కోటి రూపాయల ప్రశ్న: ఏపీ కేబినెట్ విస్తరణ ఎప్పుడు..?

ఏపీ కేబినెట్ విస్తరణ మహూర్తం ఎప్పుడనేది ఎవరికీ అంతు చిక్కని అంశం. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ రెండేళ్ల తర్వాత విస్తరణ ఖాయమన్నారు, కానీ కరోనా వల్ల కుదరలేదన్నారు. పాత మంత్రులే ఇంకా కుర్చీల్లో కుదురుకోలేదు,…

ఏపీ కేబినెట్ విస్తరణ మహూర్తం ఎప్పుడనేది ఎవరికీ అంతు చిక్కని అంశం. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ రెండేళ్ల తర్వాత విస్తరణ ఖాయమన్నారు, కానీ కరోనా వల్ల కుదరలేదన్నారు. పాత మంత్రులే ఇంకా కుర్చీల్లో కుదురుకోలేదు, కొత్తవారెందుకని వారిలో వారే సర్దిచెప్పుకున్నారు. 

ఆ తర్వాత సెకండ్ వేవ్, ఇప్పుడు థర్డ్ వేవ్.. ఇలా వరుస అడ్డంకులతో ఏపీ కేబినెట్ లో మాత్రం మార్పులు లేవు. పోనీ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పద్ధతి ఉందా అని సరిపెట్టుకోలేం. అక్కడ స్థానిక రాజకీయ అవసరాల మేరకు కొత్త టీమ్ లు ఏర్పడిపోతున్నాయి, పాత జట్టులో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కానీ ఏపీలో ఇప్పటికిప్పుడు అలాంటి అవసరం లేదు కాబట్టి.. సీఎం జగన్ కూడా కూడా నింపాదిగా ఉన్నారు.  

అయితే కొత్త మహూర్తం కుదిరింది అంటున్నారు. ఫిబ్రవరి 16, 22 అనే ప్రచారం జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మార్చిలో మొదలవుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీటిలో ఏది నిజం..? ఎంత నిజం..? అసలిప్పుడు కేబినెట్ విస్తరణ అవసరమేనా..?

కేబినెట్ విస్తరణ అనేది అత్యవసరం కాకపోయినా జగన్ ఆ మేరకు ఓ మాట చెప్పారు, అది శిలాశాసనం అని పదవుల కోసం కొంతమంది ఆశపెట్టుకున్నారు. తొలి విడతలో ఛాన్స్ మిస్ అయినవారు, మలి విడత అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తమ టాలెంట్ నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇలాంటివారందరికీ కేబినెట్ విస్తరణ అత్యవసరం. ఎన్నికలకు వెళ్లే సమయానికి మంత్రి పదవిలో ఉంటే, అది అదనపు బలం అని భావిస్తున్నారు మరికొందరు. మరి జగన్ మనసులో ఏముందో తేలాల్సి ఉంది.

కొత్త జిల్లాల ఏర్పాటే నాందీ వాచకమా..?

ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాల కోసం ఎవరూ జగన్ పై ఒత్తిడి చేయలేదు. కానీ ఆయనే నవరత్నాల హామీ కనుక ముందడుగు వేశారు. శాస్త్రీయంగా అధ్యయనం చేయించి, ఎక్కడా ఎవరికీ అన్యాయం జరక్కుండా 13 జిల్లాలను 26 చేస్తున్నారు. ఒకటి రెండు చోట్ల కాస్త అసంతృప్తి ఉన్నా రాబోయే రోజుల్లో అది సర్దుకుపోతుందని అంటున్నారు. అంటే కొత్త జిల్లాల ప్రకటనతో ఒకరకంగా కేబినెట్ విస్తరణకు కూడా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే భావించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కొత్త జిల్లాల సరిహద్దుల ప్రకారం, రాజకీయ, సామాజిక సమీకరణాల ప్రకారం కొత్త మంత్రివర్గ కూర్పు ఉంటుందని, అందుకే జిల్లాలను విభజిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరించినా, విస్తరించకపోయినా.. లెక్కలన్నీ కొత్త జిల్లాలకు అనుగుణంగానే ఉంటాయనేది మాత్రం వాస్తవం. అందుకే జిల్లాల విభజనతో కేబినెట్ విస్తరణకు లింకు కుదురుతోంది. అంతా బాగానే ఉంది కానీ మహూర్తం ఎప్పుడనేది మాత్రం తేలాల్సి ఉంది.