పవన్ కల్యాణ్ లో చేవ చచ్చిపోయిందా?

కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించే ప్రతి ఒక్కరూ.. ఈ బడ్జెట్ గురించి పెదవి విరిచారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఎనలేని ద్రోహం చేస్తున్నదనే మాటే…

కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించే ప్రతి ఒక్కరూ.. ఈ బడ్జెట్ గురించి పెదవి విరిచారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఎనలేని ద్రోహం చేస్తున్నదనే మాటే సర్వత్రా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకు నిధులు కేటాయించకపోవడం మాత్రమే కాదు. 

ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం చేసిన వంచనకు ప్రజలు అలవాటు పడిపోయి, ఆశ వదలుకున్నారు. కనీసం పోలవరం ప్రాజెక్టుకు నయాపైసా కేటాయింపులేకపోవడం, విశాఖ రైల్వేజోన్ గురించి ప్రస్తావన కూడా లేకపోవడం ఇవన్నీ ఏపీలో సామాన్యులకు కూడా ఆగ్రహం కలిగించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమాత్రం కేవలం నిరాశ కలిగించాయి. 

కేంద్రం తీసుకువచ్చిన బడ్జెట్ చాలా అత్యద్భుతమైన బడ్జెట్ అని.. దేశాన్ని అత్యద్భుతంగా తయారు చేసేస్తుందని కీర్తిస్తూ పవన్ కల్యాణ్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ.. అందులో ఏపీకి కేటాయింపులు లేకపోవడం గురించి ఒక మాట నిరాశ వ్యక్తం చేశారు. 

కేంద్ర బడ్జెట్ సందర్భంగా అందరితో పాటు పవన్ కల్యాణ్ కూడా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. అది ఆద్యంతం మోడీ సర్కారుకు భజన చేయడానికి ఉద్దేశించిన ప్రెస్ నోట్ లాగా కనిపిస్తోంది తప్ప.. ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న.. ఏపీ రాష్ట్రప్రయోజనాల గురించి మాట్లాడే నాయకుడి వాయిస్ లాగా కనిపించడం లేదు. 

కేంద్ర బడ్జెట్ ఎలాగైనా ఉండవచ్చు గాక.. కానీ.. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినంత వరకు ఇది ద్రోహపూరిత బడ్జెట్ అని చెప్పాల్సిందే. ఏపీ విషయంలో ఈ బడ్జెట్ ఎంత బేవార్సుగా ఉన్నదంటే.. దీనిగురించి అభిప్రాయాలు చెప్పడానికి.. బడ్జెట్ ను కీర్తించడానికి ఏపీ బీజేపీ నాయకులకు కూడా మొహం చెల్లడం లేదు. 

మీడియాకు ఎక్కడా చిక్కకుండా వారు మొహం చాటేసుకుని తిరుగుతున్నారు. అలాంటిది.. తగుదునమ్మా అంటూ పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్ ఇస్తూ బడ్జెట్ ను కీర్తించడం.. ఏపీ ప్రయోజనాల గురించి, పోలవరం గురించి, రైల్వేజోన్ గురించి, రాజధాని నిధుల గురించి కనీసం గట్టిగా తన గళాన్ని వినిపించకపోవడం సిగ్గు చేటనే వ్యాఖ్య సర్వత్రా వినిపిస్తోంది. అందుకే పవన్ కల్యాణ్ లో చేవ చచ్చిపోయిందా అని అనిపిస్తోంది.

ఈ ప్రెస్ నోట్ బదులుగా పవన్ మౌనంగా ఉన్నా సరిపోయేదని.. మోడీ భజన చేయడం ద్వారా రాగల మైలేజీ మిస్సవుతానేమో ననే భయంతో ఇది తెచ్చినట్టుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఏపీ ప్రయోజనాల కోసం మోడీ, అమిత్ షా ల గల్లా పట్టుకుని రావాల్సినవి సాధించుకు వస్తానని బహిరంగ సభా వేదికల మీద పూనకం వచ్చినట్టుగా ఊగిపోతూ మాట్లాడే నాయకుడు.. స్పందించే తీరు ఇదేనా అని ఆయన అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. తనలో చేవ చచ్చిపోలేదని ఆయన ఎలా నిరూపించుకొంటారో మరి!?