కొత్త రాజ్యాంగం కావాలట ….కానీ అది ఎలా ఉండాలో చెప్పడు

సాధారణంగా మావోయిస్టులు (ఇదివరకు నక్సలైట్లు అనేవారు) భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే విషయాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని ఒప్పుకోరు. దేశానికి స్వాతంత్య్రం రాలేదనే ఇప్పటికీ వాదిస్తుంటారు. తెలంగాణా సీఎం కేసీఆర్ ను మావోయిస్టులు ఆవహించారా…

సాధారణంగా మావోయిస్టులు (ఇదివరకు నక్సలైట్లు అనేవారు) భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే విషయాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని ఒప్పుకోరు. దేశానికి స్వాతంత్య్రం రాలేదనే ఇప్పటికీ వాదిస్తుంటారు. తెలంగాణా సీఎం కేసీఆర్ ను మావోయిస్టులు ఆవహించారా అనే అనుమానం కలుగుతోంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే ఆయన విలేకరుల సమావేశం పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అంటే ప్రధాని మోడీని అన్నమాట తిట్టిన తిట్టు తిట్టకుండా తన శైలిలో తిట్టి పారేశాడు.

ఒక్క మాటలో వీరంగం వేశాడని చెప్పుకోవాలి. ఆ ఊపులోనే దేశానికి కొత్త రాజ్యాంగం కావాలన్నారు. కొత్త రాజ్యాంగం మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75  ఏళ్ళు గడిచినా ప్రజలు ఆశించిన విధంగా పరిపాలన జరగడం లేదన్నారు. 80 సార్లకు పైగా రాజ్యాంగాన్ని ఎందుకు సవరించారో సమాధానం చెప్పాలన్నారు.

ఇలా రెచ్చిపోయిన కేసీఆర్ ఇదే రాజ్యాంగం తన యాభై ఏళ్ళ ప్రజాజీవితంలో తనకు ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు. తనకు అవకాశాలు కల్పించిన రాజ్యాంగాన్ని హఠాత్తుగా మార్చాలని ఎందుకు కోరుతున్నారు. కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ మీద, మోడీ మీద కసి, కోపం. సరే …కారణం ఏదైనా కొత్త రాజ్యాంగం కావాలనే ఆలోచన కేసీఆర్ కు రావడంలో తప్పులేదు.

ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. అలాంటి లీడర్ కు అనేక ఆలోచనలు ఉంటాయి. కాదనలేం. కొత్త రాజ్యాంగం కావాలని తాను కోరుకుంటున్నప్పుడు ఆ రాజ్యాంగం ఎలా ఉండాలని అనుకుంటున్నాడో తాను కసరత్తు చేశారా? ఇప్పుడున్న రాజ్యంగంలో ఫలానా లోపాలు ఉన్నాయని, ఆ లోపాలు లేని రాజ్యాంగం ఇలా ఉండాలని తాను చెప్పారా? కొత్త రాజ్యాంగం మీద చర్చ జరగాలన్నారు.

కేసీఆర్ వంటి ఆలోచన ఉన్న వారంతా కొత్త రాజ్యాంగం కావాలనే అంటారు. కానీ కొత్త రాజ్యాంగం ఇలా ఉండాలని కేసీఆర్ ఏదైనా చర్చా పత్రం విడుదల చేస్తే దాని మీద చర్చ జరుగుతుంది. అదేమీ లేకుండా ముందస్తు అధ్యయనం చేయకుండా ప్రవేశ పెట్టే ప్రభుత్వ పథకాల మాదిరిగా కొత్త రాజ్యాంగం కావాలంటే కుదురుతుందా? కొత్త రాజ్యాంగం అంటే రైతుబంధు, దళితబంధు పథకం కాదు కదా. ముందుగా కేసీఆర్ తన ఆలోచనలు ఏమిటో ప్రజలకు చెప్పాలి.

ఆ పని చేయకుండా మాట్లాడితే ఎలా? మోడీ మీద కోపంతో కొత్త రాజ్యాంగం కావాలంటున్నాడుగానీ ఆయనకంటూ ఆలోచనలు లేవు. ఇదిలా ఉంటే ఫెడరల్ ఫ్రంట్ పెడతానని తానెక్కడా చెప్పలేదని కేసీఆర్ అన్నారు. ఒక్కసారి పాత వీడియోలు, పత్రికలు ఆయన తిరగేస్తే ఆ మాట అన్నాడో లేదో తెలుస్తుంది.

కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడిందంతా రైటా? రాంగా? అనే విషయం పక్కకు పెడితే, మోడీ, బీజేపీపై ఉన్న కోపాన్నంతా కక్కేశాడు. కానీ ఏపీ సీఎం జగన్ ఆ పని చేయలేకపోయాడు. బడ్జెట్ బాగాలేదని కొందరు వైసీపీ నాయకులు అన్నారు గానీ జగన్ మనసులో ఏముందో తెలియదు. నాయకుల అభిప్రాయమే ఆయన అభిప్రాయం అనుకోవాలా?