి పరిస్థితులు కలిసి రావడం లేదు. రాజధాని వికేంద్రీకరణ మీద హైకోర్టు తీర్పు వారికి అడ్డంకి గా నిలుస్తోంది. దానిపై సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగులో ఉంది. అక్కడ ఏ సంగతీ తేలకుండా రాజధానిని తరలించడం అనేది అంత సులువు కాదు. కోర్టు ధిక్కరణ రూపంలో జగన్ మరో కొత్త తలనొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు ఆయన సిద్ధంగా లేరు.
ఢిల్లీలో పెట్టుబడిదారులతో సదస్సులో మాట్లాడినా, ఇటీవల మరో సమావేశంలో విశాఖకు తరలడం గురించి ప్రకటించినా, ఇప్పుడు సెప్టెంబరు నుంచి మీ బిడ్డ విశాఖలోనే నివాసం ఉండబోతున్నాడని తేల్చి చెప్పినా.. ఆయన తన నివాసం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు.
ఇది టెక్నికల్ గా సాధ్యమయ్యే విషయం. హైదరాబాదులో సీఎం క్యాంప్ ఆఫీస్ రూపంలో అధికారిక నివాస భవనం ఉన్నప్పటికీ,అక్కడకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ఎక్కువగా ఉంటారనే ప్రచారం ఉంది. అక్కడినుంచే ఆయన పరిపాలన సాగించారు. రాష్ట్ర ఎడ్మినిస్ట్రేషన్ మొత్తం అక్కడినుంచే నడిచిన సందర్భాలున్నాయి. సెక్రటేరియేట్ అధికారులు.. సీఎం సంతకం అవసరమైన సందర్భాల్లో అక్కడకు వెళ్లి చేయించుకున్న సందర్భాలున్నాయి.
జగన్మోహన్ రెడ్డి పట్టుదలకు వెళ్తే.. ఇప్పుడు ప్రకటించినట్టుగా సెప్టెంబరు నాటికి.. ఎట్టిపరిస్థితుల్లోనూ తన కాపురం విశాఖకు మార్చేస్తారు. మరో రకంగా చూసినప్పుడు ఆలోగా సుప్రీం కోర్టులో ఉన్న పిటిషన్ తేలుతుందని, ఏ సంగతీ తీర్పు వస్తుందని కూడా ఆయన ఆశిస్తుండవచ్చు. తీర్పు రాకపోయినా సరే.. ఆయన తన కాపురం తాడేపల్లి నుంచి విశాఖకు మార్చడానికి ఏ కోర్టు తీర్పు కూడా అడ్డంకి కాబోదు.
అలా కాపురం మార్చి, త్వరలోనే రాజధానిని కూడా విశాఖకు తీసుకురావడానికి జగన్ కృతనిశ్చయంతో ఉన్నారనే నమ్మకాన్ని ఆయన ఉత్తరాంధ్ర ప్రజల్లో కలిగిస్తారు. అందుకే ఇలా ఆచితూచి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మిగిలిన పరిణామాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.