ఇదేనా రామోజీ మార్గ‌ద‌ర్శ‌కం!

నీతుల‌న్నీ ఇత‌రుల‌కు చెప్పేందుకే త‌ప్ప‌, తాను ఆచ‌రించ‌డానికి కాద‌ని ఈనాడు ప‌త్రికాధినేత రామోజీరావు నిరూపించారు. స‌మాచార హ‌క్కు చ‌ట్టంపై త‌న మీడియా ద్వారా పెద్ద ఎత్తున అవ‌గాహ‌న క‌ల్పించారు. తెలుగు నాట‌ స‌మాచార విప్ల‌వాన్ని…

నీతుల‌న్నీ ఇత‌రుల‌కు చెప్పేందుకే త‌ప్ప‌, తాను ఆచ‌రించ‌డానికి కాద‌ని ఈనాడు ప‌త్రికాధినేత రామోజీరావు నిరూపించారు. స‌మాచార హ‌క్కు చ‌ట్టంపై త‌న మీడియా ద్వారా పెద్ద ఎత్తున అవ‌గాహ‌న క‌ల్పించారు. తెలుగు నాట‌ స‌మాచార విప్ల‌వాన్ని ఆయ‌న తీసుకొచ్చారు. స‌మాచారం పొంద‌డం ప్ర‌తి పౌరుడి హ‌క్కు అని, ఇవ్వాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంద‌ని త‌న మీడియా ద్వారా విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించారు.

కేవ‌లం ఈనాడు సంస్థ స‌మాచార హ‌క్కుపై చైత‌న్య జ్వాల‌ను ర‌గిల్చిందంటే అతిశ‌యోక్తి కాదు. స‌మాచారాన్ని ఎలా పొందాలి, ఒక‌వేళ కోరుకున్న స‌మ‌చారాన్ని ఇవ్వ‌క‌పోతే త‌దుప‌రి ఏం చేయాలో ఈనాడు విస్తృతంగా క‌థ‌నాలు ప్ర‌చురించింది. ఈనాడు ర‌గిల్చిన స‌మాచార హ‌క్కు స్ఫూర్తితో ఎంతో మంది ల‌బ్ధి పొందారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు చోటు చేసుకున్నాయి. ప్ర‌భుత్వ శాఖ‌ల్లో అవినీతిని అడ్డుక‌ట్ట వేయ‌గ‌లిగారు. స‌మాచార హ‌క్కు చ‌ట్టంపై ఏకంగా ఈనాడు ప్ర‌త్యేకంగా పుస్త‌కాలు ప్ర‌చురించి, త‌క్కువ ధ‌ర‌కే విక్ర‌యించింది.

స‌మాచార హ‌క్కు చ‌ట్టంపై విప్ల‌వాత్మ‌క‌మైన చైత‌న్యాన్ని తీసుకొచ్చిన రామోజీరావు, త‌న విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం చేతులెత్తేశారు. మార్గ‌ద‌ర్శికి సంబంధించిన స‌మాచారాన్ని ఇవ్వ‌డానికి స‌సేమిరా అన్నారు. అందుకే నీతులు చెప్పేందుకే త‌ప్ప‌, ఆచ‌ర‌రించ‌డానికి కాద‌ని రామోజీరావు విష‌యంలో సెటైర్స్ పేల‌డం. స‌మాచార హ‌క్కు చ‌ట్టానికి సంబంధించి రామోజీ సార‌థ్యంలో న‌డుస్తున్న ఈనాడు చెప్పిన నీతి సూత్రాలెంటో తెలుసుకుందాం.

