కేసీయార్ ప్రసంగం మరో ఉద్యమానికి నాంది అవుతుందా?

నేడు కేసీయార్ బడ్జెట్ 2022 కి నిరసనగా పెట్టిన ప్రెస్మీట్ మరో ఉద్యమానికి కొబ్బరికాయ కొట్టినట్టుగా ఉంది. తెలంగాణా ఉద్యమాన్ని నడిపి స్వరాష్ట్రాన్ని సాకారం చేసుకున్న కేసీయార్ ఇప్పుడు తన గురిని కేంద్రంలో మార్పుపై…

నేడు కేసీయార్ బడ్జెట్ 2022 కి నిరసనగా పెట్టిన ప్రెస్మీట్ మరో ఉద్యమానికి కొబ్బరికాయ కొట్టినట్టుగా ఉంది. తెలంగాణా ఉద్యమాన్ని నడిపి స్వరాష్ట్రాన్ని సాకారం చేసుకున్న కేసీయార్ ఇప్పుడు తన గురిని కేంద్రంలో మార్పుపై పెట్టారు. అది నేటి ప్రెస్మీట్ తో పూర్తిగా తేటతెల్లమైంది. 

నిరసన ప్రెస్మీట్ అంటే అదేదో మొక్కుబడి పలుకులు కావు. సహేతుకంగా, సాధికారికంగా చేసిన ప్రసంగం. ప్రజలకి కనువిప్పు కలిగేలా ఇంగ్లీష్, హిందీ, తెలుగుల్లో చేసిన బలమైన భాషణం. 

ఇన్నాళ్లూ మనమనుకుంటున్నది ఒకటే. మనదేశం పెట్రోల్ మీద, లిక్కర్ మీద నడవాలంతే అని… మనదేశంలో ఉన్న జనాభాకి సరిపడా వనరులు లేవని..మన దేశం ఎప్పటికీ మారే అవకాశం లేదని..ఎవరు పవర్లోకొచ్చినా దేశానికి మార్పేమీ ఉండదని…

అయితే ఈ విషయంలో కేసీయార్ ఒక విషయం విశదపరిచారు. 4 లక్షల మెగా వాట్ల కరెంటు మనదేశం ఉత్పత్తి చేస్తుంటే అందులో 2 లక్షల మెగా వాట్లకు మించి జనం ఖర్చు చేయలేరట. అంటే ఇవ్వగలిగి ఉన్నా దేశం కరెంటు ఎందుకివ్వలేకపోతోంది అనేది మొదటి ప్రశ్నగా సంధించారు. ఇప్పటికీ మనదేశంలో 65% ప్రాంతాల్లో కరెంటు ఇబ్బందులెందుకున్నాయని అడిగారు.  సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు తెలంగాణా పరిస్థితి కూడా ఇలాగే ఉండేదని.. కానీ, ప్రత్యేక రాష్ట్రమయ్యాక 24 గంటల నిర్విరామ కరెంటుని అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఒక్క తెలంగాణాయేనని చెప్పారు. 

మనదేశంలో ప్రపంచంలో బలమైన శక్తిగా నిలబడగలిగే అన్ని వనరులూ ఉన్నాయని, అయితే లేనిదల్లా కేంద్ర ప్రభుత్వం బుర్రలో గుజ్జేనని చెప్పారు. 

మతం కబుర్లు చెప్పి ఎమోషనల్ పాలన చేసే ఆలోచనే తప్ప ఎక్కడా దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే ఆలోచన భాజపాకి, కాంగ్రెసుకీ లేదని చెప్పారు. 

ఈ దేశంలో కొత్త విప్లవం రావాలని, యువకులు కొత్త మార్పు కోసం పోరాడాలని, ఈ దిశగా కొత్త విప్లవానికి నాంది పలికే ఆలోచనలో ఉన్నామని..అయితే అది ఏ రూపంలో కార్యరూపం దాలుస్తుందో ఇంకా తెలియదనీ మనసులో మాట బయటపెట్టేశారు. 

ఇప్పుడు అసలు విషయానికొద్దాం.

ఇన్ని చెప్పిన కేసీయార్ కి ఉన్న శక్తియుక్తులేవిటి?

