జ‌గ‌న్‌ది మౌన‌మా? పిరికిత‌న‌మా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మంగ‌ళ‌వారం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌పై దేశ వ్యాప్తంగా అసంతృప్తి వెల్లువెత్తుతోంది. దేశంలో ఏ ఒక్క వ‌ర్గానికి అనుకూలంగా బ‌డ్జెట్ లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా తెలుగు…

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మంగ‌ళ‌వారం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌పై దేశ వ్యాప్తంగా అసంతృప్తి వెల్లువెత్తుతోంది. దేశంలో ఏ ఒక్క వ‌ర్గానికి అనుకూలంగా బ‌డ్జెట్ లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌చ్చే స‌రికి విభ‌జ‌న హామీలు నెర‌వేర్చేందుకు బ‌డ్జెట్‌లో క‌నీస కేటాయింపులు కూడా లేక‌పోవ‌డం….మ‌న ప‌ట్ల మోడీ స‌ర్కార్ వివ‌క్ష‌ను మ‌రోసారి బ‌య‌ట పెట్టింది. విభ‌జ‌న హామీల అమ‌లుకు మ‌రో రెండేళ్లు మాత్ర‌మే కాల‌ప‌రిమితి ఉన్న నేప‌థ్యంలో… కేంద్ర ప్ర‌భుత్వ ఉదాసీన‌, నిర్ల‌క్ష్య వైఖ‌రి వ‌ల్ల ఇక తెలుగు స‌మాజానికి ఏ విధంగా న్యాయం జ‌రుగుతుంద‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్‌పై ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నోరు మెద‌ప‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం, ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌రోవైపు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేంద్ర బ‌డ్జెట్‌, త‌న రాష్ట్రానికి, దేశానికి జ‌రిగిన అన్యాయంపై కేంద్రాన్ని చాకిరేవు పెట్టారు. కేసీఆర్ స్థాయిలో కాక‌పోయినా క‌నీసం త‌న రాష్ట్రానికి కేంద్ర బ‌డ్జెట్‌లో జ‌రిగిన అన్యాయంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్పందించ‌క‌పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ది మౌన‌మా లేక పిరికిత‌న‌మా? అనే ప్ర‌శ్న‌లు పెద్ద ఎత్తున తెర‌పైకి వ‌స్తున్నాయి. కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు, బీజేపీ మిత్ర‌ప‌క్ష పార్టీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక అధికార పార్టీ వైపు నుంచి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి స్పందించ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింద‌ని వారు విమ‌ర్శించారు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వ వివ‌క్ష‌ను, నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌శ్నించ‌డంలో, నిల‌దీయ‌డంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌నేందుకు ఆయ‌న మౌన‌మే నిద‌ర్శ‌న‌మ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఇక ఇప్పుడు కూడా కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌క‌పోతే, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎప్పుడు మాట్లాడ్తామ‌ని అనుకుంటున్నార‌నే నిల‌దీత‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కేంద్ర బ‌డ్జెట్‌పై త‌న‌దైన రీతిలో స్పందించ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఉత్పాద‌క‌, వ్య‌వ‌సాయ రంగాల‌ను బ‌లోపేతం చేయ‌డం ద్వారా దేశ ప్ర‌గ‌తిని ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్ర బ‌డ్జెట్‌కు బీజేపీ ప్ర‌భుత్వం రూప‌క‌ల్ప‌న చేయ‌డం ఆశావ‌హ ప‌రిణామ‌మ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేర్కొన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన విభ‌జ‌న హామీలు, పోల‌వ‌రం ప్రాజెక్ట్ వంటి అంశాలు బ‌డ్జెట్‌లో చోటు ద‌క్క‌క‌పోవ‌డం కొంత నిరాశ క‌లిగించింద‌ని ఆయ‌న వాపోయారు.

క‌నీసం ఈ మాత్ర‌మైనా జ‌గ‌న్ మాట్లాడ‌లేక‌పోయారే అని ప్ర‌శ్నించే వాళ్ల‌కు అధికార పార్టీ ఏం స‌మాధానం చెబుతుంది. అన్యాయం చేసే వాళ్ల కంటే, దాన్ని మౌనంగా చూస్తున్న వాళ్ల‌ది కూడా అంతే నేర‌మ‌వుతుంద‌ని పౌర స‌మాజం జ‌గ‌న్‌ను హెచ్చ‌రిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నా కేవ‌లం త‌న‌పై కేసుల భ‌యంతోనే జ‌గ‌న్ నోరెత్త‌లేద‌నే విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. మోడీ స‌ర్కార్ చేస్తున్న అన్యాయంలో జ‌గ‌న్ భాగ‌మ‌వుతూ, రాజ‌కీయంగా భారీ మూల్యం చెల్లించడానికి కూడా  సిద్ధ‌మ‌వుతున్నార‌నే అనుమానం ఆయ‌న చ‌ర్య‌లే క‌లిగిస్తున్నాయి.