మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో కలిసి చనిపోవాలనుకున్నారు. అబ్బాయి పురుగుల మందు తాగాడు కానీ అమ్మాయి తాగలేదు. హాస్పిటల్ నుంచి కోలుకొని బయటకొచ్చిన అబ్బాయి, అమ్మాయిని హత్య చేశాడు. అనంతపురం జిల్లాలో జరిగింది ఈ ఘటన.
జిల్లాలోని కల్యాణదుర్గంకు చెందిన రఘు, షాహిదా బేగం మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. మతాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. ఈ క్రమంలో షాహిదాకు మరో సంబంధం కూడా చూశారు. దీంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.
ఇద్దరి కోసం పురుగుల మందు తెచ్చాడు రఘు. ముందుగా అతడే తాగాడు. కానీ షాహిదా మాత్రం భయపడి తాగలేదు. తెలిసిన వ్యక్తులు రఘును హాస్పిటల్ లో జాయిన్ చేయడంతో 4 రోజుల చికిత్స తర్వాత అతడు కోలుకున్నాడు.
తిరిగి ఇంటికొచ్చిన రఘు ఈ నెల 17న షాహిదాను బయటకు తీసుకెళ్లాడు. తనతో పాటు సూసైడ్ చేసుకోనందుకు షాహిదాపై కోపం పెంచుకున్న రఘు, ఆమెను చంపేశాడు. రఘు ఒక్కడే వెనక్కి రావడం, అమ్మాయి కనిపించకపోవడంతో.. అనుమానించిన కుటుంబ సభ్యులు రఘుపై పోలీసులకు ఫిర్యాదుచేశారు.
పోలీసులు తమదైన స్టయిల్ లో ప్రశ్నించడంతో రఘు నిజం ఒప్పుకున్నాడు. షాహిదాను హత్య చేసిన ప్రాంతాన్ని నిన్న పోలీసులకు చూపించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు రఘుపై హత్య కేసు నమోదుచేశారు.