– ప్రధానంగా కేంద్రంలో భాజాపాకి ఎదురునిలబడగలిగే జాతీయ శక్తి లేదు. సరైన వారసుడు లేక కాంగ్రెసు నిర్వీర్యమైపోయింది. ఆంధ్ర, తమిళనాడు, బెంగాల్…ఇలా చాలాచోట్ల ప్రాంతీయ పార్టీలు పుంజుకున్నాయి. ఆ భాజపా వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకతాటి మీదకి తీసుకురాగలిగే రాజకీయ నైపుణ్యం, భాషాపటుత్వం కేసీయార్ కి పుష్కలంగా ఉన్నాయి. 

– జాతీయ నాయకత్వానికి ప్రధానంగా కావాల్సింది భాష. శుద్ధ హిందీలో జాతీయస్థాయిలో హిందువుల్ని, ఉర్దూ పదాల పోహళింపుతో ముస్లిములని ఆకట్టుకోగలిగే భాషా నైపుణ్యం కేసీయార్ కి ఉంది. 

– యాజ్ఞాలు చేయడం, యాదాద్రి నిర్మించడం వంటి హిందూత్వ పోకడలతో పాటు ముస్లిములతో మమేకమైపోగలిగే సెక్యులర్ వ్యవహారశైలి కూడా కేసీయార్ లో ఉంది.  

– గతంలో మోదీ గుజరాత్ సీయం గా విజయం సాధించి దేశ ప్రధాని అభ్యర్థిగా అర్హత సంపాదించినట్టు, ఇక్కడ  తెలంగాణాని అభివృద్ధి చెందుతున్న టాప్ స్టేట్స్ లో ఒకటిగా నిలిపి, జాతీయస్థాయిలో రాజకీయం నడపడానికి అర్హత సంపాదించారు కేసీయార్. 

– రాజకీయమా, రాజతంత్రమా అనేది పక్కన పెడితే తెలంగాణా రాష్ట్రంలో తెరాసా వ్యతిరేక మీడియాకి గొంతు లేదు. ఉన్నా వినిపించడం లేదు. ఏ అభివృద్ధి చెందిన దేశమైనా మీడియాని కంట్రోల్లో పెట్టే ముందుకెళ్లింది. అలా పెట్టగలగడం ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కష్టం. అయినా తన స్థాయిలో ఆ దిశగా ప్రయత్నాలు చేసి సఫలీకృతుడైన నాయకుడు కేసీయార్. అటువంటి మీడియా కంట్రోల్ జాతీయ స్థాయిలో కూడా చేయగలిగితే కేసీయార్ రాజకీయఖడ్గానికి మరింత పదును చేకూరుతుంది. 

– కేసీయార్ కి ఉన్నది వారసుల బలం. వాళ్లకి ఆలోచనాబలం, తెలివి కూడా ఉన్నాయి. హిందీలోనూ, ఇంగ్లీషులోనూ అనర్గళంగా మాట్లాడి మెప్పించగల వాళ్లు తన పార్టీలో ఉన్నారు. అది జాతీయ రాజకీయానికి అత్యంత అవసరం. 

ఇలా అన్ని అర్హతలూ ఉన్నా కాలం, ఖర్మం కలిసిరావాలి. అవి కలిసొస్తాయా లేదా అనేది ఎవ్వరూ చెప్పలేరు. కాగా జాతీయస్థాయి రాజకీయ నాయకత్వానికి తగిన అర్హతలన్నీ ఉన్నాయి కనుక ప్రయత్నించడంలో తప్పులేదు. అన్నీ కుదిరితే 2024 ప్రధాని అభ్యర్థిగా భాజాపా వ్యతిరేక కూటమిలో కేసీయార్ ఉండే అవకాశం లేకపోలేదు. 

అయితే..కాంగ్రెసు వైఫాల్యాల్ని ఎత్తిచూపుతూ ఇలాంటి ప్రసంగాలే చేసి మోదీ జనం మార్కులు కొట్టగలిగారు. ఇప్పుడు మోదీ విధానాలని వైఫల్యంగా చూపిస్తున్న కేసీయార్ ప్రసంగాలు ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇవి రాబోయే 2024 ఎన్నికల యుద్ధం ఎలా ఉండబోతోందో తెలిపే సూచనల్లాగా ఉన్నాయి.  

ప్రజలు ఆశావాదులు. ఎవరు ఆ సమయానికి తమకు తెలివైనవాళ్లుగా, సమర్ధులుగా కనిపిస్తారో వారికి ఓట్లేసి గెలిపిస్తారు. ఆ తెలివిని, సమర్థతను చాటుకోవాల్సిన బాధ్యత నాయకులది. అంతే. తరతరాలుగా ఇదే భారతదేశ రాజకీయ చరిత్ర. 

శ్రీనివాసమూర్తి