బాబుతో స‌మావేశానికి మాజీ మంత్రి డుమ్మా!

క‌డ‌ప‌లో టీడీపీ జోన్‌-5 స‌మావేశానికి మాజీ మంత్రి, నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ ఇన్‌చార్జ్ భూమా అఖిల‌ప్రియ డుమ్మా కొట్ట‌డం ఆ పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క‌డ‌ప‌, శ్రీ‌స‌త్య‌సాయి, అనంత‌పురం, నంద్యాల‌, క‌ర్నూలు జిల్లాల ప‌రిధిలోని ఐదు…

క‌డ‌ప‌లో టీడీపీ జోన్‌-5 స‌మావేశానికి మాజీ మంత్రి, నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ ఇన్‌చార్జ్ భూమా అఖిల‌ప్రియ డుమ్మా కొట్ట‌డం ఆ పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క‌డ‌ప‌, శ్రీ‌స‌త్య‌సాయి, అనంత‌పురం, నంద్యాల‌, క‌ర్నూలు జిల్లాల ప‌రిధిలోని ఐదు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల క్ల‌స్ట‌ర్‌, బూత్‌స్థాయి సమీక్ష నిర్వ‌హించారు. బాబు నేతృత్వంలో సాగిన ఈ స‌మీక్ష స‌మావేశానికి 35 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు, పార్ల‌మెంట్ అధ్య‌క్షులు, పొలిట్‌బ్యూరో స‌భ్యులు త‌దిత‌ర టీడీపీ ముఖ్య నేత‌లు హాజ‌ర‌య్యారు.

కానీ  భూమా అఖిల‌ప్రియ మాత్రం హాజ‌రు కాక‌పోవ‌డంపై ర‌క‌ర‌కాల చ‌ర్చ జ‌రుగుతోంది. ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ అభ్య‌ర్థిగా త‌న పేరు ప్ర‌క‌టించాల‌ని గ‌త కొంత కాలంగా చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై ఆమె ఒత్తిడి తెస్తున్నారు. అయితే క్షేత్ర‌స్థాయిలో అఖిల‌ప్రియ‌పై టీడీపీ స‌ర్వేలో పాజిటివ్ రిపోర్ట్ రాలేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం. దీంతో ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌ప్రియ అభ్య‌ర్థిత్వాన్ని చంద్ర‌బాబు హోల్డ్‌లో పెట్టారు.

ప్ర‌స్తుతం నంద్యాల జిల్లాలో నారా లోకేశ్ పాద‌యాత్ర సాగుతోంది. త‌న‌కు టికెట్ ద‌క్క‌ద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతుండ‌డంతో లోకేశ్‌ను ప‌దేప‌దే ఆమె క‌లవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇదిలా వుండ‌గా ఇదే స‌మ‌యంలో క‌డ‌ప‌లో రాయ‌ల‌సీమ స్థాయి టీడీపీ నేత‌ల స‌మావేశాన్ని నిర్వ‌హించ‌గా అఖిల‌ప్రియ వెళ్ల‌క‌పోవ‌డం స‌హ‌జంగానే చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

టికెట్‌పై అధిష్టానం నాన్చివేత ధోర‌ణి ప్ర‌ద‌ర్శించ‌డంపై ఆమె ఆగ్ర‌హంగా ఉన్నారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అఖిల‌ప్రియ గైర్హాజ‌రుపై చంద్ర‌బాబు ఆరా తీసిన‌ట్టు తెలిసింది. అయితే ఆమెకు అంత సీన్ లేద‌ని ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా టీడీపీ ముఖ్య నేత‌లు చంద్ర‌బాబుతో అన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.