ప్రపంచ చరిత్రను ఔపోసన పట్టిన మేధావి చంద్రబాబు!

చింతచచ్చినా పులుపు చావలేదన్నట్టుగా.. ముసలితనం పైబడి చివరి చాన్స్ అడిగే రోజులు వచ్చినా కూడా డాంబికాలకు మాత్రం ఏం తక్కువ లేదు చంద్రబాబునాయుడుకు! అబద్ధాలు చెప్పడానికి, అజ్ఞానాన్ని ప్రదర్శించడానికి వయసుతో పనేముంది అని వాదించే…

చింతచచ్చినా పులుపు చావలేదన్నట్టుగా.. ముసలితనం పైబడి చివరి చాన్స్ అడిగే రోజులు వచ్చినా కూడా డాంబికాలకు మాత్రం ఏం తక్కువ లేదు చంద్రబాబునాయుడుకు! అబద్ధాలు చెప్పడానికి, అజ్ఞానాన్ని ప్రదర్శించడానికి వయసుతో పనేముంది అని వాదించే వ్యక్తి ఆయన! ఆ ధైర్యంతోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య లాంటిది ప్రపంచ చరిత్రలోనే మరెక్కడా లేదని చంద్రబాబునాయుడు వాక్రుచ్చుతున్నారు.

వైఎస్ వివేకా హత్య అనేది ఎలాంటిదో, ఏ కేటగిరీకి చెందినదో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కేసువిచారణ దశలోనే ఉంది. అయినా చంద్రబాబునాయుడు దాని గురించి ఎలాంటి నిర్ధరణకు వచ్చారో గానీ.. తనకు ప్రపంచ చరిత్ర మొత్తం తెలుసునన్నట్టుగా.. ఆ చరిత్రలో ఇదెక్కడా లేదన్నట్టుగా గప్పాలు కొట్టడం తమాషాగా ఉంది. 

అసలు వివేకా హత్య కేసు ఎలాంటి కేటగిరీకి చెందుతుందో పరిశీలిద్దాం. హత్య ఎవరు చేశారు? ఎవరు చేయించారు? ఈ నిజానిజాల సంగతి తర్వాత.. ముందు ఏ వాదనలు వినిపిస్తున్నాయి.. అలాంటి హత్యలు ప్రపంచంలో ఎక్కడా లేవా అనేది మాత్రం చూద్దాం..

(1) హత్యచేసినవారు చెబుతున్న వాదన 

హత్య చేసిన నలుగురు ఎవరో తెలిసింది. వాళ్లు సీబీఐకు తాము ఎందుకు హత్య చేశామో చెప్పారు. బెంగుళూరు వివేకానందరెడ్డి చేసిన లాండ్ సెటిల్మెంటుకు సంబంధించి పుచ్చుకున్న దందా సొమ్ము పంచుకోవడంలో వారికి తేడాలు వచ్చాయి. తన వాటా తనకు ఇవ్వకుండా తూలనాడినందుకు చంపినట్టుగా వారు చెప్పారు. 

..ఇలాంటి భూవివాదాలు, లాండ్ సెటిల్మెంట్లకు, దోపిడీలకు సంబంధించిన డబ్బుల పంపకాల్లో తగాదాలు హత్యలకు దారితీయడం ప్రపంచంలో ఎక్కడా జరగదా? చంద్రబాబునాయుడుకు ఆమాత్రం తెలియదా?

(2) అవినాష్ రెడ్డి చెబుతున్న వాదన

వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారు. తాను కూడా ముస్లింగా, అక్బర్ బాషాగా, మారారు. ఆమె ద్వారా పుట్టిన కొడుకును రాజకీయ వారసుడు, ఆస్తులకు వారసుడు చేయాలనుకున్నారు. ఆ విషయంలో కుటుంబంలో తగాదాల వల్ల ఆయన సొంత కుటుంబ సభ్యులే చంపించారు. ఆయన అల్లుడికి కూడా ఇందులో పాత్ర ఉంది.

..ఇద్దరేసి భార్యలున్న వ్యక్తుల కుటుంబాల్లో ఇలాంటి రచ్చలు చాలా సాధారణం. ఇవి హత్యలకు దారితీసిన సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. ఇలాంటి రెండు భార్యల సినిమాలు, తగాదాలు, కక్షలు- హత్యల అంశాలపై అనేక సినిమాలు కూడా వచ్చాయి. చరిత్రలో ఇలాంటివి లేవని అంటే చంద్రబాబు అజ్ఞానానికి అది పరాకాష్ట

(3) తెలుగుదేశం, ఎల్లో మీడియా చెబుతున్న వాదన

కడప ఎంపీ సీటు తనకు దక్కకుండా చేస్తాడేమో అనే భయంతో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి కలిసి తమ బంధువు వివేకాను హత్య చేయించారు.

..ఈ వాదన కూడా నిజమే అనుకుందాం. అధికారం కోసం, రాజ్యం కోసం కుటుంబసభ్యుల మద్య హత్యలు జరగడం ప్రపంచంలో ఎక్కడా లేదా? ఏ రాజ్యం చరిత్ర చూసినా.. అయినవాళ్ల, బంధువుల హత్యలతో నిండిఉంటాయి. తండ్రిని చంపిన కొడుకులు, అన్నను చంపిన తమ్ముళ్లు చరిత్రలో ఉదాహరణలుగా వేలకు వేలు కనిపిస్తారు. అంతెందుకు స్వయంగా గొడ్డలి వాడి చంపక పోయినా సరే.. చంద్రబాబునాయుడు అధికారం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణాలు పోవడానికి కారణం కాలేదా? తన సొంత చరిత్రలోనే ఇలాంటి హత్యలను దాచుకుని.. వివేకా హత్య లాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదని చంద్రబాబునాయుడు ఎలా అంటారు?

వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిణామాలు ఇప్పుడు నడుస్తున్నాయి. నిజానిజాలు తేలేదాకా.. వైసీపీ మీద నిందలు వేస్తుండడానికి అవకాశం చిక్కింది. ఈ అవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలని చంద్రబాబునాయుడు అనుకుంటున్నారు. అందుకే ఇలాంటి హత్య ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు లాంటి ఎగస్ట్రా డైలాగులు చెబుతున్నారని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు.