రాధేశ్యామ్ రిలీజ్.. అన్ని వైపుల నుంచి గట్టి పోటీ

ఓ పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేముందు మంచి టైమింగ్ చూసుకుంటారు. లాంగ్ వీకెండ్ లేదా ఫెస్టివల్ కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. కనీసం వేసవి శెలవులు సెట్ అయ్యేలా డేట్ లాక్…

ఓ పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేముందు మంచి టైమింగ్ చూసుకుంటారు. లాంగ్ వీకెండ్ లేదా ఫెస్టివల్ కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. కనీసం వేసవి శెలవులు సెట్ అయ్యేలా డేట్ లాక్ చేసుకుంటారు. ఇక రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాకు రిలీజ్ డేట్ లాక్ చేసేముందు మరిన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. 

సౌత్, బాలీవుడ్ మార్కెట్లపై కూడా చిన్నపాటి విశ్లేషణ చేసి విడుదల తేదీ ప్రకటించాలి. కానీ రాధేశ్యామ్ మేకర్స్ అలాంటి కసరత్తు చేసినట్టు కనిపించడం లేదు.

మార్చి 11న రాధేశ్యామ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. నిజానికి అది ఏపీ, తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో పరీక్షల సమయం. ఈ విషయాన్ని పక్కనపెడితే.. రాధేశ్యామ్ కు దాదాపు అన్ని ఇండస్ట్రీస్ నుంచి పోటీ ఎదురవుతోంది. మరి ఇలాంటి డేట్ ఎందుకు ఫిక్స్ చేశారో వాళ్లకే తెలియాలి.

టాలీవుడ్ నుంచి పోటీ

పవన్ హీరోగా నటించిన భీమ్లానాయక్ ఫిబ్రవరి 25న విడుదలై పెద్ద విజయం సాధిస్తే రాధేశ్యామ్ కు కష్టమే. పోనీ అలా జరగదనుకున్నప్పటికీ రాధేశ్యామ్ కు ఆర్ఆర్ఆర్ రూపంలో మరో పోటీ ఉండనే ఉంది. రాధేశ్యామ్ రిలీజైన 2 వారాలకే ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలోకి వస్తోంది. అప్పటికి రాధేశ్యామ్ రన్ ఎలా ఉన్నప్పటికీ, భారీగా థియేటర్లను కోల్పోవడం గ్యారెంటీ.

సో.. మార్చి 11కి రాధేశ్యామ్ రిలీజ్ అయి, పరిస్థితులు అనుకూలంగా ఉండాలంటే అటు భీమ్లానాయక్, ఇటు ఆర్ఆర్ఆర్ రెండూ వాయిదా పడాలి.

తమిళనాట 2 సినిమాలతో పోటీ

అటు కోలీవుడ్ లో కూడా రాధేశ్యామ్ కు ఏమంత అనుకూలంగా పరిస్థితులు లేవు. సూర్య నటిస్తున్న ఈటీ అనే సినిమాను సరిగ్గా రాధేశ్యామ్ విడులకు ఒక్క రోజు ముందు థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. కోలీవుడ్ లో కచ్చితంగా రాధేశ్యామ్ పై సూర్య సినిమా ప్రభావం ఉంటుంది. 

అంతకంటే ముందు, ఫిబ్రవరి 24కి అజిత్ నటించిన వాలిమై సినిమా వస్తోంది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ.. మార్చి 11 నాటికి థియేటర్లు ఖాళీ చేసి ఇవ్వడానికి అజిత్ ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు. ఇలా కోలీవుడ్ లో కూడా 2 సినిమాల నుంచి రాధేశ్యామ్ కు పోటీ ఎదురుకాబోతోంది.

కన్నడనాట పునీత్ సెంటిమెంట్ 

ఇక కన్నడనాట కూడా పరిస్థితి కాస్త కష్టంగానే ఉంది. ఈమధ్య కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అతడు నటించిన ఆఖరి చిత్రం మార్చి 17న విడుదల కానుంది. అంటే రాధేశ్యామ్ కు కన్నడనాట కేవలం 6 రోజులు మాత్రమే టైమ్ అన్నమాట. 17వ తేదీ నుంచి ప్రజలంతా జేమ్స్ సినిమా చూడడానికే ఇష్టపడతారు. 

జేమ్స్ అనేది కేవలం సినిమా కాదు, కన్నడ ప్రేక్షకుల ఎమోషన్ అనే ప్రచారం అక్కడ జోరుగా సాగుతోంది. పైగా 17 నుంచి వారం పాటు జేమ్స్ తప్ప మరో సినిమాను విడుదల చేయకూడదని కన్నడనాట డిస్ట్రిబ్యూటర్లంతా నిర్ణయించుకున్నారు. కాబట్టి కచ్చితంగా రాధేశ్యామ్ పై జేమ్స్ ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమాలో పునీత్ పోషించిన పాత్రకు, ఆయన అన్నయ్య శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెబుతున్నారు.

ఇక నార్త్ విషయానికొస్తే.. అక్కడ కూడా రాధేశ్యామ్ కు పోటీగా ఓ సినిమా సిద్ధంగా ఉంది. ప్రభాస్ సినిమా రిలీజైన వారం రోజులకే అక్షయ్ కుమార్ హీరోగా నటించిన బచ్చన్ పాండే విడుదలకాబోతోంది. ఈ సినిమా థియేటర్లలోకొస్తే, ఉత్తరాదిన కచ్చితంగా కొన్ని మెయిన్ సెంటర్లను రాధేశ్యామ్ కోల్పోవాల్సి ఉంటుంది.

ఇలా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో రాధేశ్యామ్ కు పోటీ గట్టిగానే ఉంది. అదే సమయంలో ఈ సినిమాల నుంచి ఓవర్సీస్ లో కూడా ప్రభాస్ మూవీకి పోటీ తప్పదు. ఇలాంటి టైట్ పొజిషన్ లో థియేటర్లలోకొస్తున్న రాధేశ్యామ్ ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి.