ఏపీలో బీజేపీకి పాతర వేయాల్సిందే?

భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒకటి ఉన్నదని.. భారతీయ జనతా పార్టీకి గుర్తుందా? లేదా? ఆ పార్టీ ఢిల్లీ నాయకులు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి వచ్చే సందర్భాల్లో మినహా.. వారికి ఈ రాష్ట్రం గుర్తుకు…

భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒకటి ఉన్నదని.. భారతీయ జనతా పార్టీకి గుర్తుందా? లేదా? ఆ పార్టీ ఢిల్లీ నాయకులు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి వచ్చే సందర్భాల్లో మినహా.. వారికి ఈ రాష్ట్రం గుర్తుకు వస్తుందా? లేదా? 

భారతదేశంలో ఈ రాష్ట్రం కూడా సమాన హక్కులున్న ఒక భాగమేనని, ఈ రాష్ట్ర అభ్యున్నతి కూడా కేంద్రప్రభుత్వం బాధ్యతల్లో ఒకటని వారు భావిస్తున్నారా? లేదా? అనే సందేహాలు కలుగుతాయి.. నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూసినప్పుడు! 

అరవై లక్షల ఉద్యోగాలు, పెట్టుబడుల వెల్లువ, ఆర్థిక వృద్ధి పరుగులు, వందల కొద్దీ.. వందే భారత్ రైళ్లు.. మౌలిక వసతుల కల్పన.. బడ్జెట్ చేస్తున్న మహాద్భుతాలంటూ ఇలాంటి అనేక రకాల మాటలను కేంద్రంలోని పెద్దలు చెప్పుకోవచ్చు గాక! కానీ ఈ బడ్జెట్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసాన్ని అడ్డుకునే, అభివృద్ధికి సమాధి కట్టే బడ్జెట్ అనేది అందరూ ఒప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఈ బడ్జెట్ ద్వారా తీరని ద్రోహం చేస్తోంది. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారనే సంగతి కేంద్రానికి తెలియాలి. 

ఇంత ద్రోహపూరితమైన బడ్జెట్ ను సమర్పించిన తర్వాత కూడా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలందరూ ఏకైక ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఆ మాట అనగల ధైర్యం నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉండే ఈ ప్రజాబలం లేని నాయకుడికి ఎలా వచ్చిందో తెలియదు. కానీ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ విజ్ఞతను ప్రదర్శించాలంటే మాత్రం.. ఈ రాష్ట్ర ప్రగతికి సమాధి కట్టాలని కేంద్రంలోని బీజేపీ అనుకుంటున్నదానికి ప్రతిగా.. రాష్ట్రంలో ఆ పార్టీని ఉప్పు పాతర వేయాలి. 

కనీసం డిపాజిట్లు తెచ్చుకోగలిగే స్థాయి కూడా లేని భారతీయ జనతా పార్టీ.. వచ్చే ఎన్నికల్లో తామే ఏపీలో అధికారంలోకి వచ్చేస్తామని బీరాలు పలుకుతోంది. ఈ రాష్ట్రానికి బీజేపీ ఏం మేలు చేసిందని.. రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి ఒకటి రెండు ఓట్లయినా వేయాలో ఆ పార్టీ నాయకులు కనిపించిన ప్రతిచోటా ప్రజలు నిలదీయాలి. 

ప్రజల ముందు కార్యక్రమాల్లో పాల్గొనడానికే నాయకులు సిగ్గు పడే పరిస్థితి కల్పించాలి. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుకుగా ప్రకటించిన తర్వాత కూడా.. దాని పూర్తికి కేంద్రం ఏం కేటాయింపులు చేస్తున్నదో తెలియని సంగతి. ఆ ప్రస్తావన కూడా లేకుండా బడ్జెట్ ను సమర్పించడం ఈ ప్రభుత్వానికి మాత్రమే చెల్లింది. అందుకే ఏపీ ప్రజలు జవాబు చెప్పాలి. 

ఈ రాష్ట్ర వికాసానికి తాము బాధ్యత తీసుకోకుండా.. కేంద్రం నుంచి రాష్ట్రంపై నిధులు, కేటాయింపుల పరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టకుండా ప్రజలను ఎంతోకాలం మోసం చేయడం సాధ్యం కాదని నిరూపించాలి. పార్టీకి బుద్ధి చెప్పాలి. అసలే అస్తిత్వం అంతంత మాత్రంగా ఉన్న బీజేపీకి పాతర వేయాలి.