తెలుగు సినిమాలకు అన్నింటికన్నా కీలకం ఏదీ? అని ప్రశ్నించుకుంటే సబ్జెక్ట్ అని ఎవరైనా బదులిస్తారు..క్వాలిటీ అని కూడా అంటారు. కానీ నిర్మాతల వరకు మాత్రం విడుదల తేదీ అన్నదే కీలకంగా మారుతోంది. తెలుగు సినిమా ఇప్పుడు సీజనల్ అయిపోయింది. సంక్రాంతి..సమ్మర్..దసరా ఈ మూడూ కీలకం. ఆ తరువాత ఫిబ్రవరి, డిసెంబర్ లాంటి కొన్ని నెలలు యాడ్ అవుతాయి. ఎగ్జామ్స్ వుండే నెలలు పనికిరావు. వరుస సెలవులు వుండాలి. శుక్ర,శని,ఆది వారాలకు మరో ఒకటి రెండు రోజులు తోడు కావాలి. లేదా అంటే సోలో విడుదల కావాలి. ఇలా మొత్తం వ్యవహారం విడుదల డేట్ చుట్టూ తిరుగుతోంది.
కానీ ఇక్కడే సమస్య వస్తోంది. ఆ విడుదల డేట్ ను రీచ్ కావడానికి ఒక్కోసారి క్వాలిటీని కాంప్రమైజ్ కావాల్సి వస్తోంది. సినిమా ప్లాన్ చేసినపుడు చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్, వర్కింగ్ డేస్ ఇలాంటివి అన్నీ, కొన్ని సినిమాలకు కోవిడ్ అనే సాకు ఒకటి వుంది కానీ చాలా సినిమాలు అలాంటి సాకులు లేకుండానే ఓ ప్లాన్, పద్దతీ లేకుండా ఎటో వెళ్లిపోతున్నాయి.
చివరి నిమిషం వరకు దర్శకులు చెక్కుతూనే వస్తున్నారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, సినిమా విడుదల రోజుల్లోకి వచ్చినా, దర్శకుడు చెన్నయ్ లో కూర్చుని, దగ్గర కూర్చుని చెక్కించుకోవడం అన్నది ఓ ఆనవాయితీగా మారిపోతోంది. ఇంకా గమ్మత్తేమిటంటే క్వాలిటీ ప్రొజెక్షన్ ఎక్కువగా వుండే ఓవర్ సీస్ కాపీ పంపేసిన తరువాత కూడా తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యే కాపీ ని చెక్కడం అన్నది జరుగుతూనే వుంటుంది. మిక్సింగ్ లో మార్పులు, ఆర్ఆర్ లో చిన్న చిన్న చేంజెస్ ఇలా చేస్తూనే వుంటున్నారు లాస్ట్ మినిట్ వరకు.
చాలా సినిమాలకు దర్శకుడు సినిమా ప్రచారానికి దూరంగా వుండిపోవడానికి కారణం ఈ లాస్ట్ మినిట్ హర్రీనే. సినిమా అంతా రెడీ అయిపోతుంది. కాపీ మాత్రం తీయరు. విడుదల డేట్ సడెన్ గా సెట్ అవుతుంది. ఇక అప్పుడు చూడాలి ఉరుకులు..పరుగులు. అంత ముందుగా కాపీ రెడీ అయిన సినిమాకు మళ్లీ ఇప్పుడేంటీ ఈ ముస్తాబు అంటే అది అంతే.
డేట్ ను మీట్ కావడం కోసం ఒక్కోసారి క్వాలిటీని ఫణంగా పెట్టేస్తున్నారు. ఇంకా నయం. మన సెన్సారు జనాలు మంచివాళ్లు. వాళ్లకు ఏకాపీ ఇచ్చినా ఓకె. సెన్సారు కు ఇచ్చే కాపీ థియేటర్లో ఎవరూ చూడలేరు. నిడివికి సరిపడా కాపీ ఇస్తే చాలు. వాళ్లు చెప్పిన మార్పులు చేస్తే చాలు. డిఐ లు, మిక్సింగ్ లు, ఇలా టెక్నికల్ వ్యవహారాలు అస్సలు అక్కరలేదు. సెన్సారు కాపీ అన్నది జస్ట్ ఓ ఫార్మాలిటీగా మారిపోతోంది.
ఈ ప్లానింగ్ పెర్ ఫెక్ట్ గా లేకపోవడం వల్ల సినిమా లాస్ట్ మినిట్ లో హడావుడి జరిగిపోతోంది. ప్లానింగ్ లోపానికి ఒక్క దర్శకుడే కారణం కాదు. సవాలక్ష కారణాలు. హీరోల డేట్ లు కావచ్చు, అనుకోని పనులు కావచ్చు, లాస్ట్ మినిట్ లో షూటింగ్ లు క్యాన్సిల్ కావడం కావచ్చు, ఇలా చాలా అంటే చాలా వుంటాయి. పోనీ అన్నీ ప్రశాంతంగా చేసుకున్న తరువాతే సినిమా విడుదల చేసుకుందాం అంటే కుదరదు. డేట్ దొరకదు.
చిన్న, మీడియం సినిమాల పరిస్థితి మరీ దారుణం. వాళ్లు పాపం, పక్కా ప్లాన్ తో దూరంగా ఓ డేట్ వేసుకుని రెడీ అవుతారు. దగ్గరకు వచ్చేసరికి చెప్పా పెట్టకుండా ఓ పెద్ద సినిమా వచ్చి దాని మీద పడుతుంది. మనది పెద్ద సినిమా, వాళ్లది చిన్న సినిమా. మనం వాళ్లకు చెప్పేదేమిటి? వాళ్లే వెనక్కు వెళ్తారు అనే లోకువ. ఏమీ చేయలేక తిట్టుకుంటూ వెనక్కు వెళ్తుంది చిన్న సినిమా. పెద్ద సినిమాలు అయితే గిల్డ్ లు, పెద్దలు కూర్చుని మాట్లాడుకుంటారు కానీ ఈ చిన్న సినిమాలకు కాదు. వాళ్లకు వాళ్లే సర్దుకోవాలి.
బడ్జెట్ విషయంలో అస్సలు ప్లానింగ్ సెట్ కాదు. యాభై అవుతుంది అనుకున్న సినిమా ఎనభై అవుతుంది. పదిలో అవుతుంది అనుకున్న చిన్న సినిమా పదిహేను దాటేస్తుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే అనుకున్న బడ్జెట్ సగం సినిమాకే అయిపోతుంది. ఇక బడ్జెట్ లేదని సినిమా ఆపేయలేరు. ఆపేసి, ఆ ఫుటేజ్ అంతా అలా బీరువాలో దాచుకుని కూర్చోలేరు. ఆపేస్తే పెట్టినదంతా పోతుంది. అందుకే కోపం, బాధ, ఆక్రోశం అన్నీ పళ్ల బిగువున దాచుకుని మళ్లీ ఎంతకావాలంటే అంతా పెట్టుబడి పెట్టాలి. అలా పెట్టిన తరువాత ఆ రేట్లు రాకపోయినా, ఏదో ఆశతో సినిమాను మార్కెట్ లోకి పంపాలి. సక్సెస్ అయినా ఇంట్లో బాధపడాలి. ఫ్లాప్ అయితే బయటే బాధపడాలి.
ట్రయిలర్ లాంటి వాటికి కూడా ఇదే పద్దతి. ఫలానా రోజు, ఫలానా టైమ్ కు ట్రయిలర్ విడుదల అంటారు. కానీ రెడీ కాదు. ఓ అరగంట ఆగుతారు. మరో అరగంట..కానీ తీరా చేసి, అంత ఆలస్యంగా విడుదలైన ట్రయిలర్ లో కూడా లోటు పాట్లు పక్కాగా కనిపిస్తాయి. వాయిస్ లు సరిగ్గా వుండవు. అదేమంటే హడావుడి అయిపోయింది అంటారు. ట్రయిలర్ ఎప్పుడయితే తేడా వస్తుందో అది సినిమా మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది.
మొత్తం మీద తెలుగు సినిమాకు సవాలక్ష కారణాల వల్ల ప్లానింగ్ గాడి తప్పుతోంది. దాని ప్రభావం అవుట్ పుట్ మీద పడుతోంది. దాంతో నిర్మాతలే అల్టిమేట్ గా నష్టపోతున్నారు.