“ప్ర‌భుత్వ పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త‌ను పెంపొందించి, ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాల్లో గోప్య‌త‌ను నివారించి, ప్ర‌భుత్వ పాల‌నా విధానాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచేందుకు పౌరుల‌కు క‌ల్పించిన అద్భుత అవ‌కాశ‌మే స‌మాచార హ‌క్కు. స‌మాచారాన్ని ఇవ్వ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త అయితే, పొంద‌డం పౌరుల హ‌క్కు”

“1976లో రాజ్‌నారాయ‌ణ్ వ‌ర్సెస్ ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారత‌దేశం ప్ర‌జాస్వామ్య దేశ‌మ‌ని, ప్ర‌జ‌లు సార్వ‌భౌముల‌ని, ప్ర‌భుత్వం ప్ర‌జా ప్ర‌తినిధుల ప‌నితీరుకు సంబంధించిన స‌మాచారాన్ని పౌరుల‌కు త‌ప్ప‌నిస‌రిగా అందించాల్సిందే న‌ని, స‌మాచార హ‌క్కు భార‌త రాజ్యాంగంలో పొందుప‌రిచిన ప్రాథ‌మిక హ‌క్కుల్లో అంత‌ర్భాగ‌మ‌ని పేర్కొంది”

మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్ర‌మాల‌పై  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుదీర్ఘ పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. డిపాజిట‌ర్ల‌కు మొత్తం చెల్లింపులు చేశామ‌ని రామోజీరావు అంటున్నారు. అయితే చెల్లింపుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఇవ్వాల‌ని గ‌తంలో స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా అడిగినా రామోజీరావు ప‌ట్టించుకోలేదు. మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్ 2007 మార్చి చివరి నా­టి­కి  డిపాజిట్ల రూపంలో సేకరించిన మొత్తం సొమ్ము రూ.2541 కోట్లు. డిపాజిట‌ర్ల‌కు తిరిగి చెల్లించిన సొమ్ము రూ.2596 కోట్లు. ఖాతాలో బ్యా­లెన్స్‌ రూ.­5.43 కోట్లు ఉన్న‌ట్టు రామోజీరావు త‌ర‌పు న్యాయ‌వాది తెలిపారు.

అయితే డిపాజిట‌ర్ల వివ‌రాలు ఇవ్వాలని అడిగితే మాత్రం ఎందుకు ఇవ్వ‌లేదు అర్థం కావ‌డం లేదు. చివ‌రికి ఉండ‌వ‌ల్లి 17 ఏళ్ల పాటు న్యాయ‌పోరాటం చేసి సుప్రీంకోర్టు నుంచి రామోజీకి ఆదేశాలు ఇవ్వాల్సి రావ‌డం గ‌మ‌నార్హం. ‘డిపాజిటర్లకు చెల్లింపు వివరాలు అందజేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను, రామోజీరావును ఆదేశిస్తున్నాం’ అని జస్టిస్‌ సూర్యకాంత్‌ ఉత్తర్వులు ఇవ్వ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

అవినీతిని నిర్మూలించ‌డం, పార‌ద‌ర్శ‌క‌తకు పెద్ద పీట వేసేందుకు తీసుకొచ్చిన స‌మాచార హ‌క్కు చ‌ట్టం నుంచి తాను మిన‌హాయింపు అన్న ధోర‌ణిలో రామోజీరావు వ్య‌వ‌హ‌రించిన తీరు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఇదేనా మీ మార్గ‌ద‌ర్శ‌కం అని రామోజీని పౌర స‌మాజం ప్ర‌శ్నిస్తోంది. కేవ‌లం మాట‌ల‌తో స‌మాజం ఉన్న‌తంగా త‌యారు కాదు. చేత‌లే అంతిమంగా గొప్ప స‌మాజ ఆవిష్క‌ర‌ణకు దారి తీస్తాయి. రామోజీరావు రాత‌లకు, చేత‌ల‌కు న‌క్క‌కు నాగ‌లోకానికి ఉన్నంత తేడా అని మార్గ‌ద‌ర్శి ఫైనాన్ష్ సంస్థ వివ‌రాలు వెల్ల‌డిలో దాట‌వేత ధోర‌ణే నిద‌ర్శ‌నం.